Bombay High Court: తండ్రే మృగంలా కాటేస్తే.. అంతకంటే నీచమైన నేరం మరొకటి ఉండదు..నిందితుడు జీవిత ఖైదును సమర్థించిన బాంబే హైకోర్టు
Bombay High Court: తండ్రే మృగంలా కాటేస్తే.. అంతకంటే నీచమైన నేరం మరొకటి ఉండదు..నిందితుడు జీవిత ఖైదును సమర్థించిన బాంబే కోర్టు
Bombay High Court: కన్న కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే మృగంలా మారి ఆమెపై అత్యాచారానికి పాల్పడితే.. అంతకంటే హేయమైన నేరం మరొకటి ఉండబోదని బాంబే హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడి ఆమె గర్భవతి కావడానికి కారణమైన ఒక తండ్రికి కింది కోర్టు విధించిన జీవిత ఖైదు శిక్షను సమర్థిస్తూ హైకోర్టు నాగ్పూర్ బెంచ్ ఈ కీలక తీర్పునిచ్చింది. తన శిక్షను సవాల్ చేస్తూ నిందితుడు దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం పూర్తిగా కొట్టేసింది.
మహారాష్ట్రకు చెందిన 43 ఏళ్ల వ్యక్తి తన 12 ఏళ్ల కుమార్తెపై కొన్నేళ్లుగా అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చాడు. తల్లి చనిపోవడంతో ఆ బాలిక ఈ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేకపోయింది. అయితే, 2021 ఏప్రిల్లో ఒక ఆశా కార్యకర్త గ్రామంలో సర్వే నిర్వహిస్తూ.. బాలిక బలహీనమైన శారీరక, మానసిక స్థితిని గమనించి ఆమెను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించగా ఆ బాలిక 27 వారాల గర్భవతి అని నిర్ధారణ అయింది. దీనిపై ఆశా కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కేసు దర్యాప్తులో ఉండగానే ఆ బాలిక ఒక శిశువుకు జన్మనివ్వగా.. ఆ బిడ్డకు జరిపిన డీఎన్ఏ పరీక్షలు నిందితుడి నమూనాలతో సరిపోలాయి. దీంతో 2021లో ట్రయల్ కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించింది.
అయితే తను తిడుతున్నాననే కోపంతోనే కూతురు తనను ఈ కేసులో ఇరికించిందంటూ నిందితుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం నిందితుడి వాదనను తీవ్రంగా తప్పుపట్టింది. సొంత తండ్రి ప్రవర్తనతో ఆ బాలిక ఎంతటి మనోవేదనకు గురైందో అర్థం చేసుకోగలమని కోర్టు వ్యాఖ్యానించింది. కుమార్తెను రక్షించాల్సిన తండ్రే ఆమె జీవితాన్ని నాశనం చేశాడని తండ్రిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యాచారం అనేది కేవలం లైంగిక దాడి మాత్రమే కాదని.. అది బాధితురాలిని జీవితాంతం వెంటాడే మాయని మచ్చ అని కోర్టు విచారం వ్యక్తం చేస్తూ నిందితుడికి జీవిత ఖైదు శిక్షను ఖరారు చేసింది.