Skip to content
తెలంగాణ › వార్తలు

Hyderabad Rains: హైదరాబాద్‌ వాసులకు వాతావరణ శాఖ సూచన.. రానున్న రోజుల్లో పెరగనున్న చలి.. రాత్రి దంచికొట్టిన వాన..

jagan 27 Nov 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Hyderabad Rains: హైదరాబాద్‌ వాసులకు వాతావరణ శాఖ సూచన.. రానున్న రోజుల్లో పెరగనున్న చలి.. రాత్రి దంచికొట్టిన వాన..

Weather Alert

Hyderabad Rains: భాగ్యనగరాన్ని ఇవాళ అర్ధరాత్రి దాటిన తర్వాత కురిసిన భారీ వర్షం ముంచెత్తింది. గడిచిన పదేళ్లలో నవంబర్ నెలలో నమోదైన అత్యధిక వర్షపాతం ఇదే కావడం విశేషం. దాదాపు 28 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత కురిసిన ఈ కుండపోత వానతో నగరవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. తెలంగాణ అభివృద్ధి, ప్రణాళికా సొసైటీ (TGDPS) గణాంకాల ప్రకారం, కేవలం మూడు గంటల వ్యవధిలోనే నగరంలోని అనేక ప్రాంతాల్లో 60 నుంచి 80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కూకట్‌పల్లి వివేకానంద నగర్‌లో 79.3 మిల్లీమీటర్లు, సఫిల్‌గూడలో 7 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది.

షేక్‌పేట్, చర్లపల్లి, బోరబండ, మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, టోలిచౌకి , మేడ్చల్ ప్రాంతాల్లోనూ కుండపోత వాన పడింది. నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లి రహదారులపైకి వర్షపు నీరు చేరడంతో ఉదయం వేళ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. హైదరాబాద్ సమీపంలోని భువనగిరిలో 12 సెం.మీ., ఆలేరులో 10 సెం.మీ. చొప్పున భారీ వర్షపాతం నమోదైంది.

ఐదు జిల్లాలకు ఎల్లో అలర్ట్ & రాబోయే రోజుల్లో చలి తీవ్రత

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సంగారెడ్డి, మెదక్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి , యాదాద్రి భువనగిరి జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇవాళ (శుక్రవారం) ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

అయితే, రేపటి (నవంబర్ 28) నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టి పొడి వాతావరణం ఏర్పడనుందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. దీని ప్రభావంతో నవంబర్ 29, 30 , డిసెంబర్ 1 తేదీల్లో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో చలి తీవ్రత ఒక్కసారిగా పెరగనుంది. రాబోయే ఐదు రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయే అవకాశం ఉన్నందున, ప్రజలు ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు చలి నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.