Skip to content
తెలంగాణ వార్తలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో 15,982 అంగన్‌వాడీ పోస్టుల భర్తీ.. ఈసారి సరికొత్త నిబంధనలు..

Prajapaksham 23 Jun 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో 15,982 అంగన్‌వాడీ పోస్టుల భర్తీ.. ఈసారి సరికొత్త నిబంధనలు..

Telangana Anganwadi Jobs 2026: Teacher and Helper Vacancies Likely Soon

తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలలో సుదీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న కొలువుల భర్తీకి ఎట్టకేలకు అధికారికంగా రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో మొత్తం 15,982 అంగన్‌వాడీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆయా జిల్లాల్లోని సమగ్ర శిశు అభివృద్ధి సేవల (ICDS) ప్రాజెక్టుల వారీగా ఖాళీలను క్షుణ్ణంగా గుర్తించిన మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ, జిల్లాల వారీగా భర్తీ నోటిఫికేషన్లను విడుదల చేస్తోంది.

ఇందులో భాగంగా ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలో అంగన్‌వాడీ టీచర్‌ పోస్టులకు, అలాగే మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలోని నాలుగు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల కింద టీచర్లు, సహాయకులు (హెల్పర్లు) కలిపి మొత్తం 177 పోస్టుల భర్తీకి సంబంధిత జిల్లా కలెక్టర్లు అధికారిక ఉద్యోగ ప్రకటనలు జారీ చేశారు. ఇదే తరహాలో రాష్ట్రంలోని మిగిలిన అన్ని జిల్లాల్లోనూ వేర్వేరుగా నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. వాస్తవానికి ఈ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం ఏడాదిన్నర క్రితమే నిర్ణయించినప్పటికీ, నియామక విధానం, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న సర్వీసు నిబంధనలపై సుదీర్ఘ అధ్యయనం చేయడం వల్లే ఈ ప్రక్రియ కొంత ఆలస్యమైంది.

కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ‘సాక్ష్యం’ అంగన్‌వాడీ నిబంధనల ప్రకారం.. ఈసారి అంగన్‌వాడీ టీచర్, సహాయకుల పోస్టుల భర్తీలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేస్తూ సరికొత్త ఎంపిక విధానాన్ని తీసుకువచ్చింది. గతంలో ఉన్న అర్హతలను మారుస్తూ కనీస విద్యార్హతగా ఇంటర్మీడియట్‌ను తప్పనిసరి చేసింది. దీనితో పాటు నియామక ప్రక్రియలో పారదర్శకత కోసం ఇంటర్వ్యూ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ నూతన విధానాన్ని ఆమోదిస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో నంబర్ 4 (ఇంటర్వ్యూ అనుమతి), జీవో నంబర్ 6 (మార్కుల వెయిటేజీ)లను విడుదల చేసింది. ఈ నూతన జోనల్ నిబంధనల ప్రకారం.. మల్టీజోన్‌-1 పరిధిలోని 20,584 అంగన్‌వాడీ కేంద్రాల్లో 1,853 టీచర్లు, 7,737 సహాయకుల పోస్టులతో కలిపి మొత్తం 9,590 ఖాళీలు ఉన్నాయి. అలాగే మల్టీజోన్‌-2 పరిధిలోని 15,197 కేంద్రాల్లో 1,247 టీచర్లు, 5,145 సహాయకుల పోస్టులతో కలిపి 6,392 ఖాళీలను గుర్తించారు.

ఈ అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు స్థానికత అత్యంత ప్రధానమైన అర్హతగా నిర్ణయించారు. దరఖాస్తుదారులు తాము కోరుకునే పట్టణాలు లేదా గ్రామాల్లోని సంబంధిత వార్డు పరిధిలో తప్పనిసరిగా స్థానికులై ఉండాలి. అలాగే గిరిజన, ఆదివాసీ తండాలు, గూడేలు లేదా ఆవాసాల్లోని పోస్టులకు కేవలం స్థానిక ఎస్టీ మహిళలు మాత్రమే అర్హులు కాగా, ఎస్సీ వాడల్లోని పోస్టులకు స్థానిక ఎస్సీ మహిళలనే ఎంపిక చేస్తారు.

నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక జిల్లా ఎంపిక కమిటీ (DSC) ఏర్పాటవుతుంది. ఈ కమిటీ అభ్యర్థులకు స్వయంగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది, దీని కోసం ప్రత్యేకంగా 10 మార్కులను కేటాయించారు. అంగన్‌వాడీ టీచర్లు ,సహాయకుల పోస్టులకు ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత ప్రామాణికం అయినప్పటికీ, సహాయకుల పోస్టులకు ఒకవేళ ఇంటర్ చదివిన అభ్యర్థులు అందుబాటులో లేకపోతే మాత్రమే తదుపరి ప్రాధాన్యతగా పదోతరగతి పాసైన వారిని పరిగణనలోకి తీసుకుంటారు.

ఈ కొలువుల తుది ఎంపికలో అభ్యర్థుల ప్రతిభకు ,సామాజిక స్థితికి తగిన మార్కుల వెయిటేజీ ఇవ్వబడుతుంది. అభ్యర్థులకు ఇంటర్మీడియట్‌లో వచ్చిన మార్కులకు అత్యధికంగా 70 శాతం వెయిటేజీ ఇస్తారు. అలాగే సమాజంలో వెనుకబడిన లేదా ప్రత్యేక వర్గాలకు అండగా నిలిచేందుకు వితంతువులకు 5 శాతం, అనాథలకు 10 శాతం, ,దివ్యాంగులకు 5 శాతం అదనపు వెయిటేజీ మార్కులను కేటాయించారు. ఈ వెయిటేజీ మార్కులతో పాటు ఇంటర్వ్యూలో సాధించిన 10 మార్కులను కూడా కలిపి అభ్యర్థుల మెరిట్ జాబితాను రూపొందిస్తారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులైన మహిళా అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *