ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జ్ సందీప్‌తో జగ్గారెడ్డి భేటీ.. ఏం చర్చించారంటే..?
ఏఐసీసీ తెలంగాణ ఇన్చార్జ్ బీఎం సందీప్‌తో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాజకీయ అంశాలపై ఎలాంటి చర్చ జరగలేదని ఆయన స్పష్టం చేశారు. తన కుమారుడి వివాహానికి ఆహ్వానించడంతో పాటు, పార్టీ బలోపేతం, కార్యకర్తలు, నాయకులకు సంబంధించిన అంశాలను సందీప్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. గ్రామ స్థాయి నుంచి హైదరాబాద్ వరకు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కమ్యూనికేషన్ పెంచాలని సూచించినట్లు వెల్లడించారు.
కార్యకర్తలు, నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలి
కాంగ్రెస్ ప్రభుత్వం, పీసీసీ ఇప్పటివరకు ప్రజల కోసం, పార్టీ కోసం చేపట్టిన కార్యక్రమాలతో పాటు ఇంకా ఏవైనా చేయాల్సిన పనులు మిగిలి ఉంటే వాటిని గుర్తించాలని జగ్గారెడ్డి సూచించారు. గ్రామ స్థాయి నుంచి హైదరాబాద్ వరకు పార్టీ కార్యకర్తలు, నాయకుల సమాచారాన్ని సేకరించి, ఎవరైనా దూరంగా ఉంటే వారిని తిరిగి పార్టీతో అనుసంధానం చేయాలని కోరినట్లు చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్‌తో మాట్లాడి, పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా ఇంకా ఏవైనా పెండింగ్ అంశాలు ఉంటే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు వివరించారు.
ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉంది..
రాబోయే ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉందని, ఈ కాలాన్ని పార్టీ బలోపేతానికి ఉపయోగించుకోవాలని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు చేయాల్సిన పనులు ఏవైనా మిగిలి ఉంటే వాటిని ఈ రెండేళ్లలో పూర్తి చేయాలని సూచించారు. ప్రజల సహకారంతో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
డ్రగ్స్‌పై కిషన్ రెడ్డి పాదయాత్రపై విమర్శలు
డ్రగ్స్, గంజాయి నియంత్రణ అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపడుతున్న పాదయాత్రపై జగ్గారెడ్డి విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్, గంజాయిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.
సినీ పరిశ్రమతో పాటు విద్యాసంస్థల్లోనూ డ్రగ్స్ వినియోగాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. ఎంతటి ప్రముఖులైనా, ఏ నాయకుడి పిల్లలైనా డ్రగ్స్ లేదా గంజాయి వినియోగిస్తే చర్యలు తీసుకోవాలనే విధంగా ముఖ్యమంత్రి పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చారని తెలిపారు.
గత మూడేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణపై పనిచేస్తుంటే, ఇప్పుడు కిషన్ రెడ్డి పాదయాత్ర చేపట్టడం హాస్యాస్పదంగా ఉందని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. ఇది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న ప్రచార పాదయాత్రగా అభివర్ణించారు.
రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యం
రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాలేరంటూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై జగ్గారెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీకి పదవులు కొత్త కాదని, నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వంటి నాయకులు దేశానికి నాయకత్వం వహించారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకుల లక్ష్యమని స్పష్టం చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింత బలపడేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ఏఐసీసీ ఇన్చార్జ్ సందీప్ సహా పార్టీ మొత్తం కృషి చేస్తోందని తెలిపారు. డీలిమిటేషన్ జరిగితే రాష్ట్రంలో ఎంపీ సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, అప్పుడు మరిన్ని స్థానాల్లో విజయం సాధించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఉన్న 17 ఎంపీ స్థానాల్లో 12 నుంచి 14 సీట్లు గెలవడమే లక్ష్యమని, డీలిమిటేషన్ జరిగితే 20 సీట్ల వరకు చేరేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
బీజేపీ ఫ్లోర్ లీడర్‌పై జగ్గారెడ్డి వ్యాఖ్యలు
బీజేపీ నేత, అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేస్తున్న వ్యాఖ్యలపై కూడా జగ్గారెడ్డి స్పందించారు. మహేశ్వర్ రెడ్డి ముందుగా బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా తన స్థాయిని మరింత పెంచుకోవాలని, ఆ తర్వాత ముఖ్యమంత్రిపై మాట్లాడాలని వ్యాఖ్యానించారు. ఆయన చేస్తున్న విమర్శలు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపడం లేదని అన్నారు.