Skip to content
జాతీయం వార్తలు

తమిళనాడు సీఎం విజయ్, నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే రాధాకృష్ణన్ అరెస్ట్

Prajapaksham 03 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
తమిళనాడు సీఎం విజయ్, నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. డీఎంకే ఎమ్మెల్యే రాధాకృష్ణన్ అరెస్ట్

డీఎంకే ఎమ్మెల్యే రాధాకృష్ణన్ అరెస్ట్

తమిళనాడు ముఖ్యమంత్రి, టీవీకే (TVK) అధినేత సి.జోసెఫ్ విజయ్, ప్రముఖ సినీ నటి త్రిషలపై ఒక బహిరంగ సభలో తీవ్ర అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మాజీ మంత్రి, డీఎంకే (DMK) ఎమ్మెల్యే అనితా ఆర్. రాధాకృష్ణన్‌ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. స్థానిక టీవీకే కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పరువు నష్టం కలిగించడం, సమాజంలో ఘర్షణలను ప్రేరేపించడం వంటి తీవ్ర ఆరోపణలపై పోలీసులు ఆయనపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం రాధాకృష్ణన్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించిన కొద్దిసేపటికే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

గత జూన్ 20న తిరుచెందూర్ సమీపంలోని ఆత్తూర్‌లో మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి జయంతి ఉత్సవాల సందర్భంగా జరిగిన ఒక బహిరంగ సభలో రాధాకృష్ణన్ ప్రసంగిస్తూ.. ముఖ్యమంత్రి విజయ్‌ను ఉద్దేశించి వ్యక్తిగత దూషణలకు దిగారు. విజయ్ రూపాన్ని, అలాగే ఆయన సినీ పరిశ్రమ నుండి రాజకీయాల్లోకి రావడాన్ని ఎగతాళి చేస్తూ మాట్లాడారు. ఆ తర్వాత అసెంబ్లీలో శాంతిభద్రతలపై జరిగిన చర్చా సందర్భాన్ని ప్రస్తావిస్తూ.. ఇంట్లో నటితో సంతోషంగా ఉండే విజయ్, ఇప్పుడు అసెంబ్లీ అనే ఊబిలో చిక్కుకుపోయి నలువైపులా ఇరుక్కుపోయాననే మానసిక ఆందోళనలో ఉన్నారు. సినిమా షూటింగ్‌లు వేరు, రాష్ట్ర పాలన వేరు” అంటూ నటి త్రిషను, సీఎం విజయ్‌ను ముడిపెడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

తాను ఒక వ్యాపారినని, దుకాణంలోకి వచ్చే వ్యక్తి ముఖం చూసి అతను కొనడానికి వచ్చాడా లేక అప్పు అడగడానికి వచ్చాడా అనేది చెప్పగలనని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. అదే విధంగా అసెంబ్లీలో సీఎం విజయ్ ముఖంలో కనిపిస్తున్న గందరగోళాన్ని చూస్తే.. ‘అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చాను, తనకు ఎవరైనా సహాయం చేస్తే బాగుండు’ అన్నట్లుగా ఆయన ప్రవర్తన ఉందని వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో, సినీ పరిశ్రమలో తీవ్ర దుమారం రేపాయి.

తమ పార్టీ ఎమ్మెల్యే అరెస్ట్‌ కావడంపై ప్రతిపక్ష డీఎంకే పార్టీ తీవ్రంగా మండిపడింది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రతిపక్షాలపై అణచివేత వ్యూహాలను అవలంబిస్తోందని డీఎంకే ఎంపీ కనిమొళి ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వ చర్యలను నిరంకుశత్వంగా అభివర్ణిస్తూ ఆమె ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. డీఎంకే పార్టీ ఇలాంటి బెదిరింపులకు, అణచివేత చర్యలకు ఎప్పటికీ తలొగ్గబోదని ఆమె స్పష్టం చేశారు. ఈ అరెస్టుతో తమిళనాడులో టీవీకే, డీఎంకే శ్రేణుల మధ్య రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.