Skip to content
క్రైమ్ వార్తలు

Karnataka Doctor Case: కర్ణాటకలో దారుణం.. భర్తను హతమార్చి, కొడుకును కత్తితో గుండెపై పొడిచి.. సైలెంట్‌గా రీల్స్ చూస్తూ కూర్చున్న భార్య..

Prajapaksham 17 Jul 2026 1 నిమిషాల పఠనం క్రైమ్
Karnataka Doctor Case: కర్ణాటకలో దారుణం.. భర్తను హతమార్చి, కొడుకును కత్తితో గుండెపై పొడిచి.. సైలెంట్‌గా రీల్స్ చూస్తూ కూర్చున్న భార్య..

Karnataka Doctor: కర్ణాటకలో దారుణం.. భర్తను హతమార్చి, కొడుకును కత్తితో గుండెపై పొడిచి.. సైలెంట్‌గా రీల్స్ చూస్తూ కూర్చున్న భార్య..

Karnataka Doctor Case: కర్ణాటకలో ఒళ్లు గగుర్పొడిచే ఘోరకలి వెలుగుచూసింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భర్తను దారుణంగా నరికి చంపి, కన్న కొడుకును కూడా కత్తితో పొడిచి చావుబతుకుల మధ్య వదిలేసిందో భార్య. ఆపై ఏమీ తెలియనట్లు గదిలో కూర్చుని ఫోన్లో రీల్స్ చూస్తూ కాలక్షేపం చేసింది. ధార్వాడ్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో జరిగిన ఈ అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.

కర్ణాటకలోని ధార్వాడ్ రంకా స్టెల్లో అపార్ట్‌మెంట్‌లో అనస్థీషియాలజిస్ట్ డాక్టర్ కిరణ్ హొన్నన్నవర్ (45) హత్య కేసులో పోలీసులు గురువారం ఆయన భార్య, నేత్ర వైద్యురాలు డాక్టర్ ప్రియాంకను అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణలో భాగంగా ఈ ఘటనకు సంబంధించిన పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

బుధవారం సాయంత్రం పోలీసులు, బంధువులు ఫ్లాట్‌లోకి ప్రవేశించినప్పుడు నిందితురాలు ప్రియాంక ప్రవర్తన తీవ్ర అనుమానాలకు తావిచ్చింది. భర్త శవం పక్క గదిలో ఉండగా, కత్తిపోట్లతో కొడుకు కొట్టుమిట్టాడుతున్నా ఆమె ఏమాత్రం చలనం లేకుండా ఫోన్ చూస్తూ మంచంపై కూర్చుని ఉంది. డాక్టర్ కిరణ్ నిద్రిస్తున్న సమయంలోనే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీస్ చీఫ్ ఎన్. శశికమార్ తెలిపారు. కిరణ్ మెడ, శరీర భాగాలపై దాదాపు 8 నుంచి 10 కత్తిపోట్లు ఉన్నాయి. తనను తాను రక్షించుకోవడానికి కిరణ్ ప్రయత్నించినట్లు ఆయన చేతులపై ఉన్న గాయాలు బట్టి తెలుస్తోందని.. ఇదంతా పథకం ప్రకారమే జరిగిన హత్య అని పోలీసులు స్పష్టం చేశారు. తీవ్ర గాయాలపాలైన 8 ఏళ్ల కుమారుడు నిహిత్ ఛాతీపై మూడు నుంచి నాలుగు కత్తిపోట్లు ఉన్నప్పటికీ ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం బాలుడు ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.

అదుపులోకి తీసుకున్న కొద్దిసేపటికే.. గురువారం తెల్లవారుజామున ప్రియాంక రక్తంలో చక్కెర (షుగర్) స్థాయిలు ఒక్కసారిగా పడిపోవడంతో ఆమెను కేఎంసీ-ఆర్ఐ ఆసుపత్రిలో చేర్చారు. తనకు మధుమేహం లేకపోయినప్పటికీ స్వయంగా ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకున్నట్లు ఆమె వైద్యుల వద్ద వెల్లడించింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని.. మరో మూడు నాలుగు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఈశ్వర్ హసబీ తెలిపారు. ఆమె మానసిక స్థితిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

మంగళవారం రాత్రి ఈ దారుణం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బుధవారం కిరణ్ కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా.. ఆయన నిద్రపోతున్నాడని, అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నాడని ప్రియాంక అబద్ధాలు చెప్పి తప్పించుకోవాలని చూసింది. బుధవారం మధ్యాహ్నం హాజరుకావాల్సిన ఒక సిజేరియన్ ఆపరేషన్‌కు కూడా కిరణ్ రాకపోవడంతో ఆసుపత్రి యాజమాన్యానికి ప్రియాంక ఇదే అబద్ధం చెప్పింది. బంధువులకు అనుమానం వచ్చి ఫ్లాట్‌కు రాగా.. మొదట ఆమె తలుపు తీయడానికి నిరాకరించింది. చివరకు తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లడంతో అసలు ఘోరం బయటపడింది.

అపార్ట్‌మెంట్‌లో వేరే ఇతర వ్యక్తులు ప్రవేశించిన ఆధారాలు లేవని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా స్పష్టమైంది. పదేళ్ల క్రితం పెళ్లయిన ఈ దంపతుల మధ్య తీవ్ర వైవాహిక వివాదాలు నడుస్తున్నాయని, మూడు రోజుల క్రితమే ప్రియాంక తన భర్తను కత్తితో బెదిరించిందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు ముమ్మరం చేశారు.