Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీలో ఆపరేషన్ సై”కిల్” మొదలవుతోందా ? చంద్రుడి అవసరం లేకుండా బలం పెంచుకున్న కమలంతో చిక్కులు తప్పవా ?

Prajapaksham 23 Jun 2026 0 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
ఏపీలో ఆపరేషన్ సై”కిల్” మొదలవుతోందా ? చంద్రుడి అవసరం లేకుండా బలం పెంచుకున్న కమలంతో చిక్కులు తప్పవా ?

ఏపీలో ఆపరేషన్ సై"కిల్" మొదలవుతోందా..? (AI Generated)

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి 20 మంది ఎంపీలు బయటకు రావడం, ఉద్ధవ్ ఠాక్రే పార్టీ నుంచి మరొక ఆరుగురు ఎంపీలను బయటకు లాక్కోవడం, బీహార్‌లో నితీష్ కుమార్‌ను గద్దె దించడం, ఈ పరిణామాలు అన్ని చూస్తూ ఉంటే ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు బీజేపీకి మరో టార్గెట్ అవుతారా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చకు చక్కర్లు కొడుతున్నాయి. ఎందుకంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కేవలం 240 సీట్లకు మాత్రమే పరిమితం కావడంతో, అప్పట్లో జేడీయూ నితీష్ కుమార్, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు పైనే ఆధారపడి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి నిలబడేందుకు వీరిద్దరూ ఊతకర్రగా మిగిలారు. అప్పటినుంచి మిత్రపక్షాల చేతుల్లో కీలుబొమ్మగా ఎట్టి పరిస్థితుల్లోనూ మారకూడదని మోదీ, అమిత్ షా నిర్ణయించుకున్నట్లు ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే పావులు కదుపుతూ, ఒక్కొక్క ప్రాంతీయ పార్టీని దెబ్బ కొడుతూ ముందుకు వెళ్తున్నారు. అటు తమ కాళ్ల కిందకు నీళ్లు రావు అనే ధీమాతో నితీష్ కుమార్ బీహార్ ఎన్నికలకు వెళ్లగా, ఆయన చేతికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్టే ఇచ్చి, ప్రస్తుతం ఆ పదవి సైతం లాక్కొని జేడీయూ పార్టీని తమ చెప్పుచేతుల్లోకి తెచ్చుకున్నారు. ఇది చంద్రబాబు నాయుడుకు మొదటి డేంజర్ సిగ్నల్ అవ్వాల్సింది. ఎందుకంటే జాతీయ స్థాయిలో కింగ్ మేకర్లమనే భావనలో ఉన్న చంద్రబాబు, నితీష్ కుమార్ తమ పునాదులను కదిలించేలా బీజేపీ అత్యంత చాకచక్యంగా వేస్తున్న వ్యూహాత్మక అడుగులను పసిగట్టడంలో పూర్తిగా వైఫల్యం పొందారు.

ఇక పశ్చిమబెంగాల్ ఎన్నికలు ఇలా పూర్తయ్యాయో లేదో, మమత టీఎంసీ పార్టీ పైనే బీజేపీ గురిపెట్టి, ఏకంగా 20 మంది ఎంపీలను బయటకు లాగేసి, ఎన్డీఏలో చేర్చుకొని మెజారిటీకి అత్యంత చేరువకు చేరుకుంది. ఇది చంద్రబాబు నాయుడుకు అతి పెద్ద డేంజర్ సిగ్నల్. ఎందుకంటే అటు టీడీపీ అవసరం లేకుండానే ఎన్డీఏ నిలబడే స్థాయికి చేరుకుంది. ఇక అతిపెద్ద మాస్టర్ స్ట్రోక్ మహారాష్ట్ర శివసేన ఎంపీల చేరిక. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందినటువంటి ఆరుగురు ఎంపీలు ఇప్పుడు ఎన్డీఏ పక్షంలోకి వచ్చి చేరారు. దీంతో బీజేపీ మొదలుపెట్టిన రాజకీయ ఆకర్ష వ్యూహం ఫలించి, చంద్రబాబు అవసరం లేకుండానే సొంతంగా మనుగడ సాగించేలా, పార్లమెంటులో బిల్లులు పాస్ చేసుకునేలా తన మ్యాజిక్ ఫిగర్ అందుకుంది.

ఇప్పుడు ఇంతకాలం గడచిన రెండు సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు సాగిస్తూ, నరేంద్ర మోదీకి భజన చేస్తూ, అమరావతికి నిధులు తెచ్చుకోవాలని, పోలవరం కట్టుకోవాలని కలలు కన్నారు. ఇప్పుడు తెలుగుదేశం అవసరం ఎన్డీఏకు లేదు అన్నది స్పష్టం. అంటే 2014లో ఎలా అయితే బీజేపీ పూర్తిస్థాయిలో మెజారిటీ పొంది, తెలుగుదేశంను కూరలో కరివేపాకుల పక్కకు పారేసిందో, దాదాపు అలాంటి పరిస్థితి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సరిగ్గా రెండు సంవత్సరాల తరువాత రిపీట్ అవుతోంది అని చెప్పవచ్చు.

ప్రస్తుతం ఇండియాకు చంద్రుడి అవసరం లేదు. కనుక అమరావతికి నిధులు ఇవ్వాల్సిన అవసరం కూడా బీజేపీకి లేదు అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అపర చాణక్యుడుగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు, బేషరతుగా 2024లో ఎన్డీఏకు మద్దతు ఇవ్వడమే దెబ్బ కొట్టిందా..? ఏ మాత్రం బేరసారాలు చేయకుండా సరెండర్ అనే పద్ధతిలో వెళ్లడం ఆత్మహత్య సదృశ్యం అవుతుందా అనేది భవిష్యత్తు తేల్చనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *