దగ్గు సిరప్‌లకు ఇక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి.. మందుల విక్రయాలపై కేంద్రం కొత్త నిబంధనలు..
Doctor’s Prescription Now Mandatory for Cough Syrups
దగ్గు సిరప్‌ల (Cough Syrups) విక్రయాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రాత్మక, అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇకపై దగ్గు సిరప్‌లను కొనుగోలు చేయాలంటే వైద్యుల ప్రిస్క్రిప్షన్ (Doctor’s Prescription) ఖచ్చితంగా ఉండాలని స్పష్టం చేస్తూ కేంద్రం అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు 1945 నాటి పాత డ్రగ్ రూల్స్‌లో ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. తమిళనాడుకు చెందిన ‘శ్రీసన్’ అనే కంపెనీ ఉత్పత్తి చేసిన ‘కోల్డ్రిఫ్’ దగ్గు సిరప్ తాగి సుమారు 20 మంది చిన్నారులు మృతి చెందిన విషాదకర ఘటన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. భారత తయారీకి చెందిన కొన్ని దగ్గు మందుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గతంలోనే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ అంతర్జాతీయ హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘డ్రగ్స్ రూల్స్ 2026’ను నోటిఫై చేస్తూ పాత చట్టంలో మార్పులు చేసింది. ఇందులో భాగంగా డ్రగ్స్ రూల్స్‌లోని ‘షెడ్యూల్ కే’ (Schedule K) కేటగిరీ నుండి ‘సిరప్’ అనే పదాన్ని పూర్తిగా తొలగించింది. డ్రగ్స్ యాక్ట్ 1940 ప్రకారం, షెడ్యూల్ కే లో ఉండే కొన్ని రకాల సాధారణ మందుల తయారీ, సరఫరా ,అమ్మకాలకు ప్రత్యేక లైసెన్స్ అవసరం లేకుండానే విక్రయించుకునే మినహాయింపు ఉంటుంది. సాధారణ గృహ అవసరాల మందులుగా భావించే ఆస్పిరిన్, పారాసిటమాల్, పెయిన్ కిల్లర్ బామ్‌లు వంటివి ఈ కేటగిరీ కిందకే వస్తాయి. అయితే, ఇప్పటివరకు దగ్గు సిరప్‌లు కూడా ఈ జాబితాలోనే ఉండటంతో ఎటువంటి లైసెన్స్ లేదా ప్రిస్క్రిప్షన్ లేకుండానే మార్కెట్లో సులభంగా లభించేవి.
తాజా సవరణల ప్రకారం, షెడ్యూల్ కే నుండి సిరప్ పదాన్ని తొలగించడమే కాకుండా దగ్గు కోసం వాడే లాజెంజిస్, పిల్స్, ,టాబ్లెట్లను కూడా దీని పరిధిలోకి తీసుకువచ్చారు. దీనివల్ల సాధారణ దుకాణాల్లో లేదా ప్రిస్క్రిప్షన్ లేకుండా వీటిని విక్రయించడం కుదరదు. ప్రభుత్వం ఈ మార్పులకు సంబంధించిన అధికారిక గెజిట్‌ను ప్రచురించడంతో, ఈ కొత్త సవరణలు తక్షణమే దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి. చిన్నారుల ప్రాణాల రక్షణ ,మందుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.