పైసల్లేవ్.. ఉద్యోగుల నెత్తిమీద శ్వేతపత్రం బాంబు వేసిన చంద్రబాబు.. వాట్ నెక్స్ట్..
Chandrababu Naidu
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య వాతావరణం మరింత వేడెక్కింది. పీఆర్సీ (PRC), డీఏ (DA), ఐఆర్ (IR), బకాయిల చెల్లింపులపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి స్పష్టమైన డెడ్‌లైన్ విధించిన నేపథ్యంలో.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖపై శ్వేతపత్రాన్ని విడుదల చేయడం తీవ్ర ప్రాధాన్యం సంతరించుకుంది. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను అంకెలతో వివరించడం ద్వారా ప్రభుత్వం ఉద్యోగ వర్గాలకు ఒక స్పష్టమైన సంకేతాన్ని పంపినట్లయింది.
రాష్ట్రానికి వస్తున్న మొత్తం ఆదాయంలో సింహభాగం ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లకే సరిపోతోందని ముఖ్యమంత్రి గణాంకాలతో వెల్లడించారు. 2014-15 నుండి 2018-19 వరకు మానవవనరులపై సగటు వ్యయం రాష్ట్ర ఆదాయంలో 87 శాతంగా ఉండగా, 2019-20 నుండి 2023-24 మధ్య అది ఏకంగా 110 శాతానికి పెరిగిందని వివరించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మితిమీరిన నియామకాలు చేపట్టడం వల్లే ఈ భారం విపరీతంగా పెరిగిందని కుండబద్దలు కొట్టారు.
ప్రస్తుతం వస్తున్న ఆదాయంలో 96 శాతం కేవలం జీతాలు, పింఛన్లకే పోతుంటే, ఇక ప్రజలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేపడతామని సీఎం ప్రశ్నించడం వెనుక పెద్ద వ్యూహమే ఉందనే చర్చ నడుస్తోంది.
పీఆర్సీ, పెండింగ్ బకాయిలపై తక్షణమే సానుకూల నిర్ణయం తీసుకోకపోతే ఈ నెల 13న సమావేశమై ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాల నాయకులు, ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఫ్యాప్టో హెచ్చరించాయి. అంగన్వాడీలు, ఔట్సోర్సింగ్, ఆర్టీసీ ఉద్యోగులు కూడా తమ హామీలను నెరవేర్చాలంటూ రోడ్డెక్కుతున్నారు.
అయితే, ఈ శ్వేతపత్రం ద్వారా ప్రభుత్వం చాలా తెలివిగా మైండ్ గేమ్ ఆడిందనే విశ్లేషణలు వస్తున్నాయి. ఉద్యోగులకు ఇవ్వడానికి సొమ్ము లేదనే నిజాన్ని ప్రజల ముందు ఉంచడం ద్వారా.. ఒకవేళ ఉద్యోగులు రోడ్డెక్కితే వారి పట్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా కూటమి ప్రభుత్వం గ్రౌండ్ ప్రిపేర్ చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ సమస్యలు చిటికెలో తీరుతాయని ఆశపడిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రస్తుతం తీవ్ర అనిశ్చితిలో పడ్డారు. ఆర్థిక పరిస్థితి బాలేదని సాక్షాత్తూ ముఖ్యమంత్రినే శ్వేతపత్రం ద్వారా వెల్లడించిన దృష్ట్యా.. వారు తమ డిమాండ్లను తాత్కాలికంగా పక్కనపెడతారా లేక ఉద్యమ బాట పడతారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి ఉద్యోగ వర్గాల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లు మారిందని, ఈ నేపథ్యంలో వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
- Varupula Subbarao Joins Jana Sena: వైసీపీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక
- Adilabad IT Tower: ఆదిలాబాద్‌లో ఐటీ టవర్ రెడీ.. 2 వేల ఉద్యోగాలకు అవకాశం, కంపెనీల ఆసక్తి
- Indiramma Towers: రాయదుర్గంలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణం ప్రారంభం..పేదలందరికీ ఇళ్లు అందే వరకు కొనసాగిస్తామన్న మంత్రి పొంగులేటి..
- SIM Card Misuse: SIM కార్డు ఎవరికైనా ఇచ్చే ముందు జాగ్రత్త..దుర్వినియోగం చేస్తే రూ.50 లక్షల జరిమానా, 3 ఏళ్ల జైలు శిక్ష..
- Ayodhya Ram Mandir Donation Theft: అయోధ్య రామ మందిరంలో భారీ కుంభకోణం.. 105 సార్లు విరాళాల చోరీ..సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక