Spirit Title Dispute: స్పిరిట్ టైటిల్ వివాదంలో తప్పు ఎవరిది..పిచ్చుకపై బాహుబలి దాడి తగునా..?
prabhas spirit conroversy ( AI Generated)
హీరో ప్రభాస్, అలాగే దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా మూవీ స్పిరిట్ ప్రస్తుతం టైటిల్ వివాదంలో ఇరుక్కుంది. ఇదే టైటిల్‌తో స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అనే పేరుతో ఓ చిన్న సినిమా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ తమ పేరిట ఉందని నిర్మాణ సంస్థ టీ సిరీస్ ఇప్పటికే రెండుసార్లు స్పిరిట్ ఈజ్ నాట్ వన్ నిర్మాతలకు నోటీసులు పంపింది. అయితే చిన్న నిర్మాతలు అయినటువంటి స్పిరిట్ ఈజ్ నాట్ వన్ ప్రొడ్యూసర్లు, ప్రభాస్ తమపై దయవుంచి ఈ సినిమా విడుదలకు సహకరించాలని, పెద్ద మనసు చేసుకొని తమ జీవితకాలం కల అయినటువంటి సినిమాను విడుదల చేసేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ సినిమా ప్రొడ్యూసర్ ఒక మహిళా రైతు కావడం గమనార్హం. తాము అప్పు సొప్పు చేసి 60 లక్షలు ఖర్చు చేసి ఈ సినిమా నిర్మిస్తే దర్శకుడు, నిర్మాత కలిసి రిలీజ్ అడ్డుకుంటున్నారని హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి వివరాలు తెలిపారు. సినిమా అడ్డుకుంటే ప్రభాస్ ఇంటి ముందే ఆత్మహత్య చేసుకునేందుకు కూడా వెనుకాడమని ప్రొడ్యుసర్ నర్సమ్మ హెచ్చరిక జారీ చేశారు.
అయితే నిజానికి ఈ సినిమా టైటిల్ స్పిరిట్ పేరిట టీ సిరీస్ సంస్థ మొదట హిందీ ఫిలిం చాంబర్‌లో రిజిస్టర్ చేయించుకుంది. కానీ తెలుగు ఫిలిం చాంబర్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు లేట్ చేసింది. కానీ అదే సమయంలో స్పిరిట్ ఈజ్ నాట్ వన్ సినిమా రిజిస్ట్రేషన్ చేయించుకొని, సినిమా పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఒక పాన్ ఇండియా సినిమా నిర్మిస్తున్నటువంటి టీ సిరీస్ సంస్థ అన్ని భాషల్లో టైటిల్ రిజిస్ట్రేషన్ చేయించకపోవడం అనేది, వారు చేస్తున్న ఒక పెద్ద తప్పు అని సినిమా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రొడ్యూసర్లు గ్రామీణ ప్రాంతానికి చెందిన రైతు కుటుంబానికి చెందినవారు. తమ కుమారుడు చిరకాల కోరికను తీర్చేందుకు ఆస్తులు అమ్మి, కూలి నాలి చేసి సంపాదించిన డబ్బులు సైతం పెట్టి ఈ సినిమా తీశామని, ప్రముఖ దర్శక నటుడు రవిబాబు సైతం ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించినట్లు వాళ్లు పేర్కొన్నారు. నిజానికి టీ సిరీస్ సంస్థ తెలుగులో టైటిల్ రిజిస్ట్రేషన్ చేయడానికి రెండు నెలల ముందే, ఈ చిన్న సినిమా స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అనే టైటిల్‌ను విజయవాడ ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ చిన్న సినిమా తెలంగాణ బోర్డు ద్వారా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోగానే, తమ టైటిల్‌ను వాడుకుంటున్నారని టీ సిరీస్ సంస్థ సినిమాను ఆపేయాలని లీగల్ నోటీసులను పంపింది. నిజానికి ఈ చిన్న సినిమా టైటిల్ స్పిరిట్ కాదు, స్పిరిట్ ఈజ్ నాట్ వన్. తాము ఆత్మ అనే అర్థంతో ఈ పదాన్ని వాడుతున్నాం, కాబట్టి లీగల్‌గా తమ వైపు ఎలాంటి తప్పు లేదని ఈ చిన్న సినిమా డైరెక్టర్ వాదిస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో బాహుబలి లాంటి సినిమాలు తీసి, ఆ తర్వాత అదే స్థాయిలో వరుసగా పాన్ ఇండియా సినిమాలను నిర్మించుకుంటూ పోతున్న ప్రభాస్ సినిమాకు, నిజానికి అసలు ఎవరు నటిస్తున్నారో కూడా తెలియని స్పిరిట్ ఈజ్ నాట్ వన్ అనే సినిమా అసలు పోటీ కిందికే రాదు. అయినప్పటికీ కూడా స్పిరిట్ నిర్మాతలు తమ స్థాయికి దిగజారిపోయి, చిన్న నిర్మాతల పైన పిచ్చుకపై బ్రహ్మాస్త్రం లాగా విరుచుకుపడటం ఏమాత్రం సమంజసం కాదని సినిమా విమర్శకులు చెబుతున్న మాట. మరి ప్రభాస్ దీనిపై ఎలా స్పందిస్తాడో చూడాలి.