జనజీవితాలను మెరుగుపరచని జిడిపి పెరిగితేనేం, తగ్గితే ఏమిటి!
GDP in india
ఎం కోటేశ్వరరావు
ప్రధాని నరేంద్రమోదీకి 76 సంవత్సరాలు, ముఖ్యమంత్రిగా, ప్రధానిగా పదవిలో పాతి క సంవత్సరాలు గడిపారు. పార్టీలో అడ్డుతొలిగించుకొనే ఇతర నేతలకు 75 సంవత్సరా లు నిండాయనే సాకుతో మార్గదర్శక్ మండల్ పేరుతో పాతసామాన్ల కొట్లో పడేసినట్లు చేశారు. తనకు మాత్రం అదేమీ వర్తించనట్లు ఉన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నెలరోజుల పాటు బిజెపి సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 17వరకు సేవాసంకల్ప అభియాన్ పేరుతో అనేక కార్యక్రమాలు జరపాలని పిలుపునిచ్చింది. అది ఊహించిందే, కానీ మరొక ఉదంతం జరిగింది. నరేంద్రమోదీ ఢిల్లీలో ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారణాసి వెళ్లి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ప్రత్యేక విమానంలో అంతదూరం వెళ్లారు, ఏదో ఒకటి చెప్పుకోవాలి గనుక పూజలు, ఇతర కార్యక్రమా లు పెట్టుకున్నారు. చిత్రం ఏమిటంటే అదే రాష్ట్రానికి చెందిన కేంద్ర రక్షణ మంత్రి రాజనాధ్ సింగ్, ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాధ్‌కు తప్పదు, ఇతర ఏ బిజెపి ముఖ్యమంత్రి కూడా అటు ఢిల్లీ ఇటు వారణాసి వెళ్లలేదు, ఎవరికి వారు తమ రాష్ట్రాల్లో పాల్గొన్నారు. కానీ రాజును మించిన రాజభక్తుడిలా చంద్రబాబు మాత్రం వారణాసి వెళ్లారు. ఈ సందర్భంగా పాతికేండ్లు పదవిలో ఉండి మోదీ ఏమి సాధించారన్నది పెద్ద ప్రశ్న. తన స్వంత రాష్ర్టం గుజరాత్ రక్తహీనతకు ప్రస్తుతం రాజధానిగా ఉంది. మహిళలు, పిల్లల్లో ఆ సమస్య ఉంటే ఎంత నష్టమో తెలిసిందే, పౌష్టికాహారం అందించటం ద్వారా మాత్రమే రక్తహీనతను పొగొట్టవచ్చు. పాతికేండ్లలో మోదీ ఆ పని చేయలేకపోయారు. దేశాన్ని ఏమి ఉద్దరిస్తారు, ఇక తన ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని చూడండి అంటూ వర్తమాన సంవత్సర తొలి మూడు మాసాల జిడిపి అంకెల గురించి కొద్ది రోజుల క్రితం తన భుజాలను తానే చరుచుకున్నారు. జిడిపి గురించి గతంలో ఏ ప్రధానీ చేయనంత హడావుడి మోదీ చేశారు. తాను అధికారానికి వచ్చే నాటికి ప్రపంచంలో పదవ స్థానంలో(నామినల్) ఉన్న దానిని కష్టపడి ఐదవ స్థానానికి చేర్చానని చెప్పారు. పన్నెండు సంవత్సరాల తరువాత ఏ మూడో, నాలుగో స్థానానికో చేరాల్సింది కాస్తా 2026లో ఆరవ స్థానానికి ఎందుకు దిగజారిందో ఎప్పుడైనా చెప్పారా? నిజానికి జిడిపి పద్ధతిలో అప్పుడూ ఇప్పుడూ మూడవ స్థానంలో ఉంది. రూపాయి విలువ పతనం వంటి కారణాలతో మనం ఆరవ స్థానానికి పడిపోయాం. కానీ బిజెపి పెద్దలు మన రూపాయి విలువ పతనం కాలేదని పిట్టకతలు చెబుతూనే ఉంటారు.
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఏప్రిల్ తొలి త్రైమాసిక జిడిపి వృద్ది రేటు 7.8శాతం అంకెలు వివాదాస్పదమయ్యాయి. అది అంకెల గారడీ అంటూ చర్చ జరుగుతున్నది. “వినాశకశక్తులు నాశనమయ్యాయి భారత్ వికసించింది” ఇదీ మన ప్రధాని నరేంద్రమోదీ వృద్ధి రేటు గురించి ఎక్స్‌లో చేసిన వ్యాఖ్య. ప్రాసకోసం తప్ప ఏమైనా అర్ధం ఉందా? నాశనమైన ఆశక్తులేవో, దేశం ఎలా వికసించిందో చెప్పి ఉంటే ఆ మాటలకు విశ్వసనీయత ఉండేది. జెన్ జీ ఆందోళనతో దిమ్మదిరిగిన స్థితిలో ఈ అంకెలను చూపి జనం దృష్టిని మళ్లించాలని చూసినట్లు కొందరు చెప్పారు. దేశం వెలిగిపోతోంది అని చెప్పటం బిజెపి నేతలకు కొత్తేమీ కాదు, 2004 ఎన్నికల్లో వాజ్‌పేయి నాయకత్వంలో అలాంటి ప్రచారంతోనే జనాలను మభ్యపెట్టాలని చూసి బొక్కబోర్లా పడిన సంగతి తెలిసిందే. బిజెపిలో ఉన్నంతలో నిజాయితీ పరుడని పేరున్న వాజ్‌పేయి పరువు పోయింది. మోదీ ఏలుబడిలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసిన సుభాష్ చంద్ర గార్గ్ ప్రభుత్వం ప్రకటించిన వృద్ధి రేటు 7.8శాతం నిజం కాదని 2.6 శాతానికి మించి లేదని వ్యాఖ్యానించటంతో వివాదం చెలరేగింది. అమెరికా, చైనా, జపాన్ వంటి మనకంటే ముందున్న దేశాల మీదనే ప్రతికూల ప్రభావాలతో జిడిపి తగ్గినపుడు మనం ఎలా పెరిగామన్నది అనుమానం. ఇటీవలి వరకు 2011 సంవత్సరాన్ని ప్రాతిపదిక గా చేసుకొని గణాంకాలను తయారు చేస్తున్నారు. తాజాగా ప్రకటించిన జిడిపి అంకెలకు 2022 సంవత్సరం ప్రాతిపదికగా చెప్పారు. ఈ విధాన మార్పును గమనించకుండా పాతకొత్త అంకెలను యాపిల్ పండ్లతో బత్తాయిలను పోల్చినట్లుగా ఉందని ప్రభుత్వం తిప్పికొట్టింది. పోలికను పక్కన పెడితే కొత్త అంకెలు వాస్తవాన్ని ప్రతిబింబించటం లేదన్నదే సమస్య. అదే సమయం లో రద్దయిన విధానం అంకెలతో నూతన సమాచారాన్ని ప్రభుత్వ పెద్దలు, మోదీ ఎలా పోల్చారు? అయితే నూతన విధానం గురించి ఒక స్పష్టత వచ్చేంత వరకు రెండు పద్ధతుల ప్రాతిపదికన అంకెలను ప్రకటిస్తే జనాలకు స్పష్టత వస్తుందన్నది ఒక అభిప్రాయం. ప్రభుత్వం ఎంచుకున్న విధానం సరైనదే కావచ్చు గానీ గతంలో ప్రకటించిన ఆర్థిక సమాచారం సరైనదిగా రుజువు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని కొందరు చెబుతున్నారు. ప్రభుత్వం 2016 పెద్ద నోట్ల రద్దుతో మార్కెట్ నుంచి 86 శాతం నగదు ఉపసంహరణ, తదితర ఇబ్బందులతో ఆర్థిక రంగం కుదేలైందని చెప్పినప్పటికీ ఆ ఏడాది జిడిపి వృద్ధి రేటు 8.2శాతం ఎలా సాధ్యమైందన్న ప్రశ్నకు జవాబు లేదు. ఆ ఏడాది జిడిపి అంకెలను ఆలస్యంగా ప్రకటించారు, 2017 సంవత్సర వినిమయ సర్వేను వెనక్కు తీసుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ చేసిన నోట్ల రద్దు చర్యతో ఎలాంటి ప్రతికూల ఫలితాలు రాలేదని జనాన్ని నమ్మించేందుకు ఇలా చేశారని విమర్శలు వచ్చాయి. గత సంవత్సర జిడిపిని తగ్గించి చూపి ఆ ప్రాతిపదికన ఈ ఏడాది తొలి మూడునెలల్లో ఎక్కువగా ఉందని గొప్పలు చెప్పుకున్నారన్నది ఒక అభిప్రాయం. గత సంవత్సరానికి కూడా నూతన పద్ధతిని అనుసరించి లెక్కించి దాని ప్రాతిపదికన 7.8 శాతం వృద్ధి అంటే నమ్మవచ్చు. కానీ అలా చేయలేదే! గొర్రెల గోత్రాలు కాపరులకే తెలుసన్నట్లుగా ఆర్థికశాఖ కార్యదర్శిగా తాను ఉన్నపుడు జరిగిన అంకెల గారడీ తెలుసు గనుక సుభాష్ చంద్ర గార్గ్ చెప్పిన మాటలను అనేక మంది నమ్ముతున్నారు.
