వాన చుక్క రాలదేం?
తెలంగాణ రైతాంగం ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా మృగశిర కార్తెతో పాటు ఖరీఫ్ సీజన్‌పై ఆశలు పెట్టుకుంది. జూన్ తొలి వారం నుంచే నాగలి పట్టి, నారుమళ్లు పోసి, విత్తనాలు సిద్ధం చేసుకున్న రైతులు ఆకాశంవైపు ఎదురు చూస్తున్నారు. అయితే సాధారణంగా కనిపించే వర్షపాత చురుకుదనం ఈసారి అనేక ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో కనిపించకపోవడంతో వ్యవసాయ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వాతావరణ నిపుణులు, అంతర్జాతీయ వాతావరణ పరిశోధనా సంస్థలు, భారత వాతావరణ శాఖ విడుదల చేస్తున్న విశ్లేషణల ప్రకారం, పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్‌నినో ప్రభావం ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై ప్రభావం చూపుతున్న అంశాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది.
గాలి పీడనాల్లో మార్పులు, వాతావరణ ప్రవాహాల్లో ఏర్పడిన వ్యత్యాసాలు నైరుతి రుతుపవనాల పురోగతిపై ప్రభావం చూపుతున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సాగే ఖరీఫ్ సీజన్ ప్రారంభ దశలోనే ఇటువంటి పరిస్థితులు కనిపించడం వల్ల వ్యవసాయ రంగం, నీటి వనరుల నిర్వహణ, గ్రామీణ జీవనోపాధులపై ప్రభావం ఎంత మేరకు ఉంటుందన్న చర్చ సాగుతోంది. అయితే వాతావరణ పరిస్థితులు నిరంతరం మారుతుంటాయని, రాబోయే రోజుల్లో వర్షాల పరిస్థితిలో మెరుగుదల సంభవించే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేమని నిపుణులు చెబుతున్నారు.
ఆందోళన కలిగిస్తున్న సంకేతాలు
భారత వాతావరణ శాఖకు సంబంధించిన గణాంకాలను ఉటంకిస్తూ ప్రచురితమైన నివేదికల ప్రకారం, జూన్ 4 నుంచి జూన్ 15 వరకు దేశవ్యాప్తంగా సాధారణంగా 53.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండ గా, వాస్తవంగా 19.2 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. దీంతో దేశవ్యాప్తంగా సుమారు 64 శాతం వర్షపాత లోటు నమోదైనట్లు విశ్లేషణలు సూచిస్తున్నాయి. గణాంకాలు మొత్తం భారతదేశానికి సంబంధించినవే అయినప్పటికీ, దేశంలోని పలు రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణలోనూ వర్షాల పురోగతిపై రైతులు, వ్యవసాయ నిపుణులు, నీటి వనరుల ప్రణాళికాధికారులు దృష్టి సారిస్తున్నారు. జిల్లాలవారీగా, మండలాలవారీగా పరిస్థితులు భిన్నంగా ఉండే అవకాశం ఉన్నందున స్థానిక గణాంకాలను నిరంతరం సమీక్షించాల్సిన అవసరం ఉంది. వర్షపాతం ఆలస్యమవడం వల్ల సాగు పనుల షెడ్యూ ల్, విత్తనాల వినియోగం, నీటి అవసరాలు, వ్యవసాయ పెట్టుబడులపై ప్రభావం పడే అవకాశం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
వాతావరణ మార్పుల యుగంలో శాస్త్రీయ వ్యవసాయం
నీటి లభ్యతపై అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో రైతులు వరి సాగుకు బదులుగా తక్కువ నీటి అవసరం ఉండే పొద్దుతిరుగుడు, పత్తి, మొక్కజొన్న, ఉల్లి వంటి ప్రత్యామ్నాయ పంటలను పరిశీలించాలని ప్రభుత్వం సూచిస్తోంది. పరిమిత నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈ సూచనలు చేస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే రైతుల కోణంలో చూస్తే పరిస్థితి అంత సులభంగా కనిపించడం లేదు.
గతంలో కొన్ని ప్రత్యామ్నాయ పంటలకు మార్కెట్ అనిశ్చితి, ధరల హెచ్చుతగ్గులు, కనీస మద్దతు ధర అమలులో ఎదురైన సమస్యలు రైతుల్లో సందేహాలను పెంచిన అంశాలుగా ప్రస్తావించబడుతున్నాయి. వరికి ఉన్న మార్కెట్ భరోసా ఇతర పంటలకు సమానంగా లేదనే భావన రైతుల్లో కనిపిస్తోంది. వ్యవసాయం కేవలం రైతు కుటుంబానికే పరిమితం కాకుండా వ్యవసాయ కూలీలు, యంత్రాల యజమానులు, రవాణా రంగం, గ్రామీణ ఉపాధి వ్యవస్థతో ముడిపడి ఉండటంతో పంటల ఎంపికపై తీసుకునే నిర్ణయాలు విస్తృత ప్రభావం చూపే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
రచయిత- ఫిరోజ్ ఖాన్