Skip to content
జాతీయం వార్తలు

తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ కీలక ప్రసంగం: ‘యాక్టర్ పార్టీ’ అన్నవారికి గట్టి కౌంటర్..

Prajapaksham 23 Jun 2026 1 నిమిషాల పఠనం జాతీయం
తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ కీలక ప్రసంగం: ‘యాక్టర్ పార్టీ’ అన్నవారికి గట్టి కౌంటర్..

Tamil Nadu Assembly: CM Vijay Traces TVK’s Growth From Welfare Work to Governance in Assembly

నీట్, హిందీ వివాదాలపై కేంద్రంపై ధ్వజం..

సభలో ‘పుష్ప’ స్టైల్ సైగతో డీఎంకే వాకౌట్!

తమిళనాడు శాసనసభ వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్‌ చేసిన కీలక ప్రసంగం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మంగళవారం సభను ఉద్దేశించి మాట్లాడిన ఆయన.. తనను, తన పార్టీని టార్గెట్ చేసిన విమర్శకులకు తనదైన శైలిలో గట్టి బదులిచ్చారు.

తాము ఎన్నో కుట్రలను, సవాళ్లను అధిగమించి అధికారంలోకి వచ్చామని, ఎంతోమంది తమది ఒక కేవలం ‘యాక్టర్ పార్టీ’ అని, సినిమా షూటింగ్ నుంచి నేరుగా వచ్చి తాను సీఎం కుర్చీలో కూర్చున్నానని ఎగతాళి చేశారని విజయ్ గుర్తుచేసుకున్నారు. అలాంటి విమర్శలను తాను అస్సలు పట్టించుకోనని, సాధారణంగా చాలా మంది రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత ప్రజల్లోకి వెళ్తారని, కానీ తాను ప్రజల్లోకి వెళ్లి వారి గుండెల్లో స్థానం సంపాదించుకున్న తర్వాతే పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేశానని స్పష్టం చేశారు. తమిళనాడు ప్రజలు తనపై నమ్మకం ఉంచే ఈ అఖండ విజయాన్ని కట్టబెట్టారని సీఎం విజయ్ ధీమా వ్యక్తం చేశారు.

ఈ ప్రసంగంలో దేశవ్యాప్తంగా నడుస్తున్న నీట్ (NEET) వివాదాన్ని విజయ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. నీట్ పరీక్షా విధానం విద్యా వ్యవస్థలో తీవ్రమైన అసమానతలను సృష్టిస్తోందని, సామాన్య విద్యార్థులకు అన్యాయం చేస్తున్న ఈ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని ఆయన గట్టిగా డిమాండ్‌ చేశారు. అలాగే తమిళనాడులో ఎప్పటి నుంచో అమలవుతున్న ద్విభాషా విధానానికే తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని పునరుద్ఘాటించారు. దక్షిణాది రాష్ట్రాలపై హిందీ భాషను రుద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాలను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తేల్చి చెప్పారు. ఎన్నికల ప్రచార సమయంలో కరూర్‌లో చోటుచేసుకున్న తొక్కిసలాట దుర్ఘటనను ప్రస్తావిస్తూ విజయ్ భావోద్వేగానికి లోనయ్యారు.

ఏకంగా 41 మంది ప్రాణాలు కోల్పోయిన ఆ విషాదం తనను ఎంతగానో వేధించిందని, ఆ బాధ నుంచి తాను ఇంకా కోలుకోలేదని అన్నారు. అయితే ఆ దుర్ఘటనను కూడా రాజకీయం చేస్తూ తమపైనే నిందలు వేయడం అత్యంత దారుణమని, రాజకీయాలు ఇంత క్రూరంగా ఉంటాయా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకేపై విజయ్ పరోక్షంగా చరకలు వేశారు. కేవలం ఒకే ఒక్క కుటుంబానికి ప్రాధాన్యమివ్వడం తమ పాలనా విధానం కాదని, తమిళనాడులోని ప్రతి కుటుంబాన్ని తమ కుటుంబంగా భావించి సేవ చేయడమే తమ అసలైన రాజకీయం అని ప్రకటించారు. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను ఎండగడుతూ, తమ ప్రభుత్వంలో వాటన్నింటికీ అడ్డుకట్ట వేస్తామని హుందాగా హామీ ఇచ్చారు.

ఇక ప్రసంగం ముగించే తరుణంలో అసెంబ్లీలో ఊహించని ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తన ప్రసంగం ముగించే ముందు సీఎం విజయ్ స్పీకర్‌కు ఒక వినూత్న విజ్ఞప్తి చేశారు. తాను ఒక చిన్న సినిమా స్టైల్ సంజ్ఞ చేయాలనుకుంటున్నానని, అందుకు అనుమతి ఇవ్వాలని కోరడంతో సభలోని ఎమ్మెల్యేలంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. స్పీకర్ నుంచి అనుమతి లభించిన వెంటనే అందరూ చూస్తుండగానే, అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా శైలిలో గడ్డం కింద చేయి పెట్టి ‘అంతా అయిపోయింది’ అనే తరహాలో ఒక మాస్ సైగ చేశారు.

దీంతో టీవీకే పార్టీతో పాటు అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యేలంతా సీట్లలోంచి లేచి హర్షధ్వానాలు చేయగా, ఈ వ్యవహారంతో తీవ్ర ఆగ్రహానికి గురైన డీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అయితే విజయ్ చేసిన ఈ వినూత్న సంజ్ఞ వెనుక డీఎంకే అధినేత, మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌కు ఇచ్చిన గట్టి కౌంటర్ ఉందనే చర్చ పొలిటికల్ వర్గాల్లో నడుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీఎంకే-కాంగ్రెస్ పొత్తు .. సీట్ల సర్దుబాటు ముగిసిన తరుణంలో, మీడియా అడిగిన ప్రశ్నకు స్టాలిన్ సరిగ్గా ఇలాంటి సైగతోనే సమాధానమిచ్చారు. ఇప్పుడు విజయ్ కూడా అదే శైలిలో కౌంటర్ ఇవ్వడం ద్వారా డీఎంకే కథ ముగిసిందనే సంకేతాలు ఇచ్చారా అనే ఆసక్తికర చర్చ తమిళనాడు రాజకీయాల్లో జోరందుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *