ప్రపంచ నాయకత్వ బాటలో చైనా కమ్యూనిస్టు పార్టీ
ai generated image
–పల్లవ్ సేన్ గుప్త
కార్మిక చోదక శక్తిగా, అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమ ధ్వజంగా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనా (సిపిసి) 105వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. అంకిత భావం కలిగిన, బహుకొద్ది మంది మార్క్సిస్టు విప్లవకారులు 1921 జులైలో సిపిసి స్థాపించారు. అది అర్ధఫ్యూడల్, అర్థవలస దేశాన్ని ప్రపంచస్థాయి సోషలిస్టు శక్తిగా పరివర్తన గావించింది. ఒక విప్లవ పార్టీ మార్క్సిస్టు లెనినిస్టు సూత్రాలను నిర్దిష్టమైన దేశీయ పరిస్థితులకు ఎలా క్రియాశీలంగా అనువర్తింపజేయగలదో, ఒక స్థితిస్థాపక సోషలిస్టు రాజ్యాన్ని నిర్మించటానికి తీవ్రమైన అంతర్గత, బాహ్య వైరుధ్యాలను అధిగమిస్తూ ఎలా ముందుకు సాగగలదో ఈ ప్రయాణం నిరూపించింది.
నూతన ప్రజాస్వామిక విప్లవం
1921లో సిపిసి ఆవిర్భావం ప్రపంచ చరిత్ర గమనాన్ని మార్చివేసింది. 1917 అక్టోబర్ విప్లవ గర్జన మార్గదర్శకత్వంలో సిపిసి వ్యవస్థాపకులైన చెన్ డుక్సియు, లీ దఝావో తదితరులు చైనా శ్రమజీవులను విదేశీ సామ్రాజ్యవాదం నుంచీ, దేశీయ ఫ్యూడలిజం నుంచి విముక్తి చేసేందుకు పార్టీని ఏర్పాటు చేశారు. పార్టీ ఆరంభ సంవత్సరాల్లో ముమ్మరంగా వర్గపోరాటం జరిగింది. విప్లవ ప్రతీఘాత కొమింటాంగ్ (కెఎంటి) పాశవికంగా అణచివేతకు పాల్పడింది. పట్టణ తిరుగుబాటు అనే ప్రామాణిక నమూనా చైనాలో విజయవంతం కాదని మావో జెడాంగ్ వ్యూహాత్మక నాయకత్వం కింద సిపిసి గుర్తించింది. పార్టీ ‘నూతన ప్రజాస్వామిక విప్లవ’ సిద్ధాంతం రూపొందించుకుని తన ప్రధాన దృష్టిని గ్రామసీమల వైపు మరల్చింది.
విస్తారంగా రైతాంగం సమీకరణ, కార్మిక కర్షక రెడ్ ఆర్మీ ఏర్పాటు, చరిత్ర ప్రసిద్ధమైన లాంగ్‌మార్చ్ (సుదీర్ఘ విముక్తి యాత్ర) చేపట్టడం ద్వారా సిపిసి అభేద్యమైన విప్లవ స్థావర ప్రదేశాలు నిర్మించింది. జపాన్ దురాక్రమణకు వ్యతిరేకంగా ప్రతిఘటన యుద్ధం కాలంలో చైనీయుల దేశానికి నిజమైన రక్షకునిగా సిపిసి నిలబడింది. ఆ తర్వాత అమెరికా మద్దతుగల కెఎంటికి వ్యతిరేకంగా అంతర్యుద్ధం దరిమిలా సిపిసి ప్రజాబాహుళ్యాన్ని సంపూర్ణ విజయంలోకి నడిపించింది. శతాబ్దకాల జాతీయ అవమానం, అణచివేతకు అంతం పలుకుతూ 1949 అక్టోబర్ 1న చైర్మన్ మావో చైనా ప్రజారిపబ్లిక్ (పిఆర్‌సి) వ్యవస్థాపకతను ప్రకటించారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంలో కార్మిక వర్గ నియంతృత్వాన్ని నెలకొల్పుతున్నట్లు ప్రకటించారు.
అతివాద పెడధోరణులు, సాంస్కృతిక విప్లవం, కమ్యూనిస్టు ఉద్యమంలో చీలిక
చైనా విముక్తి దరిమిలా, యుద్ధ శిథిలాలనుంచి సోషలిజం నిర్మించే బృహత్తర కర్తవ్యాన్ని సిపిసి చేపట్టింది. తొలి పంచవర్ష ప్రణాళికను విజయవంతంగా అమలు జరిపిన పార్టీ వ్యవసాయాన్ని సమష్టీకరించింది, పరిశ్రమను సమాజపరం చేసింది, భారీ పరిశ్రమలకు పునాదులు వేసింది. అయితే సోషలిస్టు నిర్మాణ పథం రహదారి కాదు, సైద్ధాంతిక అవరోధాలతో కూడుకున్నది. सोషలిస్టు పరివర్తనను వేగవంతమొనర్చే ఆతృతలో, ఊహించుకున్న బ్యూరోక్రటిక్ వక్రీకరణలను తిప్పికొట్టే పనిలో పార్టీ నాయకత్వం అతివాద పెడధోరణుల్లో పడింది. ఈ కాలంలోనే ‘ముందుకు మహా గెంతు’ అమలు చేశారు; అంతిమంగా ‘మహా కార్మికవర్గ సాంస్కృతిక విప్లవం’ (1966-1976) అమలు జరిపారు.
పెట్టుబడిదారీ పునరుద్ధరణను నిరోధించటం, విప్లవోత్తేజాన్ని నిలబెట్టటం అనే సైద్ధాంతిక తలంపుతో ప్రారంభించిన సాంస్కృతిక విప్లవం కాలంలో అనేక తప్పు నిర్ణయాలు చోటుచేసుకున్నాయి. అది దేశంలో తీవ్రమైన అస్థిరతకు, సంస్థల పక్షవాతానికి, సోషలిస్టు న్యాయవ్యవస్థ తాత్కాలికంగా బలహీనపడటానికీ దారితీసింది. ఈ “అతివాద” సైద్ధాంతిక వైఖరుల ప్రభావం ఒక్క చైనాకే పరిమితం కాలేదు. అంతర్జాతీయంగా అవి కమ్యూనిస్టు ఉద్యమంలోపల పిడివాద ధోరణులను ప్రోత్సహించాయి. అనేక కమ్యూనిస్టు, వర్కర్స్ పార్టీల్లో చీలికలు, భేదాభిప్రాయాలను లేవనెత్తాయి.
“మావో సే ఆలోచన పతాకాన్ని సమున్నతంగా నిలుపుదాం” అనే నినాదం కింద అనేక గ్రూపులు కార్మికవర్గ అంతర్జాతీయత, ప్రజాస్వామ్యయుతమైన కేంద్రీకృత విధానం, ప్రపంచ కమ్యూనిస్టు ఐక్యత సూత్రాలను తిరస్కరించాయి; సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఇతోధిక ఐక్యత అవసరమైన సమయంలో కమ్యూనిస్టు ఉద్యమం చీలికలు పీలికలు కావటానికి దోహదపడ్డారు.
ఈ కల్లోల దశాబ్దం గాఢమైన చారిత్రక పాఠంగా పనిచేసింది. స్వీయాత్మక విప్లవోత్సాహం అనేది ఎల్లప్పుడూ వాస్తవిక ఆర్థిక పరిస్థితుల్లో, సమష్టి నాయకత్వంలో, ప్రజాస్వామ్యయుతమైన కేంద్రీకృత విధానంలో, నిర్దిష్టమైన పరిస్థితుల గూర్చి నిర్దిష్టమైన విశ్లేషణలో పాదుకుని ఉండాలని నిరూపించింది. ఉత్తరోత్తర సిపిసి చేపట్టిన దిద్దుబాటు జాతీయ పరిస్థితులకు మార్క్సిజాన్ని సృజనాత్మకంగా అనువర్తింపజేయటం ద్వారానే సోషలిజం పురోగమిస్తుందని, మితవాద అవకాశవాదం, ‘అతివాద’ దుందుడుకుతనం రెండింటికీ లోనుకాకూడదని పునరుద్ఘాటించింది.
చరిత్రాత్మక దిద్దుబాటు, 105 సంవత్సరాల స్థితిస్థాపకత
11వ సెంట్రల్ కమిటీ ఆరవ ప్లీనరీ
ఆధునిక సిపిసి కోసం మలుపు 1981 జూన్‌లో 11వ కేంద్ర కమిటీ ఆరవ ప్లీనరీ సమావేశంలో అరుదెంచింది. ఆ సమావేశం ఒక బృహత్తరమైన తీర్మానం ఆమోదించింది. అది ‘చైనా ప్రజారిపబ్లిక్ వ్యవస్థాపన నాటి నుంచీ మన పార్టీ చరిత్రలో కొన్ని ప్రశ్నలపై తీర్మానం’. ఈ పత్రం తప్పనిసరైన, హేతుబద్ధతతో కూడిన, శాస్త్రీయ మార్క్సిస్టు లెనినిస్టు సైద్ధాంతిక అవగాహనను పార్టీకి తిరిగి తీసుకువచ్చింది.
మూడు ఆవశ్యకమైన చారిత్రక కర్తవ్యాలను ఆ తీర్మానం సాధించింది:
మావో జెడాంగ్ గూర్చి అంచనా: అది చైర్మన్ మావోను చారిత్రక భౌతికవాదంతో అంచనా వేసింది. గొప్ప కార్మికవర్గ విప్లవకారునిగా ఆయనలోని అజరామరమైన గొప్పదనాలను సమర్థించింది. ఉత్తరోత్తర సంవత్సరాల్లో ఆయన చేసిన తప్పులను వాస్తవిక దృష్టి నుంచి గుర్తించింది. మావో జెడాంగ్ ఆలోచనను పార్టీకి మార్గదర్శకమైన సైద్ధాంతిక నిక్షేపంగా దృఢంగా అట్టిపెట్టుకుంది.
సాంస్కృతిక విప్లవంపై తీర్పు: అది సాంస్కృతిక విప్లవాన్ని శాస్త్రీయంగా అంచనా వేసింది. దాని పద్ధతులను ఖండించింది. వాస్తవికత నుంచి పార్టీని వేరుపరిచిన “అతివాద” పెడధోరణిని సరిదిద్దింది.
పిఆర్‌సి సాఫల్యాల ధృవీకరణ: 1949 నాటినుంచి సోషలిస్టు వ్యవస్థ సాధించిన విజయాలను అది సమర్థించింది. కార్మిక రాజ్యం మూల బలాన్ని చెల్లుబాటు చేసింది.
ఈ గతితార్కిక మేళవింపు పార్టీని ఐక్యం చేసింది, విప్లవాన్ని రద్దు చేయకుండా గత తప్పిదాలను సరిదిద్దుకుంది. పిడివాదం, మితవాద చారిత్రక నిహిలిజం (అన్నిటినీ తిరస్కరించటం శతాబ్దిలో రష్యా దేశంలో వ్యాపించిన గాఢ విప్లవ భావాలు గల పక్షం వారి భావాలు; ఆ కాలంలో అమలులో ఉన్న ఏ విషయమూ అంగీకారయోగ్యం కాదని వారి విశ్వాసం) రెండింటికీ ద్వారం మూసివేసింది.
ఉత్పత్తి శక్తులు, బాహాటత… డెంగ్ వ్యూహాత్మక దార్శనికత
చారిత్రక స్పష్టత పునరుద్ధరణతో, చైనా తదుపరి సోషలిస్టు దశకు సాధికారిక రూపశిల్పిగా డెంగ్ సియావోపింగ్ ఆవిర్భవించాడు. దారిద్య్రంపై సోషలిజం నిర్మించలేమని డెంగ్ గుర్తించారు. సామ్రాజ్యవాదుల చక్రబంధాన్ని తట్టుకుని నిలబడాలన్నా, మానవ సంక్షేమాన్ని మెరుగుపరచాలన్నా సోషలిస్టు రాజ్యం తన ఉత్పాదక శక్తులను శీఘ్రంగా వృద్ధిపరచాలి, తన ఆర్థిక పునాదిని బలోపేతం చేసుకోవాలని వక్కాణించాడు.
1978లో, సిపిసి చరిత్రాత్మకమైన ‘సంస్కరణ, ఆర్థిక వ్యవస్థను బాహాటపరిచే విధానం’ ప్రకటించింది. దాంతో విదేశీ వాణిజ్యానికి, టెక్నాలజీకి ‘ద్వారం తెరుచుకుంది’. అయితే నాలుగు ముఖ్య సూత్రాలను (సోషలిస్టు పథం, సిపిసి నాయకత్వం సహా) కచ్చితంగా పాటిస్తామని ప్రకటించింది. ‘చైనా లక్షణాలతో సోషలిజం’ అనే శాస్త్రీయ భావన ముందుకు వచ్చింది.
ప్రభుత్వరంగం కింద మార్కెట్ యంత్రాంగాలు, ప్రణాళికాబద్ధంగా స్థూల ఆర్థిక చట్రాన్ని ప్రవేశపెట్టటం ద్వారా మార్కెట్ కార్మికవర్గ నియంతృత్వానికి ఉపకరిస్తుందని సిపిసి రుజువు చేసింది. ఈ విధానం మార్క్సిజాన్ని విడనాడలేదు. చైనా సోషలిజం ప్రాథమిక దశలో ఉందని గుర్తించటం, ఉన్నతమైన కమ్యూనిస్టు సమాజం కోసం పాదార్థిక పునాది వేయటానికి ఉత్పాదక శక్తులను పెద్దఎత్తున విస్తరించాల్సిన అవసరాన్ని గుర్తించటం ద్వారా అది మార్క్సిజాన్ని సంపద్వంతం చేసింది.
పార్టీ, రాజ్యం పటిష్ఠతకు జి జిన్‌పింగ్ దోహదం
కామ్రేడ్ జి జిన్‌పింగ్ దృఢమైన నాయకత్వం కింద చైనా కమ్యూనిస్టు పార్టీ సోషలిస్టు నిర్మాణంలో నూతన శకంలోకి ప్రవేశించింది. పరిపాలన, సిద్ధాంతం అభివృద్ధి విషయంలో అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమానికి ఒక ఉదాహరణగా నిలిచింది.
21వ శతాబ్దం వాస్తవికతలకు మార్క్సిజం అనువర్తింపజేయటంలో క్రితం తరాలు సాధించిన విజయాలు ఆధారంగా జిన్‌పింగ్, ‘నూతన శకంలో చైనా లక్షణాలతో సోషలిజం నిర్మాణంపై జిన్‌పింగ్ ఆలోచన’ను అభివృద్ధి చేశారు. చైనా సమాజాన్ని ఎదుర్కొంటున్న ప్రధాన వైరుధ్యాన్ని శాస్త్రీయంగా తిరిగి మదింపుచేయటం ఈ ఆలోచనలో కేంద్ర లక్షణం. అది శీఘ్రగతిన ఆర్థికాభివృద్ధి నుంచి వక్కాణింపును అసమతుల, అరకొర అభివృద్ధి జీవితం కోసం ప్రజల ఆకాంక్ష మధ్యనున్న వైరుధ్యం వైపు మరల్చింది. ఈ దృక్పథం ఉన్నత నాణ్యతతో కూడిన అభివృద్ధి, అందరి సౌభాగ్యం, పర్యావరణహితమైన నాగరికత, ప్రజల సంక్షేమానికి ఉపకరించే ఆర్థిక పురోభివృద్ధి సాధించే వైపుకు మార్గనిర్దేశన చేసింది.
ఈ దృక్పథం సాఫల్యతకు ఉదాహరణ ప్రపంచంలోనే అతిపెద్ద లక్ష్యిత దారిద్య్ర నిర్మూలన కార్యక్రమం విజయవంతంగా అమలు జరగటం. జిన్‌పింగ్ నాయకత్వం కింద సిపిసి పదుల లక్షల పార్టీ కార్యకర్తలను గ్రామీణ ప్రాంతాలకు తరలించింది. దాదాపు 10 కోట్లమందిని దారిద్య్రం నుంచి బయటకు తీసుకువచ్చారు. ఐక్యరాజ్యసమితి నిలకడైన అభివృద్ధి లక్ష్యాల్లో ఒకటైన దారిద్య్ర నిర్మూలనను షెడ్యూలుకన్నా ముందే నెరవేర్చారు. ఈ సాఫల్యం సోషలిస్టు అభివృద్ధి, ప్రభుత్వ నాయకత్వంలో ప్రణాళిక విధానం అమలులో మైలురాయిగా విస్తృతంగా పరిగణించబడింది.
పాలక కమ్యూనిస్టు పార్టీ దీర్ఘకాలిక జీవశక్తి దాని సైద్ధాంతిక బలం, సంస్థాగత నిర్మాణ నిజాయితీపై ఆధారపడి ఉంటుంది. ఇది గుర్తించిన జిన్‌పింగ్ వ్యక్తిగత విప్లవం, కచ్చితంగా పార్టీ సూత్రాలను పాటించటం, అవినీతికి వ్యతిరేకంగా పోరాటంతోకూడిన సమగ్ర ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన అవినీతి వ్యతిరేక పోరాటం సీనియర్ నాయకులపైన, పునాదిస్థాయి కార్యకర్తలపైన గురిపెట్టింది. పాతుకుపోయిన ప్రయోజనాలను కూల్చివేయటం, పార్టీ క్రమశిక్షణను పటిష్టం చేయటం, సిపిసి నాయకత్వ పాత్రను బలోపేతం చేయటంపై కేంద్రీకరించింది.
మార్క్సిస్టు విద్యను, సైద్ధాంతిక దిద్దుబాటును ముమ్మరం చేయటం, పార్టీ ప్రజాపంథాను పునరుద్ధరించటం పార్టీలో ఐక్యతను, క్రమశిక్షణను, రాజకీయ సఖ్యతను పెంపొందించింది. దీనికితోడుగా జాతీయ సార్వభౌమత్వాన్ని సమర్థించే, ఆధిక్యవాదాన్ని వ్యతిరేకించే విదేశాంగ విధానాన్ని పార్టీ వక్కాణించింది. అది బహుళపక్ష అంతర్జాతీయ వ్యవస్థను ప్రతిపాదిస్తున్నది. జిన్‌పింగ్ నాయకత్వంలో చైనా తన ఆర్థిక సార్వభౌమత్వాన్ని పటిష్టం చేసుకుంది, సోషలిస్టు మార్కెట్ ఆర్థిక వ్యవస్థను పరిరక్షించుకుంది. అందరి సౌభాగ్యం, అంతర్జాతీయ సహకారం లక్ష్యాలతో పార్టీ నిర్మాణాన్ని మేళవించింది. ఈ పరిణామాలు చైనా సోషలిస్టు పంథాలో విశ్వాసాన్ని పటిష్టం చేసాయి. సమకాలీన పరిస్థితుల్లో మార్క్సిజానికి కొనసాగుతున్న సజీవశక్తిని, అనువర్తింపును నిరూపించింది.
చైనా బహుళ ధృవ విదేశాంగ విధానం
అంతర్జాతీయ రంగంలో, సిపిసి శాంతి, రాజ్య సార్వభౌమత్వం, కార్మికవర్గ అంతర్జాతీయత ప్రాతిపదికగా విదేశాంగ విధానం అనుసరిస్తోంది. పశ్చిమ పెట్టుబడిదారీ విధానంలో అంతర్గతంగా ఉండే ఆధిపత్యవాదం, వలసవాదం, సైనిక దురాక్రమణను చైనా తిరస్కరిస్తున్నది. బహుళ ధృవ ప్రపంచం కోసం, “మానవాళి ఉమ్మడిగా పంచుకునే భవిష్యత్‌తో కూడిన సమాజం” కోసం చైనా కృషి చేస్తున్నది.
బెల్ట్ మరియు రోడ్డు చొరవల ద్వారా చైనా వర్ధమాన దేశాలకు మౌలిక వసతుల అభివృద్ధికై ప్రత్యామ్నాయ నమూనా ప్రణాళికను అందిస్తున్నది. సామ్రాజ్యవాద ద్రవ్య సంస్థలు ఇచ్చే బందిపోటుదారీ రుణాలనుంచి వాటికి ఆర్థిక స్వేచ్ఛ కల్పిస్తున్నది. సబబైన, బహుళ ధృవ దౌత్యాన్ని ప్రోత్సహించటం ద్వారా చైనా, సామ్రాజ్యవాద ఆధిపత్యానికి శక్తిమంతమైన ప్రతితూకంగా ఉపకరిస్తున్నది. తద్వారా గ్లోబల్ సౌత్ (దక్షిణ గోళ పేద, వర్ధమాన దేశాలు) ప్రయోజనాలు కాపాడుతున్నది, మరింత ప్రజాస్వామ్యయుతమైన అంతర్జాతీయ వ్యవస్థకు బాటవేస్తున్నది.
పార్టీ నాయకత్వ పాత్ర
చైనా ఆర్థిక నమూనా, మార్కెట్ యంత్రాంగాల వినియోగం, ప్రపంచ వాణిజ్య వ్యవస్థల్లో చేరిపోవటంపై అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో చర్చ జరుగుతున్నది. అయితే ఒక రాజ్యం వర్గ స్వభావాన్ని నిర్దిష్టమైన ఫలితాలను అంచనా కట్టటానికి మార్క్సిస్టు లెనినిస్టు విశ్లేషణ అవసరం.
వివాదరహితమైన వాస్తవికత ఇలా ఉందిః నేటి చైనా ఆర్థికంగా మహాశక్తి, గ్రీన్ టెక్నాలజీలో నాయకురాలు, పురోభివృద్ధి చెందిన శాస్త్రీయ కేంద్రం, కార్మికవర్గ ఆత్మగౌరవానికి రక్షకురాలు చైనా కమ్యూనిస్టు పార్టీ పరిపూర్ణ నాయకత్వం వల్లనే ఇది సాధ్యమైంది. ద్రవ్య జీవమార్గాలపై రాజ్యం నియంత్రణ అమలు జరపటం, భూమిపై ప్రభుత్వస్వామ్యాన్ని పరిరక్షించటం, ప్రభుత్వ యంత్రాంగాన్ని కార్మికవర్గం చేతిలో దృఢంగా ఉంచటం ద్వారా చైనా సోవియట్ యూనియన్ కూలిపోయిన విషాదకర పరిస్థితులను తప్పించుకోగలిగింది.
105 సంవత్సరాల చైనా కమ్యూనిస్టు పార్టీ మార్క్సిజం సత్యానికి సజీవ సాక్ష్యంగా ఉంది. సోషలిజం స్థిరంగా మనుగడ సాగించగలదని, అది మానవ నాగరికత అనివార్యమైన భవిష్యత్‌కు ప్రతినిధి అనీ ప్రపంచానికి రుజువు చేస్తున్నది.