ఇంధన ధరల తగ్గింపుపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడంపై ఏమన్నారంటే..
Hardeep Puri
అమెరికా, ఇరాన్‌ల మధ్య చారిత్రాత్మక అవగాహన ఒప్పందం (MoU) కుదరడంతో అంతర్జాతీయంగా ఆందోళన రేపిన హార్ముజ్ జలసంధి సంక్షోభం ఎట్టకేలకు పరిష్కారమైంది. ఈ సానుకూల పరిణామం వల్ల రాబోయే రోజుల్లో భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి గురువారం వెల్లడించారు. అంతర్జాతీయంగా చమురు ధరల తగ్గుదల గనుక మరో రెండు, మూడు నెలల పాటు ఇలాగే స్థిరంగా కొనసాగితే దేశీయంగా ఇంధన ధరలు మరింత దిగివస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రస్తుతం రెండు, రెండున్నర నెలల క్రితం అధిక ధరలకు కొనుగోలు చేసిన ముడి చమురు నిల్వలను (స్టాక్) శుద్ధి చేస్తున్నాయని, అందువల్ల తక్షణ ధరల తగ్గింపుపై ఇప్పుడే ఊహాగానాలు చేయడం సరికాదని ఆయన స్పష్టం చేశారు.
పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు సగటున 35 శాతం మేర పెరిగినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ముందస్తు జాగ్రత్తల వల్ల భారతదేశంలో ఈ పెరుగుదల కేవలం 5.58 శాతానికే పరిమితమైందని మంత్రి గణాంకాలతో వివరించారు. ఉత్పత్తి వ్యయం కంటే తక్కువ ధరలకే ఇంధనాన్ని సరఫరా చేయడం వల్ల దేశీయ చమురు కంపెనీలు జూన్ 30 నాటికి రూ. 74,781 కోట్ల భారీ నష్టాన్ని చవిచూశాయని ఆయన పేర్కొన్నారు.
అయినప్పటికీ దేశంలో ఎక్కడా ఇంధన కొరత లేకుండా, బంకుల వద్ద పొడవైన క్యూలు లేకుండా మార్చి నుండి జూన్ వరకు క్రమబద్ధంగా సరఫరాను కొనసాగించగలిగామని, వ్యూహాత్మక చమురు నిల్వలు (SPR), సమర్థవంతమైన నిర్వహణే ఇందుకు కారణమని కొనియాడారు. జూన్ 2022 నుండి జూన్ 2026 మధ్య కాలంలో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధరలు 5.58 శాతం, డీజిల్ ధరలు 6.23 శాతం మాత్రమే పెరిగాయని ఆయన తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరల పెరుగుదలను పోల్చి చూపిస్తూ.. గత నాలుగు నెలల్లో ఫ్రాన్స్‌లో 17.74 శాతం, జర్మనీలో 19.05 శాతం, ఇటలీలో 18.39 శాతం మేర పెట్రోల్ ధరలు పెరిగాయని హర్దీప్ సింగ్ పూరి చెప్పారు. ఇక భారత పొరుగు దేశాలైన పాకిస్తాన్‌లో 39.77 శాతం, బంగ్లాదేశ్‌లో 42.69 శాతం, శ్రీలంకలో 36.66 శాతం, నేపాల్‌లో 20.3 శాతం చొప్పున ధరలు ఆకాశాన్నంటాయని గుర్తుచేశారు.
గడిచిన నాలుగేళ్లలో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96 నుండి రూ. 102 కి చేరిన తరుణంలో, ప్రజలపై భారం తగ్గించేందుకు గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌లపై లీటరుకు రూ. 10 చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని, తద్వారా ప్రభుత్వానికి రూ. 1 లక్ష కోట్ల ఆదాయ నష్టం వాటిల్లినప్పటికీ సామాన్యుడికి ఉపశమనం కల్పించామని మంత్రి వివరించారు. అంతర్జాతీయంగా హార్ముజ్ సంక్షోభం ముగిసినందున.. రాబోయే రోజుల్లో దేశీయ మార్కెట్‌లో చమురు ధరలపై మరింత స్పష్టత వస్తుందని ఆయన తెలిపారు.