తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక.. నేటి నుంచి 7 రోజుల పాటు వానలే వానలు..
Rains - భారీ వర్షాలు
నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే వారం రోజుల పాటు వాతావరణం పూర్తిగా మారిపోనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జులై 3 నుండి జులై 9 వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఈ మేరకు హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు ఉమ్మడిగా వాతావరణ బులెటిన్‌ను విడుదల చేశాయి. రాబోయే ఏడు రోజుల పాటు రెండు రాష్ట్రాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేశాయి.
తెలంగాణ వ్యాప్తంగా జులై 9 వరకు విడతల వారీగా వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా రాష్ట్రంలోని ఉత్తర జిల్లాలపై వీటి ప్రభావం ఎక్కువగా ఉండనుంది. జులై 3, 4 తేదీల్లో ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆ తర్వాత జులై 4, 5 తేదీల్లో ఉత్తర జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇక జులై 5 నుండి 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు నిరంతరాయంగా కురుస్తూనే ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఏపీలోని ఉత్తర కోస్తా, యానాం, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో రాబోయే ఏడు రోజుల పాటు వాతావరణంలో తీవ్ర మార్పులు ఉండనున్నాయి. కోస్తాంధ్రాలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వర్షంతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. అయితే, రాబోయే ఐదు రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలలో ఎలాంటి పెద్ద మార్పులు ఉండబోవని స్పష్టం చేశారు.
తీవ్రమైన ఉరుములు, మెరుపులు, ఈదురు గాలుల కారణంగా చేతికి వచ్చే దశలో ఉన్న పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. బలహీనంగా ఉన్న తాత్కాలిక నిర్మాణాలు, హోర్డింగులు కూలిపోయే అవకాశం ఉన్నందున ప్రయాణికులు, బహిరంగ ప్రదేశాల్లో ఉండేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా రైతులు పొలం పనుల సమయంలో చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని వాతావరణ శాఖ అధికారులు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.