Skip to content
జాతీయం వార్తలు

బహుజన చైతన్యానికి డిజిటల్‌ వేదికలు

Prajapaksham 16 Jun 2026 0 నిమిషాల పఠనం జాతీయం
బహుజన చైతన్యానికి డిజిటల్‌ వేదికలు

Digital Platforms for Strengthening Bahujan Consciousness

ప్రపంచ చరిత్రలో ప్రతి యుగానికి ఒక ఆయుధం ఉంటుంది. ఒకప్పుడు రేడియో, టెలివిజన్‌లు ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేశాయి. కానీ నేటి డిజిటల్‌ యుగంలో ఆ స్థానా న్ని మొబైల్‌ ఫోన్‌ ఆధారిత సోషల్‌ మీడియా ఆక్రమించింది. ఫేస్‌ బుక్‌, ఎక్స్‌, ఇంస్టాగ్రామ్‌, యూ ట్యూబ్‌, వాట్సప్‌, టెలిగ్రామ్‌ వంటి సామాజిక మాధ్యమాలు సమాజాన్ని ప్రభావితం చేసే సాధనంగా, రాజకీయాలను మలిచే వేదికగా మారాయి. ఇటీవల దళిత యువకుడు అభిజిత్‌ దీప్కే ఆన్లైన్‌ వేదికగా ప్రారంభించిన కాక్రోచ్‌ జనతా పార్టీ (సిజెపి) దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఓ కేసులో నిరుద్యోగ యువతను ‘బొద్దింకలు, పరాన్న జీవులుతో పోల్చడంతో వెబ్‌ పేజీలో సిజెపి ప్రారంభమైనది. పార్టీ ప్రారంభించిన గంటల వ్యవధిలో ప్రధాన రాజకీయ పార్టీలకు మించి ఫాలో అయ్యారు. ఐదు రోజుల వ్యవధిలోనే రెండు కోట్లమంది దృష్టిని ఆకర్షించడం ఇంస్టాగ్రామ్‌ చరిత్రలోనే అరుదైన విషయం. ఇది కేవలం ఒక సోషల్‌ మీడియా ట్రెండ్‌ మాత్రమే కాదు, దేశం ఎదుర్కొంటున్న సంక్షోభానికి యువతలో విస్ఫోటనంలా పేలిన అసంతృప్తి జ్వాలలు. మొన్న దీప్కే ప్రారంభించిన సిజెపి ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద నీట్‌ పరీక్ష లీకేజీ వ్యవహారంపై పెద్ద ఎత్తున ధర్నాకు దిగింది. ఇప్పుడు సోషల్‌ మీడియా ప్రజా సమస్యలపై ఉద్యమాలకు, వీధి పోరాటాలకు పునాది వేయగల శక్తిగా మారిందని నిరూపించింది.
సోషల్‌ మీడియా నూతన ఆయుధం
ఒకప్పుడు ఎవరి స్వరాన్ని వినిపించాలో ప్రధాన మీడియా సంస్థలే నిర్ణయించేవి. కానీ సోషల్‌ మీడియా ఆ గుత్తాధిపత్యాన్ని సవాలు చేసింది. ఈ దేశంలో చారిత్రకంగా నిర్లక్ష్యం కాబడ్డ బిసి, ఎస్‌సి, ఎస్‌టిలు జనాభాలో మెజారిటీ అయినప్పటికీ…సామాజిక, రాజకీయ, ఆర్థిక శక్తిలో వారి ప్రాతినిథ్యం అంతంత మాత్రమే. ప్రధాన మీడియా సైతం వారి సమస్య లను ప్రస్తావించ డం లేదు. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియా బహుజన వర్గాల మధ్య అవగాహన పెంచే, వారిని సంఘటితం చేసే ఒక ప్రభావవంతమైన సాధనంగా మారింది. ఒకప్పు డు చైతన్య కార్యక్రమాలు గ్రామ సభలు, సమావేశాలు, కరపత్రాలకే పరిమితమయ్యేవి. నేడు ఒక మొబైల్‌ ఫోన్‌ ద్వారా లక్షల మందిని చేరుకోవచ్చు. సోషల్‌ మీడియా ద్వారా బహుజన చరిత్ర, సామాజిక ఉద్యమాలు, రాజ్యాంగ విలువలు, విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలపై విస్తృత చర్చలు నిర్వహించవచ్చు. ఒక ప్రాంతంలో జరిగిన అన్యాయం, వివక్ష లేదా ప్రజా సమస్యలను దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మార్చగల సామర్థ్యం దీని కి ఉంది. పీడిత వర్గాలైన దళిత, బహుజనులు తమ విముక్తికి సామాజిక మీడియాను సక్రమంగా వినియోగిస్తున్నారా? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. బిసి ఎష్‌సి, ఎస్‌టిల విముక్తి కోసం జరిగే బహుజన ఉద్యమాలు ప్రజలకు చేరాల్సినంత చేరకపోవడమే ఇందుకు నిదర్శ నం. ఆధిపత్య కులాలు, వారి పార్టీలు సోషల్‌ మీడియా కేంద్రంగా అనేక తప్పుదోవ పట్టించే సమాచారాన్ని డంప్‌ చేస్తున్నారు. దాన్నే బహుజన వర్గాలు అనుసరిస్తున్నారు తప్ప, అభిముఖంగా దీటైన కౌంటర్‌ ఇవ్వలేకపోతున్నారు. ఇప్పుడు మనీ, మీడియా, మాఫియాతో రాజకీయాలను శాసిస్తున్న కొన్ని ఆధిపత్య వర్గాలకు అభిముఖంగా ఆన్లైన్‌ వేదికగా దీప్కే ప్రారంభించిన కాక్రోచ్‌ జనతా పార్టీ సవాల్‌గా నిలిచింది. భారత రాజకీయ చరిత్రలో కేవలం సోషల్‌ మీడియా వేదికగా పురుడుపోసుకొని ఇంతటి తీవ్రమైన ప్రజా ఉద్యమంగా మారిన సందర్భం మరొకటి లేదు.
సోషల్‌ మీడియా ప్రజాస్వామ్య శక్తి
నేటి రాజకీయాల్లో సోషల్‌ మీడియా ఒక కొత్త యుద్ధభూమిగా మారింది. ఇది రాజకీయ ప్రచారం కోసం మాత్రమే కాదు. ఇది అట్టడుగు వర్గాల సామాజిక న్యాయంకోసం పోరాడే వేదిక కూడా. ప్రధాన మీడియా విస్మరించిన అనేక సమస్యలు, కుల వివక్ష, సామాజిక అసమానతలు, అణచివేతలు, అన్యాయాలు సోషల్‌ మీడియా ద్వారా వెలుగులోకి వస్తున్నాయి. భారతదేశ జనాభాలో మెజారిటీగా ఉన్న బిసి, ఎస్‌సి, ఎస్‌టిలు తమ రాజకీయ, సామాజిక, ఆర్థిక హక్కుల కోసం పోరాడుతున్న ఈ సమయంలో సోషల్‌ మీడియా ఒక కీలక సాధనంగా నిలుస్తోంది. చైతన్యవంతమైన ఓటరును నిర్మించడంలో, ప్రజల్లో రాజకీయ అవగాహన పెంచడంలో, ప్రత్యామ్నాయ ఆలోచనలను వ్యాప్తి చేయడంలో దీనిపాత్ర మరింత పెరగనుం ది. అయితే కేవలం సోషల్‌ మీడియా పోస్టులు, వీడియోలు లేదా హ్యాష్‌ట్యాగ్‌లతో సంపూర్ణ మార్పు రాకపోవచ్చు. కానీ మార్పుకు కచ్చితంగా దోహదపడుతుంది. ఆన్‌లైన్‌ చైతన్యం, ఆఫ్‌లైన్‌ ఉద్యమాలతో కలిసినప్పుడే శాశ్వత మార్పు సాధ్యమవుతుంది. నేటి ప్రపంచంలో ఒక పోస్ట్‌ ఉద్యమాన్ని ప్రారంభించగలదు, ఒక హ్యాష్‌ట్యాగ్‌ లక్షల మందిని ఏకం చేయగలదనీ, అది ప్రజల చేతుల్లో ఉన్న ఒక ప్రజాస్వామ్య శక్తి అని అభిషేక్‌ దీప్కే నిరూపించాడు. కాబట్టి ఇప్పుడు సోషల్‌ మీడియా శకాన్ని వాడుకుంటూ బహుజన ఐక్య పోరాటాలకు పిలుపు
నివ్వాల్సిన అవసరం ఉంది.
రచయిత : సంపతి రమేష్‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *