Rahul Gandhi on Dharmendra Pradhan: ఇక అన్ని వర్గాలదీ పోరు బాటే…ధర్మేంధ్ర ప్రధాన్ రాజీనామాపై రాహుల్ గాంధీ
Rahul Gandhi: బీజేపీ సర్కార్ నన్ను అడ్డుకోలేదు..'ఛాత్రోన్ కీ గూంజ్' అనుమతి రద్దుపై రాహుల్ మండిపాటు
లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను స్వాగతించారు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని ఆయన అభివర్ణించారు. ఒక వీడియో ప్రకటనలో మాట్లాడుతూ ధర్మేంధ్ర ప్రధాన్‌ను అవినీతికి ప్రతీకగా అభివర్ణించారు. నిరసన చేస్తున్న యువతను అభినందించిన రాహుల్ గాంధీ, దీనిని విద్యార్థుల విజయంగా ప్రకటించారు. వారు దేశం, రాజ్యాంగం కోసం పోరాడారని, ఈ విజయం వారిదేనని అన్నారు. విద్యార్థులపై తనకు గర్వంగా ఉందని చెప్పారు. యువత సాధించిన ఈ విజయం రైతులు, కార్మికులు, పేదలు, ప్రభుత్వ లక్ష్యంగా మారిన ప్రతి వర్గానికీ ఒక సందేశం ఇస్తుందని, గొంతు విప్పాలంటే వివేకంతో పాటు ధైర్యం కూడా అవసరమని పేర్కొన్నారు.
ప్రభుత్వం రాజ్యాంగాన్ని బలహీనపరుస్తూ, వ్యవస్థలను తన ఆధీనంలోకి తీసుకుంటోందని, అందుకే ఎదురు నిలవడం తప్పనిసరి అని రాహుల్ అన్నారు. ఇంకా రెండు డిమాండ్లు నెరవేరలేదని, వాటిని వెంటనే అమలు చేయాలని కోరారు. నీట్ పేపర్ లీక్‌కు పాల్పడిన వారిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే సోమవారం జంతర్ మంతర్ వద్ద యువ నిరసనకారులపై పోలీసులు వ్యవహరించిన తీరుకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ కూడా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను స్వాగతిస్తూ, దీనిని యువత విజయంగా అభివర్ణించారు. విద్యా వ్యవస్థను ఆర్‌ఎస్‌ఎస్ తన ఆధీనంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు. దేశ యువత తమ గళాన్ని బలంగా వినిపించారని, ఇకపై వారిని అణచివేసే ధైర్యం ఎవరికీ ఉండదని ఆమె అన్నారు. సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ కూడా దీనిని ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించారు. ఈ అంశంపై ఆయన 26 రోజుల పాటు నిరాహార దీక్ష చేపట్టడం గమనార్హం.