Hyderabad Fish Alert: హైదరాబాద్‌లో చేపలు కొనేవారికి బిగ్ షాక్.. 858 కిలోల కుళ్లిన చేపలు, రొయ్యలు సీజ్ చేసిన TG SAFE.. ఏయే మార్కెట్లలో అంటే..
Fish
Hyderabad Fish Alert: హైదరాబాద్ నగరంలోని పలు చేపల మార్కెట్లలో ఆహార భద్రతా ప్రమాణాలను ఉల్లంఘిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వ్యాపారులపై తెలంగాణ ఫుడ్ సేఫ్టీ (టీజీ-సేఫ్) విభాగం అధికారులు కొరడా ఝుళిపించారు. ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా వెటర్నరీ అధికారులతో కలిసి బేగంబజార్, రాంనగర్, ముషీరాబాద్ ప్రాంతాల్లోని చేపల మార్కెట్లలో విస్తృతంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో మానవ వినియోగానికి ఏమాత్రం పనికిరాని.. తీవ్రంగా పాడైపోయిన చేపలను పెద్ద ఎత్తున గుర్తించి అక్కడికక్కడే పారబోసి ధ్వంసం చేశారు.
తనిఖీల్లో భాగంగా బేగంబజార్‌లోని జీఎన్బీ శ్రీనివాస ఫిష్ మర్చంట్ దుకాణంలో సుమారు 70 కిలోల కుళ్లిన బొచ్చె (కట్ల) చేపలను అధికారులు గుర్తించి తొలగించారు. అలాగే రాంనగర్‌లోని బిన్సన్స్ ఫిషరీలో 65 కిలోలు, ముషీరాబాద్‌లోని జీబీకే ఫిషరీస్‌లో 30 కిలోలు, ఎస్వీఆర్ షాపులో 35 కిలోల తిలాపియా చేపలతో పాటు ఇతర దుకాణాల్లో అపరిశుభ్ర వాతావరణంలో నిల్వ ఉంచిన చేపలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఆహార భద్రతా నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించిన రాంనగర్‌లోని రెండు వ్యాపార సంస్థలకు అధికారులు తక్షణమే క్లోజర్ నోటీసులు జారీ చేశారు.
చేపలు ఎక్కువ రోజులు తాజాగా కనిపించేందుకు వ్యాపారులు ఫార్మాలిన్, నైట్రేట్ వంటి ప్రాణాంతక హానికర రసాయనాలను వాడుతున్నారా అనే కోణంలో అధికారులు ప్రాథమిక పరీక్షలు చేపట్టారు. మరింత సమగ్ర విశ్లేషణ కోసం వివిధ రకాల చేపల నమూనాలను సేకరించి స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించారు. తప్పనిసరిగా ఉండాల్సిన ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) లైసెన్సులు లేకుండా, కనీస పరిశుభ్రత పాటించకుండా విక్రయాలు సాగిస్తున్న పలువురు వ్యాపారులకు నోటీసులు అందజేశారు. నిబంధనలు ఉల్లంఘించి కుళ్లిన, కల్తీ ఆహార పదార్థాలను విక్రయిస్తే కఠిన క్రిమినల్ చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పష్టం చేశారు.