From Hero to Villain: నాడు విద్యార్థి ఉద్యమాలకు హీరో.. నేడు అదే విద్యార్థి ఉద్యమాలకు విలన్.. ధర్మేంద్ర ప్రధాన్ ఇమేజ్ను మార్చిన రెండు విద్యార్థి ఉద్యమాల కథ..
From Hero to Villain? How Student Protests Made Dharmendra Pradhan a Hero in 1997 and a Villain in 2026
From Hero to Villain: దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్ పేపర్ లీక్ వివాదాల నడుమ.. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితి ఒకప్పటి ఆయన గతాన్ని, నాటి పోరాటాలను మళ్లీ గుర్తు చేస్తోంది. దాదాపు మూడు దశాబ్దాల క్రితం.. ఒక విద్యార్థి నేతగా పేపర్ లీక్‌పై రోడ్డెక్కి పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న అదే ధర్మేంద్ర ప్రధాన్.. నేడు జాతీయ స్థాయి పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో విద్యార్థుల నుంచి తీవ్ర నిరసనలు, రాజీనామా డిమాండ్లు ఎదుర్కొనడం రాజకీయ రంగంలో ఒక ఆసక్తికరమైన పరిణామంగా మారింది.
1997 నాటి ఒడిశా పోరాటం: 1997లో ధర్మేంద్ర ప్రధాన్ అఖిల భారత విద్యార్థి పరిషత్ జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆ సమయంలో ఒడిశాలో పేపర్ లీక్ కాగా.. దానికి నిరసనగా రాష్ట్ర సచివాలయం ఎదుట సుమారు 1,500 మంది విద్యార్థులతో కలిసి ఆయన భారీ ఆందోళన చేపట్టారు. ఆ నిరసనను అణచివేసేందుకు పోలీసులు జరిపిన తీవ్ర లాఠీచార్జీలో ప్రధాన్‌కు ఎముకలు విరగడమే కాకుండా శరీరం తీవ్రంగా గాయపడింది. అప్పట్లో రక్తసిక్తమైన ఆయన ఫోటో ఒడిశా విద్యార్థి పోరాటానికి.. ప్రతిఘటనకు ఒక ప్రధాన చిహ్నంగా నిలిచింది.
కళాశాల రోజుల్లో ప్రధాన్ కు సీనియర్, ఒడిశా బీజేపీ అధికార ప్రతినిధి అయిన సుదీప్త కుమార్ రే.. అలాగే ఉత్కల్ విశ్వవిద్యాలయంలో జూనియర్ అయిన ప్రశాంత్ రౌత్ (ప్రస్తుతం ఆర్ఎమ్డి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్) ఆనాటి రోజులను గుర్తుచేసుకున్నారు. స్కాలర్షిప్లు, అడ్మిషన్ ఫీజులు, విశ్వవిద్యాలయ విద్యార్థులకు ఓటు హక్కు కల్పించడం వంటి అనేక సమస్యలపై ప్రధాన్ ఎల్లప్పుడూ ముందుండి పోరాడేవారని.. ఎంతటి ఒత్తిడి ఎదురైనా నిరసనలను శాంతియుతంగానే నడిపేవారని వారు తెలిపారు. విశ్వవిద్యాలయ ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల దాడి నుంచి ఆయన ప్రాణాపాయం నుండి తృటిలో తప్పించుకున్న సంఘటనలను కూడా వారు ప్రస్తావించారు. 1994 నుండి 1997 వరకు ఏబీవీపీలో చురుగ్గా పనిచేసిన ఆయనకు విద్యార్థుల మనస్తత్వంపై లోతైన అవగాహన ఉందనేది వారి అభిప్రాయం.
అనాడు విద్యార్థిగా పత్రాల లీకేజీకి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి లాఠీ దెబ్బలు తిన్న ప్రధాన్ స్థానంలో.. నేడు నీట్ లీకేజీని నిరసిస్తూ పార్లమెంట్ బయట విద్యార్థులు వీధుల్లోకి రావడం, పోలీసుల ఆంక్షలు, గాయపడటాలు దాదాపు నాటి దృశ్యాలనే పునరావృతం చేస్తున్నాయి. సోమవారం నాటి నిరసనల్లో పలువురు విద్యార్థులు గాయపడటం.. ఈ వ్యవహారం ఢిల్లీ హైకోర్టు వరకు వెళ్లడం విమర్శలకు దారితీసింది.
1997 నాటి విద్యార్థి ప్రధాన్ ఈరోజు ఉంటే ఏం చేసి ఉండేవారనే ప్రశ్నకు రే స్పందిస్తూ.. ఆయన నిజమైన జాతీయవాదిగా హింసకు, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఎప్పుడూ తావు ఇచ్చేవారు కాదని విశ్లేషించారు. నాటి నిరసనలకు నాయకత్వం వహించిన అదే నాయకుడు నేడు వ్యవస్థ తరఫున నిలబడి విద్యార్థుల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి రావడం.. గతం నేటి వర్తమానానికి ఒక అద్దంలా నిలవడం రాజకీయ విశ్లేషకులను సైతం తీవ్రంగా ఆలోజింపజేస్తోంది.