Skip to content
సంపాదకీయం వార్తలు

పశ్చిమ బెంగాల్‌లో అధికారి దూకుడు

Prajapaksham 01 Jul 2026 0 నిమిషాల పఠనం సంపాదకీయం
పశ్చిమ బెంగాల్‌లో అధికారి దూకుడు

Suvendu Adhikari'

పశ్చిమ బెంగాల్ ప్రగతిశీల రాష్ట్రం. బెంగాల్ ఇవాళ ఏమి ఆలోచిస్తుందో రేపు దేశం అదే ఆలోచిస్తుంది అనే నానుడి బెంగాలీల మేథాశక్తికి ప్రశంస. సంఘ సంస్కర్తలు ఈశ్వర చంద్ర విద్యాసాగర్, రాజా రామ్మోహన్రాయ్, ఆధ్యాత్మిక వేత్త రామకృష్ణ పరమహంస, వందేమాతరం గేయ రచయిత బంకించంద్ర చటర్జీ, జాతీయ గీత రచయిత, నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్లకు పుట్టినిల్లు. మరోవైపున బ్రిటీష్ వలస పాలనకు వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లకు పుట్టినిల్లు. ప్రసిద్ధ సమరశీల స్వాతంత్య్ర సమరయోధుడు, విదేశంలో ఇండియన్ నేషనల్ ఆర్మీ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కార్యస్థానం బెంగాల్. జాతీయ మనోభావాలకు తోడు కమ్యూనిస్టు సోషలిస్టు భావజాలానికి బలమైన పునాదులున్న రాష్ట్రం. అటువంటి రాష్ట్రం ఇవాళ విచారకరంగా మితవాద మతవాదుల పరిపాలనలోకి వెళ్లింది. కోతికి కొబ్బరికాయ దొరికినట్లు చేతికందిన అధికారాన్ని నిరంకుశ పాలనకు, ఆర్ఎస్ఎస్ హిందూత్వ ఎజండాకు ఉపయోగిస్తున్నాడీ బిజెపి ముఖ్యమంత్రి సువేందు అధికారి.
తృణమూల్ కాంగ్రెస్ 15 సంవత్సరాల అరాచక పాలనలో మృగ్యమైన శాంతి పునరుద్ధరిస్తే, పరిరక్షిస్తే ప్రజల సంతోషిస్తారు. ప్రస్తుతం సర్కారీ గూండాలు రివర్స్ దాడులు సాగిస్తున్నారు. జిల్లాల్లో టిఎంసి నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు కనిపిస్తే బిజెపి కార్యకర్తలు కోడిగ్రుడ్లతో దాడిచేస్తున్నారు. రెండోవైపున, రకరకాల కేసులతో పోలీసుల వేధింపులు, అరెస్టులు సాగుతున్నాయి. ఈ అరాచకాన్ని కాంగ్రెస్, కమ్యూనిస్టులు నిరసిస్తున్నారు. టిఎంసి, అత్యధిక మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపిల తిరుగుబాటుతో, కిందిస్థాయిలో నాయకుల రాజీనామాలు, బ్యాంక్ అక్కౌంట్ల స్తంభన వంటి అనూహ్యమైన ప్రతికూలతలతో గందరగోళంలో ఉంది. ప్రతిపక్షాలు (లెఫ్ట్ ఫ్రంట్, కాంగ్రెస్, టిఎంసి) ఎవరిదారిలో వారు ప్రయాణిస్తున్నప్పటికీ, వెనకా ముందుగా ప్రభుత్వ వ్యతిరే క ఆందోళనలు బయలుదేరక తప్పదు. అటువంటి పరిస్థితిని ఊహించికావచ్చు, బిజెపి ప్రభుత్వం ముందు జాగ్రత్తగా సరికొత్త నిరంకుశ చట్టాలు తెస్తున్నది. “పశ్చిమ బెంగాల్ ప్రజల భద్రత, సాంఘిక వ్యతిరేక కార్యకలాపాల వ్యతిరేక బిల్లు,2026”ను అధికారి ప్రభుత్వం సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టింది. సాంఘిక వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు భావించిన వ్యక్తులను అరెస్టు చేసి, కోర్టుముందు హాజరు పరచకుండా 12 నెలలపాటు బెయిలు లేకుండా జైల్లో ఉంచే అధికారాన్ని ఈ బిల్లు పోలీసులకు ఇస్తున్నది. “గూండా” అని ముద్రవేసి ఎవరినైనా నిర్బంధంలో ఉంచే ఈ నిరంకుశ బిల్లు సాధారణ న్యాయసూత్రాలకు, జీవించే హక్కుకు విఘాతం. ‘గూండాలను’ సంవత్సరంపాటు వారి ప్రాంతం, జిల్లానుంచి బహిష్కరించే అధికారాన్ని కూడా ప్రభుత్వం చేజిక్కించుకుంది. రాజకీయ వైషమ్యాలు తీవ్రస్థాయిలో ఉన్న రాష్ట్రంలో ఈ చట్టం ఎవరికి వ్యతిరేకంగా ఉద్దేశించిందో ఇట్టే ఊహించుకోవచ్చు. రాజకీయ కార్యకర్తలను సైతం ‘గూండాల’ పరిధిలోకి తెచ్చి కక్ష సాధింపు చర్యలకు దుర్వినియోగపరిచే అవకాశం మెండుగా ఉంటుంది. అనుకూలంగా 176, వ్యతిరేకంగా 41 ఓట్లతో బిల్లు శాసనసభ ఆమోదం పొందింది. తృణమూల్కు చెందిన 20మంది ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొనలేదు. కలహాలు, చట్టవిరుద్ధ సమావేశాలు, హింసాయుత నిరసనల సమయంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు కలిగే నష్టాలకు వ్యక్తులను ఆర్థికంగా బాధ్యులను చేసే ‘పశ్చిమ బెంగాల్ ప్రజాభద్రత పరిరక్షణ(సవరణ) బిల్లు, 2026ను కూడా శాసనసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.
బిజెపి ఆర్ఎస్ఎస్ ఎజండా ప్రకారం, రాష్ట్రంలోని ప్రజలందరికీ ఏకరీతి పౌర స్మృతి(యుసిసి)ని అమలు చేసే బిల్లును ఆగస్టులో ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి అధికారి ప్రకటించారు. పౌరులందరికీ ఉమ్మడి పౌరస్మృతి అమలు కోసం కృషి చేయాలని రాజ్యాంగ ఆదేశిక సూత్రాల్లో ఉందంటూ, భిన్నమతాల ముఖ్యంగా ముస్లిం మైనారిటీల వ్యక్తిగత చట్టాలను రద్దు చేసి వివాహం, విడాకులు, వారసత్వ ఆస్తి వగైరా విషయాల్లో ఏకీకృత చట్టం బిజెపి ఎజండాలోని ప్రధానాంశాల్లో ఒకటి. అయితే కేంద్ర ప్రభుత్వం నేరుగా చట్టం చేయకుండా బిజెపి పాలిత రాష్ట్రాల ద్వారా శాసనాలు తెచ్చి క్షేత్రస్థాయి పరిస్థితిని పరీక్షిస్తున్నది. ఉత్తరాఖండ్, గుజరాత్, అసోం తర్వాత పశ్చిమ బెంగాల్ యుసిసి శాసనం తెస్తున్నది. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి రంజన్ ప్రకాశ్ దేశాయ్ నేతృత్వంలో ఒక కమిటీ వేస్తున్నామని, అది అన్ని మతాల వ్యక్తిగత చట్టాలను సమీక్షించి నెలరోజుల్లో సిఫారసులు చేస్తుందని, రాష్ట్రంలో 6మాసాల్లో యుసిసి అమలు చేస్తామని ఎన్నికల ప్రణాళికలో చేసిన వాగ్దానాన్ని అమలు జరుపుతామని ముఖ్యమంత్రి చెప్పారు. అయితే మిగతా రాష్ట్రాల్లో వలె గిరిజనులను లేదా ఆదివాసీలను ఈ చట్టం పరిధినుంచి మినహాయిస్తున్నారు. ఈ చట్ట ం వల్ల హిందువులకు జరిగే మేలేమీ లేకపోగా ముస్లింలు, క్రైస్తవులు ఇబ్బందులపాలవుతారు. గత జనాభా లెక్కల ప్రకారం బెంగాల్లో ముస్లింలు 27 శాతం.
ఇదిలావుండగా, కోల్కతా నగర చరిత్రను విస్మరించి వీధుల పేర్లనుంచి పఠాన్ లేదా మొగలాయీ పేర లేకుండా చేయటానికి ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారు. తిరోగమనం, అణచివేత తమ కార్యక్రమంగా ముందుకుసాగుతున్న బిజెపి ప్రభుత్వానికి ప్రగతిశీల బెంగాలీ సమాజం నుంచి ప్రతిఘటన తప్పదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *