ఎంపీ కేశినేని చిన్ని కూకట్‌పల్లి పరిధిలో భారీ భూ దోపిడీ.. చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన మాజీ ఎంపీ కేశినేని నాని..
హైదరాబాద్ నగర శివార్లలోని కూకట్‌పల్లి పరిధిలో వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కాజేయడానికి తెలుగుదేశం పార్టీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఒక పెద్ద భూదోపిడీకి తెరలేపారని మాజీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ చిన్ని తన రాజ్యాంగ పదవిని, అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఒక పెద్ద సిండికేట్‌ను నడుపుతున్నారని, దీనిపై తక్షణమే స్పందించి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డికి ఘాటుగా లేఖ రాశారు.
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి మండల పరిధిలోని షంషీగూడ గ్రామం సర్వే నంబర్ 57లో టీజీఐఐసీ ఐటీ పార్క్ కోసం ప్రతిపాదించిన 112.72 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా చేజిక్కించుకోవడానికి ఎంపీ ప్రయత్నిస్తున్నట్లు నాని తన లేఖలో పేర్కొన్నారు. ఈ భూకబ్జా కోసం కేశినేని చిన్ని తన కుమారుడు, ‘ఎక్సెల్లా ప్రాపరీ్టస్’ మేనేజింగ్ పార్ట్నర్ అయిన కేశినేని వెంకట్ చౌదరిని ప్రాక్సీగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఢిల్లీ స్థాయి నుండి ఒత్తిడి తెస్తూ, తెలంగాణలోని ప్రభుత్వ ఆస్తులను కాజేయడానికి ఎంపీ ప్రయత్నిస్తున్నారని, అక్కడ అక్రమంగా హక్కులు పొందడానికి నాగమ్మ గుడి ఎదురుగా భారీ ఎర్త్ మూవర్లను, బారికేడ్లను కూడా మోహరించారని లేఖలో వివరించారు.
ఈ వివాదాస్పద భూమిపై ఎలాంటి ప్రైవేట్ యాజమాన్య హక్కులు లేవని, ఇదంతా ప్రభుత్వ రికార్డుల ప్రకారం ‘పోరంబోకు సర్కారీ’ భూమి అని జిల్లా కలెక్టర్ 2026 మార్చి 19 నాటి కౌంటర్ అఫిడవిట్‌లో స్పష్టం చేసిన విషయాన్ని నాని గుర్తుచేశారు. అస్మాన్ జాహి వారసుల ప్రైవేట్ క్లెయిమ్‌లను గతంలోనే అతియాత్ కోర్టు, రెవెన్యూ బోర్డులు తిరస్కరించినప్పటికీ.. ఎంపీ సిండికేట్ సుప్రీంకోర్టులో ఆర్టికల్ 142 కింద మోసపూరిత ప్రైవేట్ రాజీ దరఖాస్తులను దాఖలు చేసిందని మండిపడ్డారు.
అంతేకాకుండా, ఈ ఆస్తి వెనుక గతంలో పంజాబ్, మహారాష్ట్ర కోఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్ కుంభకోణానికి సంబంధించిన నిధుల మళ్లింపు ఉందనే ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇచ్చిన కాషన్ నోటీసులు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) స్టే ఆర్డర్లు కూడా ఉన్నాయని, ఈ విషయాలన్నింటినీ దాచిపెట్టి కోర్టును సైతం వారు మోసం చేస్తున్నారని నాని ఆరోపించారు. ప్రైవేట్ రాజీ ద్వారా వీటిని దాటవేయడం మనీ లాండరింగ్ (పీఎంఎల్‌ఏ) చట్టం ప్రకారం తీవ్రమైన నేరమని స్పష్టం చేశారు.
కేశినేని చిన్ని సిండికేట్ కేవలం భూకబ్జాలకే పరిమితం కాలేదని, టీఎస్–రెరా (TS-RERA) అనుమతులు లేకుండానే కేశినేని డెవలపర్స్, ఎక్సెల్లా ప్రాపర్టీస్ పేరుతో నగరంలోని బంజారాహిల్స్, గచ్చిబౌలి, ప్రగతినగర్, శంకర్‌పల్లి, పటాన్‌చేరు, దుండిగల్ వంటి ప్రధాన ప్రాంతాలలో నకిలీ ప్రీ–లాంచ్ స్కామ్‌లకు పాల్పడిందని నాని ధ్వజమెత్తారు. అక్కడ లేని ప్లాట్లను చూపిస్తూ వందలాది మధ్యతరగతి కుటుంబాల నుండి వందల కోట్ల రూపాయలు వసూలు చేసి, ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయకుండా ఆ నిధులను ఈ భూకబ్జా కార్యకలాపాలకు మళ్లించారని ఆరోపించారు.