Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

జగన్‌పై సీబీఐ-ఈడీ కేసులు ఎందుకు ముందుకు కదలడం లేదు?

Prajapaksham 29 Jun 2026 0 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
జగన్‌పై సీబీఐ-ఈడీ కేసులు ఎందుకు ముందుకు కదలడం లేదు?

ai generated image

15 ఏళ్లు అయినా…ట్రయల్ ప్రారంభం కానీ 20 కేసులు
సుప్రీంకోర్టు ఆదేశాలకు నోచుకోని ప్రజాప్రతినిధుల కేసులు

‘పదిహేను ఏండ్లు.. 20 కేసులు.. ఆరుగురు జడ్జీలు.. వేల పేజీల చార్జిషీట్లు.. అనేక డిస్చార్జ్ పిటిషన్లు.. అయినా ట్రయల్ ప్రారంభం కాలేదు. ఇది కేవలం జగన్ కేసుల కథ మాత్రమే కాదు. దేశంలో ప్రముఖులపై నమోదయ్యే అవినీతి కేసులు ఎందుకు దశాబ్దాల పాటు న్యాయవ్యవస్థలోనే చిక్కుకుపోతాయన్నది ప్రశ్న. ఉదాహరణకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నమోదైన 11 సీబీఐ, 9 ఈడీ అవినీతి, అక్రమాస్తుల కేసులు దాదాపు పదిహేను ఏండ్లకు పైగా న్యాయస్థానాల్లో పెండింగ్‌లోనే ఉన్నాయి. ఇప్పటికీ ఈ కేసుల్లో చాలా వరకు పూర్తి స్థాయి ట్రయల్ ప్రారంభం కాకపోవడం న్యాయవ్యవస్థ పనితీరు, విచారణా ప్రక్రియలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఒకవైపు రాజకీయ ఆరోపణలు, మరోవైపు న్యాయపరమైన ప్రక్రియలు, వరుస పిటిషన్లు, జడ్జీల మార్పులు కలిసి కేసుల పురోగతిని మందగింపజేశాయని న్యాయవర్గాలు విశ్లేషిస్తున్నాయి.

అసలు కేసులు ఎప్పుడు నమోదయ్యాయి?
2011లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ జగన్‌కు చెందిన అక్రమాస్తుల వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించింది. అనంతరం పలు చార్జిషీట్లు దాఖలు చేసింది. అదే కేసులకు అనుబంధంగా డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్‌మెంట్ మనీలాండరింగ్ కోణంలో తొమ్మిది కేసులు నమోదు చేసింది. 2012లో జగన్ అరెస్టై దాదాపు 16 నెలలు జైలులో గడిపిన తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు.

ట్రయల్ ఎందుకు ప్రారంభం కాలేదు?
న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, కేసుల ఆలస్యానికి ప్రధాన కారణం ‘డిస్చార్జ్ పిటిషన్లు’. అంటే, ‘ఈ కేసులో నాపై సరైన ఆధారాలు లేవు, ట్రయల్ నుంచి నన్ను మినహాయించండి’ అని నిందితులు కోర్టును కోరే ప్రక్రియ. జగన్ తరఫున, అలాగే ఇతర సహ నిందితుల తరఫున దాఖలైన అనేక డిస్చార్జ్ పిటిషన్లు, వాటిపై విచారణ, హైకోర్టు, సుప్రీంకోర్టుల వరకు వెళ్లిన అప్పీలుల కారణంగా ప్రధాన విచారణ ప్రారంభం కాలేదని న్యాయవర్గాలు చెబుతున్నాయి.

జడ్జీల మార్పు కూడా ఆలస్యానికి కారణమా?
ఈ కేసులను విచారించిన ప్రత్యేక సీబీఐ కోర్టులో గత పదేళ్లలో పలువురు న్యాయమూర్తులు మారారు. కొందరు పదోన్నతులు, మరికొందరు బదిలీలు, ఇంకొందరు పదవీ విరమణ కారణంగా తప్పుకున్నారు. వాదనలు దాదాపు పూర్తయ్యే దశలో జడ్జీలు మారిపోవడంతో కొత్తగా వచ్చిన న్యాయమూర్తులు మళ్లీ కేసు రికార్డులను అధ్యయనం చేసి వాదనలు వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఒకే అంశంపై పలుమార్లు వాదనలు జరిగినప్పటికీ తుది నిర్ణయం ఆలస్యమవుతూ వచ్చింది.

సుప్రీంకోర్టు ఆదేశాలున్నా ఎందుకు వేగం పెరగలేదు?
ప్రజాప్రతినిధులపై ఉన్న క్రిమినల్ కేసులను ఏడాది లోపే విచారించాలని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో సూచించింది. ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించింది. అయితే భారీ సంఖ్యలో సాక్షులు, వేల పేజీల చార్జిషీట్లు, అనుబంధ పిటిషన్లు, వివిధ స్థాయిల్లో న్యాయపరమైన సవాళ్లు కేసుల పురోగతిని ప్రభావితం చేస్తున్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

రాజకీయ విమర్శలు – వైసీపీ
వైసీపీ నేతలు మాత్రం ఈ కేసులు రాజకీయ కక్షసాధింపులో భాగంగా నమోదయ్యాయని, కోర్టుల్లో నిజానిజాలు తేలుతాయని చెబుతున్నారు. తాము చట్ట ప్రక్రియను అనుసరిస్తున్నామని, డిస్చార్జ్ పిటిషన్ దాఖలు చేయడం ప్రతి నిందితుడికి చట్టబద్ధమైన హక్కేనని పేర్కొంటున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీలు మాత్రం వరుస పిటిషన్లు, వాయిదాలు, న్యాయ ప్రక్రియలను ఉపయోగించుకోవడం వల్లే కేసులు ట్రయల్ దశకు చేరలేదని ఆరోపిస్తున్నాయి.

ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి..
ప్రముఖ వ్యక్తులపై నమోదైన కేసులు దశాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉండటం న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసాన్ని దెబ్బతీస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణ వ్యక్తుల కేసులు వేగంగా సాగుతుంటే, ప్రముఖుల కేసులు మాత్రం అంతులేని న్యాయ ప్రక్రియలో చిక్కుకుపోతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

కీలక ప్రశ్నలు

>> 20 కేసులు నమోదై పదిహేను ఏండ్లు దాటినా పూర్తి స్థాయి ట్రయల్ ఎందుకు మొదలుకాలేదు?
>> డిస్చార్జ్ పిటిషన్లపై నిర్ణయాలకు ఎందుకు ఇంత సమయం పట్టింది?
>> జడ్జీల తరచూ మార్పు విచారణను ఎంతవరకు ప్రభావితం చేసింది?
>> ప్రజాప్రతినిధుల కేసుల వేగవంతమైన విచారణపై సుప్రీంకోర్టు ఆదేశాలు ఎందుకు పూర్తిగా అమలు కాలేదు

>> న్యాయ ప్రక్రియలో జాప్యానికి బాధ్యత ఎవరిది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *