Skip to content
తెలంగాణ వార్తలు

బీఆర్ఎస్ చేసిన అప్పులు రూ.8.21 లక్షల కోట్లు.. గులాబీ నేతలపై భట్టి విక్రమార్క పైర్..

Prajapaksham 03 Jul 2026 0 నిమిషాల పఠనం తెలంగాణ
బీఆర్ఎస్ చేసిన అప్పులు రూ.8.21 లక్షల కోట్లు.. గులాబీ నేతలపై భట్టి విక్రమార్క పైర్..

Bhatti vs KCR

తెలంగాణ రాష్ట్ర అప్పులు, ఆర్థిక పరిస్థితిపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. తాజాగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గులాబీ పార్టీ హయాంలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని, దీనిపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఆర్థిక మంత్రి హరీశ్ రావు ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు.

సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మాజీ మంత్రి హరీశ్ రావు తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను, ఆర్థిక అవకతవకలను కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్,హరీశ్ రావు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగుతున్నారని విమర్శించారు.

బీఆర్ఎస్ పదేళ్ల పాలన పూర్తిగా అబద్ధాల పునాదులపై సాగిందని డిప్యూటీ సీఎం ఆరోపించారు. వారి పాలన ముగిసే సమయానికి మొత్తం రూ. 8.21 లక్షల కోట్ల భారీ అప్పులు చేశారని, ఇందులో వివిధ విభాగాలకు సంబంధించి చెల్లించకుండా వదిలేసిన బకాయిలు కూడా ఉన్నాయని భట్టి వివరాలను వెల్లడించారు. ఈ అనాలోచిత అప్పుల కారణంగా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రెండున్నరేళ్ల కాలంలోనే అసలు, వడ్డీలు కలిపి ఏకంగా రూ. 2,08,061 కోట్లు చెల్లించాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు.

ఇంతటి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, ప్రజా ప్రభుత్వంగా తాము ఎక్కడా సంక్షేమ పథకాలను ఆపకుండా విజయవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. గతంలో ఉన్న అధిక వడ్డీ అప్పులను తమ ప్రభుత్వం రీస్ట్రక్చరింగ్ (పునర్వ్యవస్థీకరణ) చేయడం ద్వారా వార్షిక వడ్డీ భారాన్ని రూ. 34 వేల కోట్ల నుండి రూ. 11 వేల కోట్లకు తగ్గించగలిగామని వివరించారు.

ఆర్థిక వ్యవహారాలతో పాటు సింగరేణి సంస్థను కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. పదేళ్ల కాలంలో సంస్థ అభివృద్ధికి కొత్త కోల్ బ్లాకులను తీసుకురావడంలో గత పాలకులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. అంతేకాకుండా, సింగరేణిలో జరిగినట్లుగా భావిస్తున్న బొగ్గు మాయం ఆరోపణలపై ఇప్పటికే సింగరేణి విజిలెన్స్ విచారణకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి ప్రకటించారు. సంస్థను మళ్లీ లాభాల బాట పట్టించేందుకు ,కొత్త కోల్ బ్లాకుల కేటాయింపుల కోసం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ సందర్భంగా తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *