Skip to content
సంపాదకీయం వార్తలు

Editorial: ప్రహసనంగా బస్తీ మే సవాళ్లు

Prajapaksham 03 Jul 2026 0 నిమిషాల పఠనం సంపాదకీయం
Editorial: ప్రహసనంగా బస్తీ మే సవాళ్లు

brs vs congress

గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య సాగుతున్న పోటాపోటీ విమర్శలు పతాక స్థాయికి చేరుకున్నాయి. బహిరంగ చర్చలకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల బహిరంగ సవాళ్ల పరంపర గురువారం హైదరాబాద్ వీధుల్లో రచ్చకు దారి తీసింది. బీఆర్ఎస్ పాలనపై, కాంగ్రెస్ పాలనపై, అప్పులపై చర్చకు తాను సిద్ధమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు తెలంగాణ భవన్‌లో ఎదురు చూడగా, మరోవైపు గురుకులాలకు స్కూల్ యూనిఫామ్‌ల విషయంలో అవినీతిపై చర్చకు రావాలన్న మరో బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ సవాలును మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, మహ్మద్ అజారుద్దీన్‌లు స్వీకరిస్తూ గురువారం ఉదయమే గన్ పార్క్ వద్దకు చేరుకున్నారు. మంత్రులు అక్కడే కొద్ది సేపు ఎదురు చూసి గురుకుల యూనిఫామ్‌ల వ్యవహారంపై తమ వాదనను చెప్పుకొని వెళ్లిపోగా, వారు వెళ్లిపోయిన తరువాత తెలంగాణ భవన్ నుంచి బయలుదేరిన బీఆర్ఎస్ డిప్యూటీ లీడర్ తన్నీరు హరీశ్‌రావు, ప్రవీణ్‌కుమార్‌లను అక్కడే పోలీసులు అరెస్టు చేశారు. కేటీఆర్ సవాలును స్వీకరించిన మరో మంత్రి జూపల్లి కృష్ణారావు గన్ పార్క్‌కు చేరుకొని బీఆర్ఎస్ హయాంలో అప్పులపై వివరించి వెళ్లిపోయారు. ఉదయం నుంచి వ్యవహారాన్ని గమనించిన వారికి ఇదొక ప్రహసనాన్ని తలపించింది.

ఈ సవాళ్ల పర్వానికి ముందు దారి తీసిన పరిణామాలను పరికిస్తే, ఎన్నికల హామీలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు, అసెంబ్లీ డిప్యూటీ లీడర్ తన్నీరు హరీశ్‌రావులు ఇటీవల జిల్లాల్లో తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల డోసు పెంచారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వంతో రాష్ట్రం రూ.8.11 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, అయినప్పటికీ సాధ్యమైనంత మేరకు హామీలను అమలు చేస్తూనే ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు, కాంగ్రెస్ నేతలు చెబుతూనే ఉన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై, రెండేళ్ల తమ ప్రభుత్వ పాలనపై చర్చకు సిద్ధమేనని, అందుకు సిద్ధమైతే స్పీకర్‌కు ప్రతిపక్ష నాయకుడు కె. చంద్రశేఖర్‌రావు లేఖ రాసి అసెంబ్లీకి రావాలని నల్లగొండ, హైదరాబాద్ సభలలో సీఎం రేవంత్ రెడ్డి సవాలు విసిరారు. దీనికి ప్రతిగా బీఆర్ఎస్ నేతల సవాళ్లు, దానికి మంత్రుల స్పందనలతో గురువారం నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.

స్థూలంగా అప్పులు, ఎన్నికల హామీల అమలు అంశాల చుట్టూనే ఈ సవాళ్ల రాజకీయాలు తిరుగుతున్నాయి. తాము ప్రభుత్వం ఏర్పాటు చేసిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. వాటిల్లో ముఖ్యమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచితంగా గృహ విద్యుత్, రూ.2 లక్షల వరకు వ్యవసాయ రుణాల మాఫీ, రైతు భరోసా రూ.12 వేలకు పెంపు, ఉచితంగా సన్న బియ్యం, సన్న ఒడ్లకు బోనస్ వంటివి అమలు చేసింది. అయితే రైతు భరోసా అందించడంలో నిధుల కొరతతో కొంత ఆలస్యం, ఒక విడత వేయకపోవడం, ధాన్యం కొనుగోలులో కొంత ఆలస్యం వంటివి చోటు చేసుకున్నాయి. వీటితో పాటు, మిగతా హామీల అమలు విషయంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు బీఆర్ఎస్ శతథా ప్రయత్నిస్తోంది. వాటి ఆలస్యానికి గత ప్రభుత్వ అప్పుల భారమే కారణమని ముఖ్యమంత్రి, మంత్రులు ప్రతి విమర్శలు చేస్తున్నారు.

అప్పుల విషయానికి వస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ప్రత్యక్ష బహిరంగ అప్పులు రూ.3.50 లక్షల కోట్లు అని కేంద్ర ఆర్థిక మంత్రి పంకజ్ చౌధురి పార్లమెంటులో ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానాన్ని బీఆర్ఎస్ ఆయుధంగా ప్రయోగిస్తోన్నది. కాంగ్రెస్ మాత్రం రూ.8.11 లక్షల కోట్లు అని చెబుతోన్నది. రెండు వాదనలు నిజమే. ఎందుకంటే, ప్రభుత్వం తీసుకునే అప్పులు రెండు రకాలు. ఒకటి, బడ్జెట్‌లో చూపించే ప్రభుత్వం తీసుకునే ప్రత్యక్ష అప్పులు, రెండవది, బడ్జెట్‌లో కలపని ప్రభుత్వ గ్యారెంటీతో కార్పొరేషన్‌లు, స్పెషల్ పర్పస్ వెహికల్స్ తీసుకునే రుణాలు. కేంద్ర మంత్రి చెప్పినది కేవలం బడ్జెట్‌లో చూపిన ప్రత్యక్ష రుణాలు మాత్రమే. అంత మాత్రాన కాళేశ్వరం ప్రాజెక్టు, గొర్ల పంపిణీ తదితరాల కోసం కార్పొరేషన్‌ల ద్వారా తీసుకున్న బడ్జెటేతర అప్పులు ప్రభుత్వానివి కాకుండా పోవు! వాటిని కార్పొరేషన్‌లు చెల్లించకపోతే ప్రభుత్వమే చెల్లించాలి. కార్పొరేషన్‌లంటే గాలి నుంచి ఊడిపడినవి కాదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాలక మండళ్లతో నడిచేవే. కాబట్టి బీఆర్ఎస్ ఒక్క కన్ను మూసి చూపినట్లుగా, కేవలం ప్రత్యక్ష అప్పులనే ప్రస్తావిస్తూ, కుయుక్తితో బడ్జెటేతర అప్పులను చెప్పకుండా ప్రజలను గందరగోళంలోకి నెడుతున్నది.

మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొత్తలోనే 2023 డిసెంబర్ 20 తేదీన ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి’పై శాసనసభలో శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. అందులో 2023 నాటికి రాష్ట్ర ప్రత్యక్ష రుణం రూ.3.89 లక్షల కోట్లుగా చూపించారు. దానికి అదనంగా బడ్జెటేతర రుణాలను కలుపుకొని అప్పు రూ.6.71 లక్షల కోట్లుగా శ్వేతపత్రం ప్రకటించింది. అవీ కాకుండా ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, సప్లయర్లకు మరో రూ.40,154 కోట్లు బకాయిలు ఉన్నాయని పేర్కొంది. ఇంకా సింగరేణి, విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సినవి కలుపుకొని మొత్తంగా రూ.8 లక్షల కోట్లకు పైగా ప్రత్యక్ష, పరోక్ష రుణాలు, బకాయిల భారం తమపై పడిందని రేవంత్ సర్కార్ చెబుతున్న మాటలో వాస్తవముంది.

అయితే, ఎన్నికల హామీల అమలు, సింగరేణి కాలరీస్, గురుకులాలు, హ్యామ్ రోడ్లు తదితర అంశాలపై బీఆర్ఎస్ నేతలు విమర్శల దాడిని పెంచి ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్నారు. వాటిని అంకెలతో సహా వివరించి, పత్రికా సమావేశాలు, సామాజిక మాధ్యమాల ద్వారా జనసమూహంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. అలా కాకుండా బస్తీ మే సవాల్ అంటూ బీఆర్ఎస్ విసిరుతున్న సవాళ్ల ఉచ్చుకు స్పందిస్తూ మంత్రులు రోడ్లపైకి రావటం తప్పుడు సంకేతాలకు దారి తీస్తుంది. ప్రభుత్వాన్ని కవ్వించటం ప్రతిపక్ష విధి, అదే సమయంలో వాటికి సరైన వేదికల్లో సమాధానం చెప్పడం ప్రభుత్వ బాధ్యత. ఉభయుల మధ్య ప్రత్యక్ష చర్చకు శాసనసభకు మించిన వేదిక ప్రజాస్వామ్యంలో మరొకటి లేదు. ఏటా కనీసం 50 రోజుల పాటు శాసనసభ సమావేశాలను నిర్వహించి, చర్చలకు అవకాశం కల్పించి, వాటికి సమర్థవంతమైన జవాబివ్వడమే ప్రభుత్వ జవాబుదారీతనానికి గీటురాయి. అంతే తప్ప సవాళ్లతో కాదు. అసెంబ్లీలో చర్చిద్దామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి చేసిన సముచిత ప్రతిపాదనను ప్రతిపక్ష నేత అంగీకరించడం సబబు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *