Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

ఏపీకి ఐదు రోజులపాటు భారీ వర్ష సూచన.. మరోవైపు ఖరీఫ్‌పై ఎల్ నినో ముప్పు!

Prajapaksham 18 Jun 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
ఏపీకి ఐదు రోజులపాటు భారీ వర్ష సూచన.. మరోవైపు ఖరీఫ్‌పై ఎల్ నినో ముప్పు!

Rain Fury Hits Hyderabad,Several Telangana Districts Under Yellow Alert as Heavy Rain Continues

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రాబోయే ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ప్రస్తుతం తూర్పు విదర్భ నుండి ఆంధ్రప్రదేశ్ మీదుగా ఒక ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో సముద్ర వాతావరణం కూడా తీవ్ర అలజడిగా మారే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా ఉత్తర కోస్తా తీర ప్రాంతంలో వాతావరణం అనుకూలంగా లేనందున, రాబోయే ఐదు రోజుల పాటు మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక గడిచిన 24 గంటల్లో విజయనగరం జిల్లా వేపాడలో అత్యధికంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ స్పష్టం చేసింది.

ఒకవైపు రాష్ట్రంలో వర్ష సూచన ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌పై ‘ఎల్ నినో’ ప్రభావం తీవ్రంగా ఉండబోతోందని కేంద్ర వ్యవసాయ శాఖ హెచ్చరించింది. భారతదేశంలో రుతుపవనాలు బలహీనపడటానికి కారణమయ్యే ఈ ఎల్ నినో ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశంలోని 12 రాష్ట్రాలపై గట్టిగా పడే అవకాశం ఉందని కేంద్రం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, గుజరాత్, రాజస్తాన్, బిహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఎల్ నినో ముప్పు తీవ్రతను తగ్గించడానికి అన్ని విభాగాలూ సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఈ ఏడాది (ఖరీఫ్-2026) సాగు ఏర్పాట్లపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఎల్ నినో ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న రాష్ట్రాల్లోని సంబంధిత జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ శాఖలు, కృషి విజ్ఞాన కేంద్రాలు ,ఇతర ప్రభుత్వ విభాగాలతో తక్షణమే సమన్వయ సమావేశాలను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

వర్షపాతం తక్కువగా నమోదయ్యే జిల్లాలను ముందుగానే గుర్తించి, అక్కడ అత్యవసర ప్రణాళికలను సిద్ధం చేసి అమలు చేయాలని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. వర్షపాతంలో లోటు ఏర్పడితే దానికి అనుగుణంగా తక్కువ నీటితో పండే పత్తి, పప్పుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచేలా రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. ఈ ఏడాదికి సంబంధించి ఎల్ నినో ప్రభావం పడబోయే 12 రాష్ట్రాల్లోని మొత్తం 326 జిల్లాలకు గాను ప్రత్యేక అత్యవసర ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *