Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

కూటమి పాలనకు ఇంటర్వెల్ పడింది…ఇక క్లైమాక్స్ ఎటువైపు..?

Prajapaksham 03 Jul 2026 0 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
కూటమి పాలనకు ఇంటర్వెల్ పడింది…ఇక క్లైమాక్స్ ఎటువైపు..?

ai generated image

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనకు రెండేళ్లు పూర్తయ్యాయి. సినిమా భాషలో చెప్పాలంటే ఇంటర్వెల్ పడింది. ఇక ఇక్కడ నుంచి కథ, కథనం పుంజుకోకపోతే క్లైమాక్స్ లో దెబ్బ తినడం ఖాయమని రాజకీయ పండితులు చెబుతున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ముందు ఉన్న అతిపెద్ద సవాలు సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను అమలు చేయడమే, . ఎందుకంటే ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపైనే ప్రజల్లో, అటు క్షేత్రస్థాయిలో విస్తృతంగా చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఉచిత పథకాలతో పాటు అమరావతి నిర్మాణము పోలవరం ప్రాజెక్టు పనులు వంటి విషయాల పైన ప్రభుత్వం పెట్టుకున్న డెడ్ లైన్ ప్రకారం ఇవన్నీ పూర్తవుతాయా లేదా అనేది చంద్రబాబు నాయుడు సర్కార్ ముందు ఉన్న అతిపెద్ద సవాలు అని చెప్పవచ్చు. అమరావతి రాజధాని పనులు ఇంకా నత్తనడకనే సాగుతున్నాయి. ఇక పోలవరం రెండు అడుగులు ముందుకు వేస్తే నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతోంది.

అమరావతిలో ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలలో ఈ సంవత్సరం జూన్ నాటికి 53% పనులు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్న కేవలం 32 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. అమరావతి నిర్మాణం కోసం ఎంపిక చేసుకున్న ఎనిమిది మంది బడా కాంట్రాక్టర్లలో కేవలం ఇద్దరు మాత్రమే తమ లక్ష్యాలకు అనుగుణంగా పనులను పూర్తి చేస్తున్నారు. ఇక 2028 చివరి నాటికి అమరావతి తొలిదశ రాజధాని అందుబాటులో తేవాలని చంద్రబాబు నాయుడు టార్గెట్ పెట్టుకున్న క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడా కూడా ఆ పరిస్థితులు కనిపించడం లేదు దీంతో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. ఇక సంక్షేమ పథకాల విషయానికి వస్తే కూటమి ప్రభుత్వానికి అంతో ఇంతో కాస్త పేరు తెస్తున్నది పింఛన్ల పంపిణీ అని చెప్పవచ్చు ఎందుకంటే నెలకు 4000 రూపాయల వృద్ధాప్య పింఛను తో పాటు 6000 రూపాయలు దివ్యాంగులకు పెన్షన్ లభిస్తుంది. దీనివల్ల రాష్ట్ర ఖజానా పైన సుమారు 27 వేల కోట్ల రూపాయల ఆర్థిక భారం పడుతున్న ప్రతినెలా మాత్రం కచ్చితంగా పెన్షన్లు లబ్ధిదారులకు లభిస్తున్నాయి.

అయితే పింఛన్ల స్కీములో అవకతవకలను గుర్తించి అనర్హులను కార్యక్రమం చేపట్టగా సుమారు తొమ్మిది శాతం వరకు అనర్హులు ఉన్నట్లు గుర్తించారు. వీరందరికీ పింఛన్లు నిలిపివేయడం కాస్త సానుకూల అంశంగా చెప్పవచ్చు. ముఖ్యంగా 0.6 శాతం మంది చనిపోయిన వారి పేరున సైతం పింఛన్లు లభిస్తున్నాయి. ఇలాంటి వాటిని అరికట్టడం అనేది అత్యవసరం అని చెప్పవచ్చు.

ఇక గృహ నిర్మాణం విషయానికొస్తే ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న 18.5 లక్షల ఇళ్లలో ఇప్పటివరకు 3.2 లక్షల ఇల్లు మాత్రమే పూర్తయ్యాయి. దీపం పథకం విషయానికి వస్తే ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్ ల సబ్సిడీ ఇంకా అకౌంట్లలో పడలేదు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తల్లికి వందనం పథకం ఇంకా పాక్షికంగా అమలవుతోంది. ఇప్పటివరకు 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 15 వేల రూపాయల చొప్పున జమ చేశారు. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు అవుతుండగా, యువతకు 3వేల రూపాయల నిరుద్యోగ భృతి మాత్రం కాగితాల కే పరిమితం అయింది. దీంతోపాటు అన్నదాత సుఖీభవ పేరిట 20వేల రూపాయలు ప్రతి ఒక్క రైతుకు లభించడం కాస్త సానుకూల అంశంగా చెప్పవచ్చు.

అయితే కూటమి ప్రభుత్వం సైతం అటు డబల్ ఇంజన్ సర్కార్ గా చెప్పుకుంటున్నప్పటికీ, గత ప్రభుత్వం పైనే తప్పుల భారం అప్పుల భారం వేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. నిధుల కొరత వల్లే తాము అనుకున్న లక్ష్యాలను నెరవేర్చలేకపోతున్నామని కూటమి నేతలు చెబుతున్నారు. అటు ప్రతిపక్ష వైసిపి పార్టీ సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అని ఆరోపణలు చేస్తోంది. నాలుగు దశాబ్దాల అనుభవంతో చంద్రబాబు నాయుడు ఎన్ని హామీలు విజన్ డాక్యుమెంట్లు ప్రజల ముందు పెట్టిన, క్షేత్రస్థాయిలో ప్రజలకు అవి లభించనంత వరకు అసంతృప్తి అనేది పెరుగుతూనే ఉంటుంది. ప్రజల సహనానికి కూడా ఒక డెడ్ లైన్ ఉంటుందని ప్రభుత్వం గుర్తిస్తే మంచిదని విశ్లేషకులు చెబుతున్నారు.

ట్యాగ్‌లు: andhra pradesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *