చిక్కడపల్లి బావర్చి హోటల్ వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ.. ఫర్నిచర్ ధ్వంసం
చిక్కడపల్లి బావర్చి హోటల్ వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ.. ఫర్నిచర్ ధ్వంసం
హైదరాబాద్: నగరంలోని చిక్కడపల్లి బావర్చి హోటల్ వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేత కృషాంక్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ చిత్రంతో నిర్వహించిన డిన్నర్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. అది కాస్తా తోపులాట, ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో హోటల్ ఫర్నిచర్ ధ్వంసమైనట్లు సమాచారం.
రాహుల్ గాంధీ చిత్రంతో డిన్నర్.. అడ్డుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు
గతంలో ఇదే బావర్చి హోటల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిరుద్యోగ యువతతో కలిసి డిన్నర్ చేశారు. ఆ సందర్భంగా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేతలు వినూత్న నిరసనకు దిగారు.
బీఆర్ఎస్ నేత కృషాంక్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ చిత్రంతో డిన్నర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం గురించి తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు హోటల్ వద్దకు చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కృషాంక్పై దాడి జరిగినట్లు సమాచారం
వాగ్వాదం తీవ్రం కావడంతో ఇరువర్గాల కార్యకర్తలు ఒకరిపై ఒకరు తోసుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేత కృషాంక్పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి కొట్టినట్లు సమాచారం. ఘర్షణలో హోటల్లోని ఫర్నిచర్ కూడా ధ్వంసమైంది.
రంగంలోకి దిగిన పోలీసులు
హోటల్ పరిసరాల్లో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఘటనతో బావర్చి హోటల్ పరిసరాల్లో కొంతసేపు ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి.
రాహుల్ గాంధీ గతంలో నిరుద్యోగ యువతతో సమావేశమైన హోటల్లోనే బీఆర్ఎస్ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టడం, దాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఈ వివాదం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.