Skip to content
క్రైమ్ వార్తలు

అమెరికాలో కారు ప్రమాదం.. కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ సతీమణికి గాయాలు

Prajapaksham 04 Jun 2026 0 నిమిషాల పఠనం క్రైమ్
అమెరికాలో కారు ప్రమాదం.. కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ సతీమణికి గాయాలు

Congress Leader Madhu Yashki's Wife Injured in US Car Accident

మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌ సతీమణి డాక్టర్‌ సుచియాష్కీ అమెరికాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. తమ చిన్న కుమార్తె డాక్టర్‌ గగనయాష్కీని బోస్టన్‌లోని హార్వర్డ్‌ యూనివర్సిటీ అనుబంధ ఆసుపత్రిలో ఎండీ కోర్సులో చేర్పించి, తిరిగి న్యూయార్క్‌కు వస్తుండగా భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో అక్కడ భారీగా వర్షం కురుస్తుండటంతో ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో డాక్టర్‌ సుచియాష్కీకి పక్కటెముకలు విరిగిపోగా, ప్రస్తుతం ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

మధుయాష్కీ దంపతులు తమ చిన్న కుమార్తె డాక్టర్‌ గగన న్యూయార్క్‌ మెడికల్‌ కళాశాలలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన నేపథ్యంలో, అక్కడ జరిగిన కాన్వొకేషన్‌ (పట్టాల ప్రధానోత్సవం) వేడుకకు హాజరయ్యేందుకు అమెరికా వెళ్లారు. కుమార్తె చదువు ముగించుకుని హార్వర్డ్‌లో ఎండీ సీటు సాధించడంతో, ఆమెను అక్కడ జాయిన్‌ చేసి వస్తుండగా ఈ దురదృష్టకర సంఘటన ఎదురైంది. ప్రమాదం జరిగిన సమయంలో మధుయాష్కీ కూడా వేరే కారులో అదే మార్గంలో ప్రయాణిస్తున్నారు.

నిజానికి అనుకున్న ప్రణాళిక ప్రకారం మధుయాష్కీ గురువారం నాడే భారతదేశానికి తిరిగి రావాల్సి ఉంది. అయితే భార్యకు ప్రమాదం జరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కారణంగా ఆయన తన ఇండియా ప్రయాణాన్ని రద్దు చేసుకుని అమెరికాలోనే ఉండిపోయారు. ఈ ప్రమాద వార్త తెలుసుకున్న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ వెంటనే స్పందించి, మధుయాష్కీగౌడ్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారు. డాక్టర్ సుచియాష్కీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ఆయనను పరామర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *