Skip to content
ప్రపంచం వార్తలు

బర్త్ టూరిజంపై అమెరికాలో చర్చ.. గర్భిణుల ప్రవేశంపై కఠిన నిబంధనలు..

Prajapaksham 03 Jul 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
బర్త్ టూరిజంపై అమెరికాలో చర్చ.. గర్భిణుల ప్రవేశంపై కఠిన నిబంధనలు..

trump and Birth Tourism

అమెరికాలో జన్మించిన ప్రతి బిడ్డకు దానంతట అదే పౌరసత్వం లభించే ‘జన్మతః పౌరసత్వం’ (Birthright Citizenship) వ్యవహారంలో సుప్రీంకోర్టు నుండి గట్టి ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. దేశంలో దీర్ఘకాలికంగా నలుగుతున్న ‘బర్త్ టూరిజం’ (జనన పర్యాటకం) సమస్యను శాశ్వతంగా ఎదుర్కొనేందుకు ఒక కొత్త మార్గాన్ని అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా గర్భంతో ఉన్న విదేశీ మహిళలు అమెరికాలోకి ప్రవేశించకుండా పూర్తిగా నిషేధించడం వంటి కఠినమైన ప్రణాళికలపై ట్రంప్‌కు చెందిన ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ (MAGA) వర్గీయులు ,సలహాదారులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.

ప్రముఖ ‘ఆక్సియోస్’ వార్తాసంస్థ ప్రచురించిన వివరాల ప్రకారం.. విదేశీ మహిళలు కేవలం పిల్లల ప్రసవం కోసమే అమెరికాకు వచ్చేలా ప్రోత్సహిస్తూ అందుకు తగిన ఏర్పాట్లు చేసే సంస్థలు, దళారీ వ్యక్తులపై కఠినమైన చట్టపరమైన చర్యలు చేపట్టాలని ట్రంప్ సర్కారు భావిస్తోంది. తమ ప్రయాణ ఉద్దేశాన్ని (గర్భాన్ని) దాచిపెట్టి, పర్యాటక వీసాల ద్వారా అమెరికాలోకి ప్రవేశించే మహిళలపై మోసం, వీసా నిబంధనల ఉల్లంఘన కింద క్రిమినల్ అభియోగాలు నమోదు చేయాలని యోచిస్తోంది.

దీనిపై వైట్ హౌస్ ప్రతినిధి అబిగైల్ జాక్సన్ స్పందిస్తూ.. అమెరికన్ పౌరసత్వ విలువను, దాని పవిత్రతను పరిరక్షించడానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. తాజా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ అంశంపై తక్షణమే కఠినమైన చట్టాలు తీసుకురావాలని ట్రంప్ ఇప్పటికే కాంగ్రెస్‌ను ఆదేశించారని, ఇటువంటి జనన పర్యాటక పథకాలపై నిశిత దర్యాప్తు జరిపేందుకు అమెరికా న్యాయ శాఖ కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని ఆమె వెల్లడించారు.

ఇలా ఉండగా గర్భవతిగా ఉన్న విదేశీ సందర్శకులు ఎవరినీ అమెరికా భూభాగంలోకి అడుగుపెట్టకుండా నిషేధించాలని ఫెడరలిస్ట్ వ్యవస్థాపకుడు సీన్ దేవిస్ బహిరంగంగా పిలుపునిచ్చారు. ట్రంప్ ఇమిగ్రేషన్ సలహాదారు స్టీఫెన్ మిల్లర్ సైతం తాత్కాలిక సందర్శకులపై వీసా జారీ సమయంలోనే కఠినమైన ఆంక్షలు ,వైద్య తనిఖీలు ఉండాలని సూచించారు. తాత్కాలిక ప్రాతిపదికన అయినా సరే దేశంలోకి ఎవరిని అనుమతిస్తున్నారనే విషయమై అమెరికా సరిహద్దు భద్రతా యంత్రాంగం ఇకపై అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

అసలు ‘బర్త్ టూరిజం’ అంటే విదేశాలకు చెందిన గర్భిణీ స్త్రీలు కేవలం అమెరికాలో ప్రసవించడమే లక్ష్యంగా పర్యాటక వీసాలపై అక్కడికి ప్రయాణించడం. అమెరికా రాజ్యాంగంలోని జన్మతః పౌరసత్వ చట్టం ప్రకారం.. అక్కడ పుట్టిన ఏ బిడ్డకైనా దానంతట అదే అమెరికా సిటిజన్‌షిప్ లభిస్తుంది. దీనిని ఆసరాగా చేసుకుని అనేకమంది విదేశీయులు తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం ఇప్పించుకుంటున్నారు. ప్రభుత్వం అధికారికంగా ఇటువంటి కేసుల గణాంకాలను నమోదు చేయనప్పటికీ, వివిధ ప్రైవేట్ సంస్థల అంచనాల ప్రకారం ఏటా సుమారు 20,000 నుండి 26,000 మంది శిశువులు ఈ పద్ధతిలోనే అమెరికాలో జన్మిస్తున్నారు. ఈ వ్యవస్థీకృత నెట్‌వర్క్‌లను ఛేదించేందుకు ,అక్రమ వలస దారులను అడ్డుకునేందుకు అమెరికా న్యాయశాఖ ఇప్పటికే ఫెడరల్ ప్రాసిక్యూటర్లను రంగంలోకి దించి ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *