Skip to content
జాతీయం వార్తలు

కాక్‌రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దాడి.. జైపూర్‌లో వేడెక్కిన రాజకీయ నిరసన

Prajapaksham 15 Jun 2026 1 నిమిషాల పఠనం జాతీయం
కాక్‌రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దాడి.. జైపూర్‌లో వేడెక్కిన రాజకీయ నిరసన

Abhijeet Dipke Allegedly Assaulted at Jaipur Demonstration (Photo-Video Grab)

యువతలో సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ఆదరణ పొందుతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై జైపూర్‌లో జరిగిన దాడి తీవ్ర చర్చనీయాంశమైంది. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని షహీద్ స్మారక్ వద్ద సోమవారం జరిగిన నిరసన కార్యక్రమంలో ఈ అవాంఛనీయ ఘటన చోటు చేసుకుంది.

నీట్ (NEET) పేపర్ లీక్ ఉదంతం, దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య, విద్యా వ్యవస్థలోని లోపాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ ఈ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమం జరుగుతుండగా, కొంతమంది వ్యక్తులు హఠాత్తుగా అభిజీత్ దీప్కే వద్దకు వచ్చి ఆయనపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. మొదట ఆయన చెంపపై కొట్టడంతో దీప్కే ఆత్మరక్షణ కోసం ప్రయత్నించారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

దాడికి గురైన అభిజీత్‌ను రక్షించేందుకు రంగంలోకి దిగిన కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు, ఎదురుదాడికి దిగి దుండగులను చితకబాదారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. గతంలో కొందరు యువతనుద్దేశించి చేసిన ‘బొద్దింకలు’ అనే వ్యాఖ్యను విమర్శిస్తూ, దానికి వ్యంగ్యంగా అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ విద్యార్థి అయిన 30 ఏళ్ల అభిజీత్ దీప్కే ఈ పార్టీని మే నెలలో స్థాపించారు. అతి తక్కువ కాలంలోనే తనదైన వినూత్న శైలి నిరసనలతో ఈ పార్టీ యువతను విశేషంగా ఆకర్షించింది.

ఇప్పటికే ఢిల్లీ, పుణె వంటి నగరాల్లో విజయవంతంగా ఆందోళనలు చేపట్టిన ఈ బృందం, తాజాగా జైపూర్‌లో కూడా తన గళాన్ని వినిపించాలని ప్రయత్నించింది. అయితే, క్షేత్రస్థాయిలో నిరసనలు తెలుపుతున్న సమయంలో ఇలాంటి భౌతిక దాడులు జరగడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలిపే హక్కుపై జరుగుతున్న దాడులను ఆ పార్టీ మద్దతుదారులు ఖండిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసు యంత్రాంగం ఏ విధమైన చర్యలు తీసుకుంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *