తెలంగాణలో రూ. 40 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులు ఫాస్ట్ ట్రాక్.. కాని ఒకటే సమస్య..అదేంటంటే..
Indian Railway
తెలంగాణలో సుమారు రూ. 40 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టుల అమలుకు ప్రభుత్వం వేగం పెంచింది. కొత్త రైల్వే లైన్లు, డబ్లింగ్, విద్యుదీకరణ, స్టేషన్ ఆధునీకరణ వంటి కీలక పనులను త్వరితగతిన పూర్తి చేసి రాష్ట్రంలో రైల్వే కనెక్టివిటీని మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు అత్యంత వేగంగా ముందుకు సాగుతున్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌సభలో వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ. 40,769 కోట్ల అంచనా వ్యయంతో 21 కీలక రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం వివిధ దశల్లో సాగుతోందని ఆయన తెలిపారు. వీటిలో 6 కొత్త రైల్వే లైన్లు , 15 ట్రాక్ డబ్లింగ్ ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. మొత్తం 2,347 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టులకు సంబంధించి.. గత మార్చి నాటికి 677 కిలోమీటర్ల మార్గాన్ని ఇప్పటికే అందుబాటులోకి తెచ్చామని, దీనికోసం ఇప్పటివరకు రూ. 12,105 కోట్లు ఖర్చు చేశామని వివరించారు.
ప్రస్తుతం పురోగతిలో ఉన్న ప్రధాన ప్రాజెక్టులలో భద్రాచలం మీదుగా మల్కన్‌గిరి నుండి పాండురంగపురం వరకు నిర్మించే 174 కిలోమీటర్ల కొత్త లైన్ (అంచనా వ్యయం రూ. 3,592 కోట్లు), సికింద్రాబాద్ నుండి వాడి వరకు నిర్మించనున్న 3వ , 4వ రైల్వే లైన్లు (అంచనా వ్యయం రూ. 5,000 కోట్లకు పైగా), అలాగే మునీరాబాద్ నుండి మహబూబ్‌నగర్ వరకు నిర్మించనున్న కొత్త లైన్ (అంచనా వ్యయం రూ. 4,000 కోట్లు) అత్యంత కీలకమైనవిగా ఉన్నాయి. ఇవే కాకుండా రాష్ట్రంలో మొత్తం రూ. 4,883 కోట్ల అంచనా వ్యయంతో 118 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు (ROBలు), రోడ్ అండర్ బ్రిడ్జిల (RUBలు) నిర్మాణానికి కేంద్రం మంజూరు ఇచ్చింది.
అయితే ఈ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి భూసేకరణ ప్రధాన సవాలుగా మారిందని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ప్రాజెక్టులకు అవసరమైన 2,792 హెక్టార్ల భూమిలో ఇప్పటివరకు కేవలం 1,772 హెక్టార్లు (63 శాతం) మాత్రమే సేకరించగా, మరో 1,020 హెక్టార్ల భూసేకరణ ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ముఖ్యంగా ఈ సమస్యల కారణంగానే గుంటూరు-బిబినగర్ డబ్లింగ్, ముద్ఖేడ్-మేడ్చల్, మహబూబ్‌నగర్-ధోన్ డబ్లింగ్ ప్రాజెక్టులు, అలాగే 15 ఆర్‌ఓబీ ప్రాజెక్టులు తీవ్ర జాప్యాన్ని ఎదుర్కొంటున్నాయని వెల్లడించారు.
ఈ అడ్డంకులు ఉన్నప్పటికీ 2014 నుండి 2026 మధ్య కాలంలో తెలంగాణలో 888 కిలోమీటర్ల కొత్త ట్రాక్‌లను అందుబాటులోకి తెచ్చామని, ఇది ఏటా సగటున 74 కిలోమీటర్ల నిర్మాణ వేగానికి సమానమని కేంద్రం నివేదించింది. ప్రయాణికుల సౌకర్యార్థం ఇటీవల కాలంలో 21 జతల కొత్త రైలు సర్వీసులను తెలంగాణకు కేటాయించారు.
వీటిలో చార్లపల్లి టెర్మినల్ నుండి శాలిమార్, కామాఖ్య, తిరువనంతపురం, ముజఫర్‌పూర్ వంటి నగరాలను అనుసంధానించే 10 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు కూడా ఉన్నాయి. అలాగే సరుకు రవాణాను వేగవంతం చేసేందుకు సత్తుపల్లి, సుల్తానాబాద్, తిప్పర్తి, రామగుండం, చిట్యాల్, విష్ణుపురంలలో 6 గతి శక్తి మల్టీ-మోడల్ కార్గో టెర్మినళ్లను అందుబాటులోకి తీసుకురాగా, మరో ఎనిమిదింటికి సూత్రప్రాయ ఆమోదం తెలిపినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
- తెలంగాణలో రూ. 40 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులు ఫాస్ట్ ట్రాక్.. కాని ఒకటే సమస్య..అదేంటంటే..
- క్షుద్ర పూజలకు బలయ్యేదెవరు.. మూఢనమ్మకాల మధ్య వేడెక్కిన తెలంగాణ రాజకీయాలు..
- Real Estate: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చూపు వరంగల్ హైవే వైపు…బీబీనగర్, ఉప్పల్ కారిడార్ వైపు చూస్తున్న మిడిల్ క్లాస్..
- Lok Sabha Director Death: రూ.70 లక్షల అప్పు.. లోక్‌సభ సచివాలయ డైరెక్టర్ గౌరవ్ గౌతమ్ మృతి.. 15 పేజీల సూసైడ్ నోట్..
- Rainy Season Health Alert: వానాకాలంలో ఆఫీసుకు వెళ్లేవారికి అలర్ట్.. ఈ ప్రమాదకర ఇన్ఫెక్షన్లతో జాగ్రత్త..