ఏపీకి గుడ్‌న్యూస్.. హైదరాబాద్–అమరావతి–చెన్నై కారిడార్‌లో తిరుపతి కీలక స్టాప్.. బుల్లెట్ ట్రైన్ రూట్ మ్యాప్ ఇదే..
Hyderabad–Chennai High-Speed Rail Project Eyes Tirupati Stop
దక్షిణ భారతదేశంలో రవాణా రంగాన్ని విప్లవాత్మకంగా మార్చబోయే ప్రతిపాదిత బుల్లెట్ రైలు (హై స్పీడ్ రైల్) నెట్‌వర్క్‌లో ఆంధ్రప్రదేశ్ అత్యంత కీలకమైన పాత్ర పోషించనుంది. హైదరాబాద్-అమరావతి-చెన్నై కారిడార్‌ను రాష్ట్ర రాజధాని అమరావతి మీదుగానే నిర్మించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అభ్యర్థనకు నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) సానుకూల స్పందన తెలియజేసింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలను కలుపుతూ సాగే ఈ భారీ హై-స్పీడ్ రైల్ కారిడార్ మొత్తం 760.09 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. ప్రస్తుతం ఈ నగరాల మధ్య ఉన్న దాదాపు 12 గంటల సుదీర్ఘ ప్రయాణ సమయాన్ని ఈ బుల్లెట్ రైలు కేవలం 2 గంటల 20 నిమిషాలకు తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రతిపాదిత నెట్‌వర్క్‌లో అత్యధికంగా 518.54 కిలోమీటర్ల మార్గం ఆంధ్రప్రదేశ్‌లోనే సాగనుండగా.. తెలంగాణలో 180.32 కిలోమీటర్లు, తమిళనాడులో 61.23 కిలోమీటర్ల మేర ట్రాక్ నిర్మిస్తారు. ఈ కారిడార్ వెంబడి మొత్తం 18 స్టేషన్లను ప్రతిపాదించగా.. అందులో సగం స్టేషన్లు అంటే అత్యధికంగా తొమ్మిది స్టేషన్లు ఆంధ్రప్రదేశ్‌లోనే ఏర్పాటు కానున్నాయి. ఈ కారిడార్ యొక్క పూర్తి రూట్ మ్యాప్, స్టేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి:
తెలంగాణ భాగం:
ఈ హై-స్పీడ్ కారిడార్ హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది. నగరంలోని ప్రముఖ ఐటీ, రవాణా హబ్‌లైన గచ్చిబౌలి లేదా నానక్‌రామ్‌గూడ పరిసర ప్రాంతాలలో దీని ప్రారంభ స్టేషన్ జోన్‌ను ప్రతిపాదించారు. అక్కడి నుండి బయలుదేరి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వైపు పయనిస్తూ.. భారత్ సిటీ, డ్రై పోర్ట్ స్టేషన్ల గుండా వెళ్తుంది. ఆ తర్వాత నల్గొండ జిల్లాలోని హాలియా, వడపల్లి స్టేషన్ల మీదుగా ప్రయాణించి తెలంగాణ సరిహద్దులను దాటుతుంది.
ఆంధ్రప్రదేశ్ భాగం:
తెలంగాణ సరిహద్దు దాటిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఈ బుల్లెట్ రైలుకు దాచేపల్లి మొదటి మజిలీగా ఉంటుంది. అక్కడి నుండి నేరుగా రాష్ట్ర రాజధాని ప్రాంతమైన అమరావతికి చేరుకుంటుంది. తరువాత పొరుగున ఉన్న గుంటూరు స్టేషన్‌కు అనుసంధానమవుతుంది. ఆ తర్వాత ఈ కారిడార్ దక్షిణాది కోస్తా జిల్లాల మీదుగా సాగుతూ చీరాల, ఒంగోలు, కావలి, ప్రముఖ నగరమైన నెల్లూరు స్టేషన్లలో షెడ్యూల్ ప్రకారం ఆగుతుంది. అక్కడ నుండి గూడూరు మీదుగా ప్రయాణించి ఆంధ్రప్రదేశ్‌లోని చివరి మజిలీ అయిన ఆధ్యాత్మిక నగరం తిరుపతికి చేరుకుంటుంది.
గతంలో ఈ మార్గాన్ని రావెల గ్రామానికి ఆనుకుని నిర్మించాలని ప్రతిపాదించినప్పటికీ.. అది అమరావతి, విజయవాడ నగరాలకు చాలా దూరంగా జరిగి ప్రయాణికులకు అసౌకర్యంగా మారుతుందని NHSRCL గుర్తించింది. అందువల్ల, రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ఈ కారిడార్‌ను మొదట అనుకున్నట్లుగానే నేరుగా అమరావతి గుండానే వెళ్లేలా ప్రణాళికను ఖరారు చేశారు.
తమిళనాడు భాగం:
ఆంధ్రప్రదేశ్ దాటిన తర్వాత ఈ కారిడార్ తమిళనాడులోని తిరువళ్లూరు స్టేషన్‌కు చేరుకుంటుంది. చెన్నై నగరంలోని భారీ ట్రాఫిక్ రద్దీని తప్పించడానికి వీలుగా మింజూర్ సమీపంలోని చెన్నై ఔటర్ రింగ్ రోడ్ (ORR) వద్ద మరో స్టేషన్‌ను ప్రతిపాదించారు. చివరకు 760 కిలోమీటర్ల ఈ సుదీర్ఘ కారిడార్ దాని ప్రధాన టెర్మినస్ అయిన చెన్నై సెంట్రల్ స్టేషన్ వద్ద ముగుస్తుంది.
చిత్తూరు-తిరుపతి కనెక్టివిటీ, చెన్నై-బెంగళూరు కారిడార్:
ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రతిపాదించిన 65 కిలోమీటర్ల చిత్తూరు-తిరుపతి అనుసంధాన కారిడార్ కోసం తుది స్థాన సర్వే (Final Location Survey) నిర్వహించి, వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదిక (DPR) సిద్ధం చేయడానికి NHSRCL అంగీకరించింది. ఈ నివేదిక పూర్తయిన తర్వాత తుది అనుమతుల కోసం కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖకు సమర్పిస్తారు.
ఈ ప్రత్యేక లింక్ ఏర్పాటు కావడం వల్ల హైదరాబాద్-అమరావతి-చెన్నై మార్గం, ప్రతిపాదిత చెన్నై-బెంగళూరు హై స్పీడ్ రైల్ కారిడార్‌తో అనుసంధానమవుతుంది. ఫలితంగా బెంగళూరు నుండి వచ్చే ప్రయాణికులు చిత్తూరు, తిరుపతి మీదుగా నేరుగా అమరావతికి సులభంగా చేరుకోవచ్చు. కాగా, ప్రత్యేకంగా ఉన్న ఈ చెన్నై-బెంగళూరు కారిడార్ మొత్తం 306 కిలోమీటర్ల పొడవుతో (తమిళనాడులో 133 కి.మీ, ఆంధ్రప్రదేశ్‌లో 72 కి.మీ, కర్ణాటకలో 101 కి.మీ) ఏడు స్టేషన్లతో (చెన్నై సెంట్రల్, పూనమల్లి, పరాందూర్, చిత్తూరు, కోలార్, కోడిహళ్లి, వైట్‌ఫీల్డ్, బైయప్పనహళ్లి) రూపుదిద్దుకోనుంది. ఈ రెండు బృహత్తర ప్రాజెక్టులు పూర్తయితే దక్షిణ భారతదేశం అంతటా రవాణా సౌకర్యాలు, కనెక్టివిటీ అద్భుతమైన స్థాయికి చేరుకుంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు.