Skip to content
జాతీయం › వార్తలు

21 ఏళ్ళ అటవీ హక్కుల చట్టం.. ‘ఎండమావి’లా గిరిజన హక్కులు…

Prajapaksham 27 Nov 2026 1 నిమిషాల పఠనం జాతీయం
21 ఏళ్ళ అటవీ హక్కుల చట్టం.. ‘ఎండమావి’లా గిరిజన హక్కులు…

tribal men

రాజు కుమార్‌

ప్రభుత్వం జనజాతీయ గౌరవ్‌ దివస్‌ (గిరిజన గౌరవ దినోత్సవం) జరుపుకుంటూ గిరిజన నాయకుల త్యాగాలను, పోరాటాలను గౌరవిస్తున్నప్పటికీ, గిరిజన కుటుంబాలు తమ భూమి, జీవనోపాధి, అడవులకు సంబంధించిన సమస్యల పట్ల అధికారిక ఉదాసీనతను ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఇరవై సంవత్సరాల క్రితం ప్రభుత్వం అటవీ హక్కుల చట్టాన్ని ప్రవేశపెట్టినప్పుడు, గిరిజనులు, ఇతర సాంప్రదాయ అటవీవాసులు ఎదుర్కొన్న చారిత్రక అన్యాయాన్ని గుర్తించింది. అడవులపై వారి హక్కులను గుర్తించడం ఆ అన్యాయా న్ని సరిదిద్దడంలో సహాయపడటానికి ఉద్దేశించింది. ఇరవై సంవత్సరాలు గడిచినా, అనేక కుటుంబాలు ఇప్పటికీ తమ సొంత భూమిపై తమ హక్కును నిరూపించుకోవలసి వస్తోంది.
మధ్యప్రదేశ్‌లో అటవీ హక్కుల చట్టం అమలుపై లోక్‌ స్వశాసన్‌ ఆందోళన్‌ ఇటీవల భోపాల్‌లో ఒక ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించింది. గిరిజన, ఇతర అటవీ ఆధారిత వర్గాల ప్రతినిధులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరస్పరం తెలియజేసుకున్నారు. ఆ రాష్ట్ర జనాభాలో గిరిజనులు సుమారు 21 శాతం ఉన్నప్పటికీ, గ్రామ సరిహద్దులను ఎలా గీయాలి, వారి వాదనలను నిర్ణయించడంలో ఏ సాక్ష్యాలను అంగీకరించాలి, వారి అడవులను ఎవరు నిర్వహించాలి అనే విషయాలలో వారి సొంత సంస్థల ప్రమేయం పరిమితంగానే ఉంది.
అదే సమయంలో అటవీ హక్కులను ప్రభుత్వ పథకాల లక్ష్యాలు, లబ్ధిదారుల సంఖ్యల పరంగానే ఎక్కువగా చూస్తున్నారు. ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష్‌ అభియాన్‌, క్లెయిమ్స్‌(హక్కుల కోసం దరఖాస్తుల) వేగవంతమైన పరిష్కారం, ప్రత్యేక అటవీ హక్కుల సెల్‌, సాంకేతిక సహాయానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఇటువంటి సహాయం గ్రామాలకు పత్రాలను సేకరించడానికి, పటాలను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. అటవీ నిర్వహణ ప్రణాళికలకు ప్రాధాన్యతలను గ్రామ సభ నిర్దేశిస్తుందా లేక బయటి సంస్థలు నిర్దేశిస్తాయా అన్నదే ప్రశ్న. గ్రామ సభల కు నిర్ణయాలు తీసుకునే అవకాశం తక్కువగా ఉంటే, ఎక్కువ క్లెయెమ్స్‌ పరిశీలించడం వల్ల అడవులపై సామాజిక హక్కులను బలోపేతం చేయడానికి పెద్దగా ఉపయోగపడదు.
వన్‌ మిత్ర పోర్టల్‌తో అటవీ భూమిపై హక్కుల కోసం దరఖాస్తుదారుల కోసమేనని అనుభవం చెబుతోంది. గతంలో తిరస్కరించబడి న క్లెయిమ్‌లను సమీక్షించడానికి మధ్యప్రదేశ్‌ 2019లో ఈ పోర్టల్‌ ను ప్రారంభించింది. మునుపటి నిర్ణయాలను పునఃపరిశీలించి, ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చడమే దీని లక్ష్యం. అయినప్పటికీ, చాలామంది దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను దాఖలు చేయటానికి, వాటి స్థితిని తనిఖీ చేయడానికి కియోస్క్‌ ఆపరేటర్లు లేదా పంచాయతీ కార్యదర్శులపై ఆధారపడ
వలసి వచ్చింది.
కొందరి క్లెయిమ్‌లు మళ్లీ తిరస్కరించబడ్డాయి. వారికి ఎలాంటి లిఖితపూర్వక వివరణ అందలేదు. ఏ సాక్ష్యం సరిపోదని భావించారో లేదా వారి క్లెయిమ్‌లో ఏమి లోపించిందో తెలుసుకునే మార్గం లేనప్పుడు, దరఖాస్తుదారుల ఒక నిర్ణయాన్ని ఎలా సవాలు చేయగలరు?
గ్వాలియర్‌- చంబల్‌కు చెందిన సహరియా ప్రతినిధులు మాట్లాడుతూ, గ్రామ సభ సమావేశాలను వ్యక్తిగత నివాస ప్రాంతాలలో కాకుండా పంచాయతీ స్థాయిలో నిర్వహిస్తున్నారని చెప్పారు. కొన్ని చోట్ల, పట్వారీలు, బీట్‌ గార్డులను కూడా అటవీ హక్కుల కమిటీల లో సభ్యులుగా నియమించారు. దిండోరిలో, అటవీ గ్రామాలను రెవెన్యూ గ్రామాలుగా మార్చటంపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
సరిహద్దులను తిరిగి గీసే ప్రక్రియ నుంచి తమ గ్రామసభను మినహాయించారని, గ్రామం ఉపయోగించే కొంత భూమిని కొత్త మ్యాప్‌ నుండి తొలగించారని వారు చెప్పారు. బైగా, సహారియా, భరియా వర్గాల ఆవాస హక్కుల ప్రశ్న ఇంకా విస్తృతమైనది. వారు వ్యవసాయం చేసే, నివసించే భూమితో పాటు ఉమ్మడి ప్రాంతాలు
వారి జీవనోపాధిని, సాంస్కృతిక జీవితాన్ని
నిలబెడుతున్నాయి.
రాతపాని, పన్నా, దుర్గావతి, సత్పురా ప్రాంతాల ప్రజలు వన్యప్రాణుల సంరక్షణ పేరు తో పునరావాసం కల్పించడం గురించి, అడవుల్లోకి ప్రవేశంపై ఆంక్షల గురించి మాట్లాడారు. వారి సాక్ష్యాలు ‘స్వచ్ఛంద పునరావాసం’ గురించి ఒక ప్రాథమిక ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. తమ గ్రామంలోనే ఉంటూ అడవిపై ఆధారపడి జీవనోపాధి సంపాదించడం కుటుంబాలకు కష్టంగా మారినప్పుడు, వారి ప్రాథమిక సేవలకు కూడా ఆటంకం కలిగినప్పుడు, తమ గ్రామాన్ని విడిచి వెళ్ళాలనే వారి నిర్ణయం ఎంతవరకు స్వచ్ఛందమైనది? కెన్‌-బెట్వా, నర్మదా వ్యాలీ ప్రాజెక్టుల వల్ల ప్రభావితమైన ప్రాంతాల ప్రజలు అటవీ భూ వినియోగంలో మార్పులు, గ్రామసభ అనుమతి, నష్టపరిహారం గురించి ప్రశ్నలు లేవనెత్తారు. కొన్ని ప్రాంతాలలో, అడవులను నరికివేసినందుకు నష్టపరిహారంగా, తాము వ్యవసాయం లేదా ఇతర ఉమ్మడి ప్రయోజనాల కోసం ఉపయోగించే భూమిలో తోటలను ఏర్పాటు చేశారని
గ్రామస్తులు తెలిపారు.
అటవీ హక్కుల చట్టం, క్లెయిమ్‌ల ప్రక్రియలో గ్రామసభలకు కేంద్ర పాత్రను కల్పించింది. అడవులను సంరక్షించే, నిర్వహించే గ్రామాల హక్కులను కూడా ఇది గుర్తించింది. అయినప్పటికీ, అనేక చోట్ల అటవీ శాఖ మునుపటిలాగే నియంత్రణను కొనసాగిస్తోంది.
క్లెయిమ్‌లు దాఖలు చేసిన కొన్ని కుటుంబాలను, వారు క్లెయిమ్‌ చేస్తున్న భూమిపైనే ఆక్రమణదారులుగా పరిగణిస్తున్నారు. కొన్ని చోట్ల ఆ శాఖ వారి పొలాల చుట్టూ కందకాలు తవ్వుతోంది. ఇతర చోట్ల, భూమికి కంచె వేసి చెట్లు నాటుతారు. అటవీ హక్కుల పత్రాలు మంజూరు చేసినప్పటికీ, కుటుంబాలకు ఖాళీ చేయమని నోటీసులు అందుతున్నట్లు కూడా నివేదికలు ఉన్నాయి. ఇది ఒక్క మధ్యప్రదేశ్‌ పరిస్థితి కాదు.
దేశవ్యాప్తంగా అటవీహక్కుల చట్టం అమలు లో రాజకీయ నాయకుల, అధికారుల వైఖరులవల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. గిరిజనులకు న్యాయం చేయాలన్న దృష్టిలోపిస్తున్నది.
గిరిజన వర్గాలు నేడు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. వారు నిరంతరం ఎదుర్కొంటున్న అన్యాయాలను అంతం చేయడానికి, వారి ప్రయోజనాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలి.

ట్యాగ్‌లు: Breaking News in Telugu Today news