Editorial: ఆర్ఎస్ఎస్ సంయమన సుద్దులు
ఆర్ఎస్ఎస్ సంయమన సుద్దులు ( ప్రతీకాత్మకచిత్రం)
అయోధ్య రామాలయ విరాళాల చోరీ వ్యవహారంపై ఎట్టకేలకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నోరు విప్పింది. ఈ వివాదం తెరపైకి వచ్చిన దాదాపు నెల రోజులకు ఆర్ఎస్ఎస్ తరఫున ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే స్పందించారు. శ్రీరామ లల్లా మందిరంలో విరాళాల దొంగతనం జరగడం అత్యంత దురదృష్టకరమని, ఇది కోట్లాది రామభక్తుల మనోభావాలను, విశ్వాసాన్ని తీవ్రంగా గాయపరిచిందని చెప్పేందుకు ఆయనకు ఎందుకు ఇన్ని రోజులు పట్టినట్లు?
అలాగే శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్ష్రేత్ర ట్రస్ట్ విజ్ఞప్తి మేరకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ‘సిట్’ను ఏర్పాటు చేసిందని చెప్పడం విడ్డూరంగా ఉంది. నిజానికి అంతకన్నా ముందే సమాజ్ వాదీ పార్టీ విరాళాల చోరీ అంశాన్ని లేవనెత్తిన సమయంలో కొట్టిపారేసే ప్రయత్నం చేసింది అక్కడి ప్రభుత్వం. అలాగే ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ అలాంటిదేమీ లేదంటూ, నిరంతర ఆడిట్ జరుగుతోందని కప్పిపుచ్చుకో జూశారు. చివరకు ప్రతిపక్షాలు, ప్రజల నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడికి తలొగ్గి ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం ‘సిట్’ను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడేమో ఆ ఘనతను కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రస్ట్‌కే కట్టబెట్టి, దానికే సచ్ఛీలతా సర్టిఫికెటు ఇచ్చేందుకు ఆర్ఎస్ఎస్ పడుతున్న తాపత్రయం వెల్లడవుతోంది.
నేరస్తులు ఎంతటి వారైనా కఠినాతికఠినమైన శిక్షపడేలా చూడాలని కోరిన హోసబాలే, అందుకు నిష్పాక్షిక దర్యాపుకై ట్రస్టు బాధ్యులను తప్పించాలనే కనీస అవసరాన్ని గుర్తించ నిరాకరిస్తున్నారు. ఈ దురదృష్టకర ఘటనను అడ్డు పెట్టుకొని హిందూ ధర్మాన్ని, సమాజాన్ని బద్నాం చేసేందుకు హిందూ వ్యతిరేక, దేశ వ్యతిరేక శక్తులు కుట్రలు పన్నుతున్నాయనడం విచిత్రంగా ఉంది. ఆలయ చందాలు, విరాళాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్‌పైనే ఉంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ప్రధాన మంత్రి మోదీ స్వయంగా ట్రస్టును ప్రకటించారు. అందులోని కీలక ప్రధాన కార్యదర్శి, సంఘ్ పరివారానికి సన్నిహితుడు, రామజన్మభూమి ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ కుమార్ మిశ్రాల పాత్రపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలోనే ఖాతాలను పర్యవేక్షించే మహిపాల్ సింగ్ అనే వ్యక్తి నగలు, విరాళాల చోరీ వ్యవహారాన్ని బైటపెడితే, అది పట్టించుకోకుండా ఆయనను ఉద్యోగం నుంచి తొలగించారు. ఎస్పి, ఆప్, కాంగ్రెస్ తదితర విపక్షాలన్నీ ముక్తకంఠంతో చందా చోరీ వ్యవహారాన్ని ఎత్తి చూపినా నెల రోజుల క్రితం వరకు బిజెపి డబుల్ ఇంజిన్ సర్కార్లు పట్టించుకోనట్లు వ్యవహరించాయి. ఇదంతా చూస్తే వ్యవహారం ముందే పొక్కినా చర్యలు తీసుకోకుండా తొక్కి పెట్టిన వారు కుట్ర దారులా? విషయంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన వారు కుట్రదారులా? తమ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు, బాధ్యతను ఎదుటివారిపై నెట్టివేసేందుకు సంఘ్ పరివార్‌కు అలవాటైన హిందూ వ్యతిరేకులు, దేశ వ్యతిరేకుల కుట్ర అనే వ్యాఖ్యలు ఈ వ్యవహారంలోనూ వినిపించడం ఆశ్యర్యమేమీ కాదు.
ఒకవేళ అదే నిజమైతే, రామజన్మభూమి ఉద్యమం, బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో చురుకుగా పాల్గొన్నారనే పేరున్న ఫైర్ బ్రాండ్ వినయ్ కటియార్ సైతం ట్రస్ట్ పాత్రపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. గతంలో అయోధ్య రామాలయ నగరం భాగమైన ఫైజాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎంపిగా గెలిచిన ఆయన రామాలయ విరాళాల దొంగతనం వ్యవహారంలో చంపత్‌రాయ్, అజయ్ మిశ్రాలు జైలుకు పోక తప్పదన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. దీనిని బట్టి ఈ వ్యవహారంలో సంఘ్ పరివారంలోని వారి పాత్రపట్ల స్వపక్షీయులే వేలెత్తి చూపుతున్నట్లు అర్థమవుతున్నది. అలాంటప్పుడు ఎవరు హిందూ వ్యతిరేకులు, దేశ వ్యతిరేకులు? మరి కటియార్ కూడా హిందూ ధర్మాన్ని బద్నాం చేస్తున్నారని భావించాలా? హిందుమతానికి తామే అసలు సిసలు పరిరక్షకులుగా ప్రతి దానికి ఉరికొచ్చే సంఘ్ పరివారం రామాలయంలో ఇంటి దొంగల చేతి వాటంపై ముందే ఎందుకు మేల్కొనలేదు. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందనేగా? ఎందుకంటే ట్రస్టులోని 14 మంది సభ్యుల్లో 9 మందికి ఆర్ఎస్ఎస్తో సన్నిహిత సంబంధాలున్నాయనేది బహిరంగ రహస్యమే.
అందరూ సంయమనం పాటించాలని సుద్దులు చెబుతున్న ఆర్ఎస్ఎస్… ఒకవేళ ప్రస్తుత ఘటనే బిజెపియేతర ప్రభుత్వ హయాంలో జరిగినట్లయితే సంయమనం పాటించేదా? ఈ వ్యవహారంపై శనివారం నాగ్‌పూర్‌లో ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ మోహన్ భాగవత్‌ను విలేకరులు స్పందించమని కోరగా, ‘రామ్.. రామ్..’ అని చేతులు జోడిస్తూ జవాబు దాటవేయటం కొసమెరుపు.