Repo Rate Unchanged: లోన్ తీసుకున్నవారికి గుడ్ న్యూస్.. రెపో రేటును యథాతథంగా ఉంచిన ఆర్‌బీఐ..
RBI Sanjay Malhotra
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తన తాజా ద్రవ్య విధాన సమీక్షలో రెపో రేటును యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలు తీసుకున్న వారికి తక్షణ వడ్డీ భారం పెరగకుండా ఊరట లభించింది.
Repo Rate Unchanged: భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) దేశీయ ఆర్థిక వ్యవస్థ సుస్థిరతకు ప్రాధాన్యమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం ముగిసిన అనంతరం ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పాలసీ రేట్ల వివరాలను వెల్లడించారు. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక ఉద్రిక్తతలు, వాణిజ్య అనిశ్చితుల మధ్య ప్రస్తుతానికి “తటస్థ వైఖరి”ని అవలంబించడమే శ్రేయస్కరమని భావించిన ఎంపీసీ.. కీలకమైన రెపో రేటును ఎలాంటి మార్పులు లేకుండా 5.25 శాతంగానే కొనసాగిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. గత జూన్ నెలలో జరిగిన ఎంపీసీ సమావేశంలో కూడా ఆర్‌బీఐ ఇదే రేటును కొనసాగించడం గమనార్హం.
ఈ నిర్ణయంతో హోమ్ లోన్లు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలు తీసుకున్న సామాన్యలకు.. ఈఎంఐల భారం తక్షణమే పెరగకుండా ఊరట లభించింది. బ్యాంకులు కూడా కొత్తగా ఇచ్చే రుణాలపై ప్రస్తుత వడ్డీ రేట్లనే కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. రెపో రేటుతో పాటుగా స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్‌డీఎఫ్) రేటును 5 శాతంగానూ.. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్) రేటు, బ్యాంక్ రేటును 5.5 శాతంగానూ యథాతథంగా ఉంచుతున్నట్లు కేంద్ర బ్యాంకు స్పష్టం చేసింది.
ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై మాట్లాడిన ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా.. అమెరికా విధించిన కొత్త సుంకాల కారణంగా ప్రపంచ వాణిజ్యంలో అనిశ్చిత వాతావరణం నెలకొందని తెలిపారు. దీనికి తోడు పశ్చిమాసియా సంక్షోభం ప్రభావంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు, ప్రధాన ఆర్థిక మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయని ఆయన వివరించారు. ముడి చమురు ధరల హెచ్చుతగ్గులు, విదేశీ మార్కెట్లో రూపాయి మారకపు విలువలో వస్తున్న మార్పులు, భౌగోళిక రాజకీయ పరిణామాలు ఆర్‌బీఐ తీసుకునే నిర్ణయాలపై ప్రధాన ప్రభావం చూపుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం ఇటీవల స్వల్పంగా పెరిగినప్పటికీ, ఆర్‌బీఐ నిర్దేశిత పరిమితుల్లోనే ఉందన్నారు.
ఈ రకమైన సవాళ్లు ఉన్నప్పటికీ.. భారత దేశీయ ఆర్థిక పునాదులు చాలా బలంగా ఉన్నాయని ఆర్‌బీఐ గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో వృద్ధి రేటులో ఊపు కొనసాగడం, సానుకూల వర్షపాతం నమోదు కావడం , విదేశీ పెట్టుబడులు నిలకడగా రావడం వంటి అంశాలు భారత ఆర్థిక వ్యవస్థకు బలమైన మద్దతుగా నిలుస్తున్నాయని చెప్పారు. అయినప్పటికీ, దేశీయంగా కొన్ని రంగాలు ప్రారంభ దశలోనే ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని, ద్రవ్యోల్బణం , ఆర్థిక వృద్ధి అంచనాల చుట్టూ ఇంకా గణనీయమైన ప్రమాదాలు పొంచి ఉన్నాయని హెచ్చరించారు.
గత జూన్ సమావేశంలో ఆర్‌బీఐ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత జీడీపీ వృద్ధి అంచనాను 6.9 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గించిన విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితులు, సరఫరా వ్యవస్థలో అంతరాయాలు, ఇంధన ధరల పెరుగుదలే జీడీపీ అంచనాల తగ్గింపునకు ప్రధాన కారణాలని ఆర్‌బీఐ గతంలోనే వెల్లడించింది. మొత్తం మీద, ప్రస్తుత సంక్లిష్ట పరిస్థితుల్లో వృద్ధిని ప్రోత్సహిస్తూనే ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడానికి ఆర్‌బీఐ అచితూచి అడుగులు వేస్తోంది.
- Hyderabad Horror: ఐడీ ప్రూఫ్ అడిగిన హోటల్ సిబ్బందిపై కర్రలతో దాడి.. వీడియో ఇదిగో..
- Repo Rate Unchanged: లోన్ తీసుకున్నవారికి గుడ్ న్యూస్.. రెపో రేటును యథాతథంగా ఉంచిన ఆర్‌బీఐ..
- Metabolic Health Crisis: భారత్లో మెటబాలిక్ హెల్త్ సంక్షోభం.. ఆహారం, జీవనశైలిపై ఏఐజీ డాక్టర్లు కీలక హెచ్చరిక..
- లావాదేవీలు రూ. 2 వేలు దాటితే ఛార్జీలు.. UPI చెల్లింపులపై కొత్త నిబంధనలు..
- జీవితం అమూల్యం… జిందగీని ప్రేమించండి !