Skip to content
క్రీడలు వార్తలు

ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. తొలి వన్డేలో 86 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం

Prajapaksham 10 Jun 2026 1 నిమిషాల పఠనం క్రీడలు
ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. తొలి వన్డేలో 86 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ఘన విజయం

BAN vs AUS 1st ODI Highlights: Bangladesh Beats Australia by 86 Runs

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. తమ సొంత మైదానంలో పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును మట్టికరిపించి, వన్డే క్రికెట్‌లో ఏకంగా 21 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. మంగళవారం వర్షం కారణంగా అంతరాయం కలిగిన ఈ వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ డక్‌వర్త్ లూయిస్ (DLS) పద్ధతి ప్రకారం 86 పరుగుల భారీ తేడాతో ఆసీస్‌పై చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. వన్డే ఫార్మాట్‌లో ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్‌కు ఇది కేవలం రెండో విజయం మాత్రమే కావడం విశేషం. చివరిసారిగా 2005లో కార్డిఫ్ వేదికగా ఆసీస్‌ను ఓడించిన బంగ్లా జట్టు, ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఆ ఘనతను పునరావృతం చేసింది.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 284 పరుగుల భారీ స్కోరు సాధించింది. అంతర్జాతీయ క్రికెట్‌లోకి నాలుగేళ్ల తర్వాత పునరాగమనం చేసిన మొసాదెక్‌ హుస్సేన్‌ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 70 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 86 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతనికి తోడుగా నజ్ముల్‌ హుస్సేన్‌ శాంటో 67 పరుగులు, ఓపెనర్ తంజిద్‌ హసన్‌ 54 పరుగులతో అర్ధసెంచరీల రాణించి జట్టుకు గట్టి పునాది వేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్‌ ఎలిస్‌ 38 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, అరంగేట్రం చేసిన లియామ్ స్కాట్ ,పార్ట్-టైమ్ బౌలర్ మాట్ రెన్‌షా చెరో రెండు వికెట్లు తీశారు. అయితే, ఫీల్డింగ్‌లో ఏకంగా నాలుగు క్యాచ్‌లను చేజార్చిన ఆస్ట్రేలియా జట్టు బంగ్లాదేశ్‌కు భారీ స్కోరు సమర్పించుకుని భారీ మూల్యం చెల్లించుకుంది.

అనంతరం 285 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టుకు ఇన్నింగ్స్ తొలి బంతికే షాక్ తగిలింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ యువ పేసర్ నహిద్‌ రాణా గంటకు 150 కిలోమీటర్ల వేగంతో సంధించిన బంతులతో ఆసీస్ మిడిలార్డర్‌ను కుప్పకూల్చాడు. అతను కేవలం 41 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు తీసి ఆసీస్ పతనంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో కామెరాన్‌ గ్రీన్‌ ఒంటరి పోరాటం చేస్తూ 52 పరుగులతో నాటౌట్‌గా నిలిచినప్పటికీ, మిగతావారంతా స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు. ఆసీస్ 42.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసిన దశలో తీవ్రమైన పిడుగులు, వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. ఆటను తిరిగి కొనసాగించే అవకాశం లేకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ నియమం ప్రకారం బంగ్లాదేశ్‌ను విజేతగా ప్రకటించారు. బ్యాటింగ్‌లో అద్భుతమైన అర్ధసెంచరీ చేయడంతో పాటు బౌలింగ్‌లోనూ రెండు వికెట్లు పడగొట్టిన మొసాదెక్ హుస్సేన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.