దేశ పారిశ్రామిక ఉత్పత్తి పెరుగుదల ఐదేండ్ల కనిష్టానికి పడిపోయింది. ఆగస్టు నెలలో వరుసగా మూడవ నెలలో కూడా పతనమైంది. దేశ పారిశ్రామికోత్పత్తి పిఎంఐ దీర్ఘకాల సగటు 54.2 కాగా జులైలో 53.5 నుంచి ఆగస్టు లో 52.8కి పతనమైంది. కొనుగోలు గిరాకీ పడిపోయింది. ఉపాధి గడచిన రెండున్నర సంవత్సరాల్లో తొలిసారిగా తగ్గింది. ఏప్రిల్ మూడు మాసా ల కరెంట్ ఖాతా లోటు 4.2 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గతేడాది ఇదే సమయంలో 3.4 బిలియన్ డాలర్లు మాత్రమే ఉంది. అయినా జిడిపి వృద్ధి రేటు 7.8శాతమని కేంద్రం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం చెబుతున్న జిడిపి లెక్కలకు విశ్వసనీయత సమస్య ఉంది. సంఘటిత రంగంలో ఉన్న పరిశ్రమలు, ఇతర సంస్థలు ఇచ్చే సమాచారం ప్రాతిపదికన వాటిని రూపొందిస్తున్నారు. మన ఆర్థిక రంగంలో అసంఘటిత రంగ వాటా 45శాతం ఉందని ఉజ్జాయింపుగా వాటికి జోడిస్తున్నారు. నిర్దిష్ట సమాచారం లేదు. పీటర్సన్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనమిక్స్(పిఐఐఇ) కోసం రూపొందించి న ఒక పత్రంలో గత దశాబ్దకాలంగా ఈ అంచనాలు వాస్తవం కాదని పేర్కొన్నారు. ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో ఇంధన షాక్ చిన్న సంస్థల మీద ఎక్కువగా ఉన్నందున జిడిపి లెక్కలను నమ్మటానికి వీల్లేదంటున్నారు. ఏప్రిల్, మే నెలల్లో ఇంధనానికి కొరత ఏర్పడటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇంధన దిగుమతులపై ఆధారపడిన మనం మెరుగైన వృద్ధి సాధించటం ఎలా సాధ్యం అన్నది ప్రశ్న. అంతేకాదు గత దశాబ్దకాలంలో ఇంధన ధరలు చాలా తక్కువగా ఉన్నపుడు దేశ ఆర్థిక వ్యవస్థకు విపరీతమైన లాభాలు వచ్చి ఉండాలి, కానీ లెక్కల్లో అదెక్కడా కనిపించలేదు. దిగుమతి ధరలు 32శాతం పెరిగాయని, తొలి మూడు మాసాల్లో ఆర్థికం మందగించిందని ఒకవైపు రిజర్వుబ్యాంకు చెప్పగా అంతా బాగుందని జిడిపి లెక్కలను ప్రభుత్వం ప్రకటించింది.
నిజంగా ఆల్ ఈజ్ వెల్ (అంతా సుభిక్షం) అనుకుంటే జిఎస్టి రాబడి కేవలం ఐదుశాతమే ఎందుకు పెరిగినట్లు? పోనీ జిఎస్టి రేట్లు తగ్గించినందువలన అని సరిపెట్టుకుంటే దిగుమతులు తగ్గాయి, పారిశ్రామిక ఉత్పాదకత ఎందుకు పడిపోయినట్లు? దేనికీ పొంతన కుదరటం లేదు. గతేడాది, 2025 ఏప్రిల్ మాసాల్లో జిడిపిని 86లక్షల కోట్ల రూపాయలుగా పేర్కొన్నా రు. గుట్టుచప్పుడు కాకుండా దానిలో ఆరులక్షల కోట్లు తగ్గించారు. ఇప్పుడు ఏప్రిల్ 88.27లక్షల కోట్లుగా చూపి దానితో పోల్చి 7.8శాతం పెరిగిందంటున్నారు. ఇదెక్కడి లెక్క! ఇదేంటయ్యా అంటే విమర్శకులు తమకు అవసరమైన అంకెలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారని, తాము 2023 మార్చి మాసాన్ని ప్రాతిపదికగా తీసుకున్నామని మోదీ ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ సమర్ధించుకున్నారు. గతంలో జిడిపి మొత్తాన్ని సవరణలో ఎందుకు తగ్గించినట్లు అంటే తిరిగి లెక్కించినపుడు కొన్ని సార్లు పెరుగుతాయి, కొన్నిసార్లు తగ్గవచ్చు అన్నారు. గత నాలుగు సంవత్సరాల్లో జిడిపిలో తగ్గించిన మొత్తం 43లక్షల కోట్లని కాంగ్రెస్ విమర్శించింది.అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) మన ప్రభుత్వ ఆర్థిక గణాంకాల పట్ల ఆందోళన వెల్లడిస్తూ ఏబిసిడి గ్రేడ్లలో “సి”లో మనలను ఉంచింది. అంటే నాసిరకం అని అర్ధం.
ప్రపంచంలో ప్రతిదేశమూ తన ఆర్థికవృద్ధి, ధరలు, ఇతర సూచికలను నవీనీకరించుకునేందుకు ప్రాతిపదిక సంవత్సరాలను మార్చుతూ ఉంటుంది. ఆ ఏడాది అన్ని సూచికలనూ వంద అనుకుంటే తరువాత వచ్చే మార్పులు, ద్రవ్యోల్బణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని వాస్తవ పెరుగుదల, తగ్గుదలను ఖరారు చేస్తారు. అయితే ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ప్రాతిపదిక ఏడాదిని మార్చాలన్నది సమస్య. దీనికి నిర్దిష్ట మార్గదర్శకాలేమీ లేవు. ఐరాస సూచించినదాని ప్రకారం ప్రతి మూడు లేదా అయిదు సంవత్సరాల కు ఒకసారి మార్చాలి. చైనాలో విధిగా ప్రతి ఐదు సంవత్సరాలకు మారుస్తున్నారు. అమెరికాలో ఒక్కో అంశానికి ఒకో సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. జిడిపికి 2017, ధరలకు 1982 ఉత్పత్తి ధరలకు 1982ను తీసుకుంటున్నారు. జిడిపి అంకెల గారడీ ఎలా ఉంటుందో ఒక ఉదాహరణ చూద్దాం. ఒక ఏడాదిలో ఒక దేశం పది మిలియన్ పీపాల చమురు ఉత్పత్తి చేసిందనుకుందాం. ఒక్కో పీపాను పది డాలర్లకు అమ్మితే జిడిపి విలువ 100 మిలియన్ డాలర్లు. అదే మరోఏడాది కేవలం ఐదు మిలియన్ల పీపాలు మాత్రమే ఉత్పత్తి చేసింది, ధర మాత్రం 30 డాలర్లు ఉంటే జిడిపి 150 మిలియన్ డాలర్లకు పెరిగింది. ఉత్పత్తి తగ్గినా జిడిపి పెరిగింది. నిజంగా జిడిపి పెరిగినట్లా తరిగినట్లా? అందువలన ధరల ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే అసలు పెరుగుదల తెలుస్తుంది. దాన్ని లెక్కించటం ఎలా? ఒక సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకొన్నపుడు ఆ ఏడాది ఉన్న ధరలను బట్టి తరువాత సంవత్సరాల్లో పెరిగిన వాటిని ఆ ధరలకు అనుగుణంగా సరి చేస్తారు. పైన చెప్పుకున్న తొలి ఏడాదిని ప్రాదిపదికగా తీసుకుంటే రెండో ఏడాది ఉత్పత్తి జరిగింది ఐదు మిలియన్లే గనుక స్థిర ధరల్లో జిడిపి వందమిలియన్ల నుంచి 50కి తగ్గింది. మన ప్రభుత్వం గతేడాది వరకు 2011 సంవత్సరాల ధరలను ప్రాతిపదికగా తీసుకొని జిడిపిని లెక్కించింది. తాజా లెక్కలు 2022 ధరల ప్రాతిపదికన చెప్పినవి. పదకొండు సంవత్సరాల కాలంలో ధరలు ఎంతగానో పెరిగాయి గనుక పాతవాటిని తీసుకుంటే వాస్తవ పరిస్థితి తెలియదు గనుక కొత్త సంవత్సరాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. అయితే ఇంత దీర్ఘకాలం పాటు ప్రాతిపదిక సంవత్సరాన్ని ఎందుకు కొనసాగించినట్లు? కొత్త పద్ధతిలో జిడిపిని తొలిసారిగా ప్రకటించారు, తదుపరి నెలల్లో వాస్తవ వృద్ధి రేటు తెలుస్తుంది, అప్పటి వరకు మనల్ని అంకెలతో ఆడుకుంటూనే ఉంటారు, గణాంకాలు కడుపు నింపవని వేరే
చెప్పనవసరం లేదు!