Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

వైఎస్సార్సీపీ ఫేస్‌బుక్‌ పేజీ బ్లాక్‌.. హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రాజ్యాంగ విరుద్ధమంటూ పిటిషన్..

Prajapaksham 17 Jun 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
వైఎస్సార్సీపీ ఫేస్‌బుక్‌ పేజీ బ్లాక్‌.. హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రాజ్యాంగ విరుద్ధమంటూ పిటిషన్..

YSRCP Begins Legal Battle Over Facebook Page Blocking

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) అధికారిక ఫేస్‌బుక్ పేజీని భారతదేశంలో అందుబాటులో లేకుండా నిలిపివేయడంపై ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయపోరాటానికి దిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కేందుకే ఈ దుశ్చర్యకు పాల్పడిందని ఆరోపిస్తూ, వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

గత జూన్ 9న (2026) వైఎస్సార్‌సీపీ అధికారిక ఫేస్‌బుక్ పేజీని భారతదేశంలో ఎవరికీ కనిపించకుండా మెటా సంస్థ నిలిపివేసింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 79(3)(బీ) కింద ప్రభుత్వం, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీల నుండి వచ్చిన నోటీసు ఆధారంగానే ఈ చర్య తీసుకున్నట్లు మెటా పేర్కొంది. అయితే, ఏ ప్రభుత్వ అధికారి ఈ ఉత్తర్వులు ఇచ్చారు? ఏ నిర్దిష్ట కంటెంట్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు? అనే వివరాలను కానీ, ఆ నోటీసుల అసలు ప్రతులను కానీ తమకు అందజేయకపోవడంపై వైఎస్సార్‌సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. నిబంధనల ప్రకారం ప్రభుత్వ నోటీసు నకలును ఖాతాదారుడికి అందించాల్సిన బాధ్యత మెటా సంస్థపై ఉందని, దీనిని దాచడం చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్‌లో పేర్కొన్నారు.

గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ‘శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ తీర్పును ఉటంకిస్తూ.. ప్రభుత్వ నోటీసులను సాకుగా చూపి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు తమ ఇష్టానుసారంగా వ్యవహరించకూడదని లేళ్ల అప్పిరెడ్డి గుర్తుచేశారు. ఈ బ్లాకింగ్ ప్రక్రియ ప్రభుత్వ ‘సహయోగ్ పోర్టల్’ ద్వారా జరిగిందని భావిస్తున్నామని, అయితే సదరు నోటీసు ఇచ్చిన సంస్థకు చట్టబద్ధమైన అధికారాలు ఉన్నాయా లేదా అనే విషయాలను దాచారని ఆరోపించారు. ఒక తటస్థ వేదికగా ఉండాల్సిన మెటా సంస్థ, ఏపీలోని అధికార పార్టీకి సహకరిస్తూ ప్రతిపక్ష పార్టీ గొంతు నొక్కడానికి చట్ట పరిధిని మించి వ్యవహరించిందని దుయ్యబట్టారు.

లక్షలాది మంది ఫాలోవర్లు, ప్రజలతో కమ్యూనికేట్ చేయడం ఒక రాజకీయ పార్టీగా తమ ప్రాథమిక హక్కు అని, ముందస్తు నోటీసు లేదా సంజాయిషీ ఇచ్చుకునే అవకాశం కూడా ఇవ్వకుండా రాత్రికి రాత్రే పేజీని బ్లాక్ చేయడం రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛను హరించడమేనని పిటిషనర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ ఏదైనా నిర్దిష్ట పోస్ట్ లేదా వీడియో చట్టవిరుద్ధంగా ఉంటే కేవలం దానిని మాత్రమే తొలగించవచ్చు కానీ, ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన మొత్తం ఫేస్‌బుక్ పేజీని బ్లాక్ చేయడం అన్యాయమన్నారు.

ఈ పిటిషన్‌లో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, మెటా ప్లాట్‌ఫామ్ ఇంక్, ఆంధ్రప్రదేశ్ హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యం తేలేంతవరకు, బ్లాకింగ్‌కు దారితీసిన ప్రభుత్వ నోటీసులు, కమ్యూనికేషన్ల కాపీలను తక్షణమే తమకు సమర్పించేలా మెటా సంస్థను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని వైఎస్సార్‌సీపీ కోర్టును అభ్యర్థించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *