Skip to content
తెలంగాణ వార్తలు

హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్.. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే AI కనిపెట్టేస్తుందిక..

Prajapaksham 02 Jul 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్.. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే AI కనిపెట్టేస్తుందిక..

AI ట్రాఫిక్

మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ నిఘా వ్యవస్థ సరికొత్త రూపం దాల్చబోతోంది. రోడ్లపై పోలీసులు లేరనే ధీమాతో ఇష్టారాజ్యంగా వాహనాలు నడిపే వాహనదారులకు ముకుతాడు వేసేందుకు అధికారులు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను రంగంలోకి దించారు. బేగంపేటలో రెండు నెలల పాటు నాలుగు కెమెరాలతో నిర్వహించిన పైలట్ ప్రాజెక్ట్ ఆశించిన సత్ఫలితాలను ఇవ్వడంతో.. ఇప్పుడు కమిషనరేట్ వ్యాప్తంగా కీలక కూడళ్లలో 75 కెమెరాలకు ఈ ఏఐ సాంకేతికతను జోడించాలని నిర్ణయించారు.

ఈ సరికొత్త వ్యవస్థ ద్వారా రోడ్లపై జరిగే ఉల్లంఘనలను ఏఐ కెమెరాలు స్వయంచాలకంగా గుర్తించి, వాహనం నంబర్, ప్రమాద తీరు వంటి వివరాలను సెంట్రల్ కంట్రోల్ రూమ్ సర్వర్‌కు చేరవేస్తాయి. అక్కడ ఉండే సిబ్బంది ఈ వివరాలను విశ్లేషించి ఆమోదించగానే, వాహనదారుడి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వాట్సాప్, ఎస్సెమ్మెస్ లేదా ఈ-మెయిల్ ద్వారా నేరుగా ఈ-చలాన్ వెళ్ళిపోతుంది. సాంకేతికంగా అత్యంత కీలకంగా మారిన ఈ విభాగాన్ని పర్యవేక్షించేందుకు కొత్తగా రిక్రూట్ అయిన ఎస్‌ఐలలో బీటెక్, ఎంటెక్ చదివిన వారికి బాధ్యతలు అప్పగించనున్నారు.

గత రెండు నెలలుగా పోలీసులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌ల ద్వారా కమిషనరేట్ పరిధిలో ఏకంగా 1,27,760 కేసులు నమోదవ్వగా, సుమారు రూ. 6.73 కోట్ల జరిమానాలు విధించారు. ఇందులో అత్యధికంగా రాంగ్ సైడ్ డ్రైవింగ్, అక్రమ పార్కింగ్, నంబర్ ప్లేట్ నిబంధనల ఉల్లంఘనలే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇకపై చలాన్ల జారీ ప్రక్రియ అంతా డిజిటల్ రూపంలో ఏఐ చూసుకుంటుంది కాబట్టి, ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో చలానాల కోసం పనిచేసిన పోలీసు సిబ్బందిని రోడ్డు భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ వంటి ఇతర ముఖ్యమైన విధులకు ఉపయోగించనున్నట్లు ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డి స్పష్టం చేశారు.