Skip to content
సంపాదకీయం వార్తలు

ట్రంప్‌ పేరుపై మమకారమెందుకు?

Prajapaksham 19 Jun 2026 1 నిమిషాల పఠనం సంపాదకీయం
ట్రంప్‌ పేరుపై మమకారమెందుకు?

Why Does Trump’s Name Continue to Draw Attention?

తన దుందుడుకు చేష్టలతో యావత్‌ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న అమెరికా దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేరుతో హైదరాబాద్‌ వీధుల్లో ఒక దానికి నామకరణం చేయాలని తలపెట్టడం చర్చనీయాంశంగా మారింది. నానక్‌రామ్‌ గూడలోని అమెరికా కాన్సులేట్‌ కార్యాలయానికి ఆనుకొని ఉన్న కీలక రహదారికి ఆయన పేరు పెట్టాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించుకున్నారు. ఈ రహదారికి ‘డొనాల్డ్‌ ట్రంప్‌ ఎవెన్యూ’గా జూన్‌ 23న అధికారికంగా నామకరణం చేసేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మానవాళికి మేలు చేసిన వ్యక్తులు, చరిత్ర పురుషులు, వివిధ రంగాల ప్రముఖులను భావి తరాలు గుర్తుంచుకునేలా వారి పేర్లను స్మారకాలు, ప్రదేశాలు, రహదారులు, భవనాలు, సంస్థలకు పెట్టడం కొత్తేమీ కాదు. హైదరాబాద్‌, సికిందరాబాద్‌ను అనుసంధానించే రహదారికి దేశస్వాతంత్య్రోద్య మానికి నేతృత్వం వహించిన మహాత్మాగాంధీ పేరుతో నామకరణం చేశారు. మహానగరం చుట్టూ మణిహారం లాంటి ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ పేరు పెట్టారు. అలాగే తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు పేరును మెహదీపట్నం నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్ళే ఎక్స్‌ప్రెస్‌ హైవేకి నామకరణం చేశారు. ఇటీవల కొత్త ఫ్లుఓవర్‌ ఒకదానికి పూర్వ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ పేరుతో జాతికి అంకితం చేశారు. హైదరాబాద్‌లో తుది శ్వాస విడిచిన ప్రఖ్యాత గాయకుడు ఉస్తాద్‌ బడే గులామ్‌ అలీ ఖాన్‌ పేరును బషీర్‌బాగ్‌ ప్రధాన రోడ్డుకు నామకరణం చేయడం తెలిసిందే. అలాగే ప్రాణాంతక మలేరియా దోమల ద్వారా వ్యాప్తి చెందుతుందని సికిందరాబాద్‌లోనే కనుగొని ప్రపంచానికి గొప్ప మేలు చేసిన బ్రిటీష్‌ డాక్టర్‌ సర్‌ రొనాల్డ్‌ రాస్‌ను ఈ గడ్డ గౌరవించింది. ఆయన పరిశోధన చేసిన పాత బేగంపేటలోని మిలిటరి ఆసుపత్రికి సర్‌ రొనాల్డ్‌ రాస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పారాసైటాలజీ అని నామకరణం చేసింది.

ఏ కోణంలో చూసినా హైదరాబాద్‌లోని రహదారికి ట్రంప్‌ పేరు పెట్టడం యోగ్యత కలిగిన నిర్ణయం అనిపించుకోదు. ప్రజాకంటక నిర్ణయాల ద్వారా స్వదేశంలోనే అత్యంత తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు ఈ అమెరికా అధ్యక్షుడు. ఆ దేశ ప్రధాన నగర వీధుల్లో ఇప్పటికే పలుమార్లు ట్రంప్‌కు వ్యతిరేకంగా భారీ ప్రదర్శనలు జరిగాయి. తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ప్రపంచ దేశాలపై అడ్డగోలు టారిఫ్‌లను విధించటమే కాకుండా, ఇజ్రాయెల్‌ తో జతకట్టి ఇరాన్‌పై అనైతిక యుద్ధానికి దిగిన జగడాల మారి. ఏకంగా ఒక సర్వసత్తాక దేశాధ్యక్షుడైన నికోలస్‌ మదురోను అర్థరాత్రి ఆయన భార్యతో సహా వెనిజులా నుంచి అమెరికా దళాలు అపహరించుకుపోయిన దుర్నీతిని ప్రపంచం చూచింది.

ట్రంప్‌ రెండవ దశ పరిపాలనలో భారతదేశానికి చేసిన నష్టాలు, అవమానాలు అంతులేనివి. మన దేశ ఎగుమతులపై పదే పదే అడ్డగోలుగా టారిఫ్‌లను విధించటంతో స్థానికంగా వివిధ పరిశ్రమలు కుదేలయ్యాయి. భారత పాకిస్థాన్‌ యుద్ధాన్ని తానే ఆపానని ఇప్పటికే యాభై సార్లకు పైగా చెప్పుకొని మన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని ట్రంప్‌ మసకబార్చారు. ఇరాన్‌పై అమెరికా యుద్ధం, హోర్మూజ్‌ మూసివేత ద్వారా భారత్‌ సహా, ప్రపంచ దేశాలన్నీ ఇంధన కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి.

ధరల పెరుగుదలతో సామాన్యుల నడ్డి విరుగుతున్నది. అన్నిటికీ మించి భారతదేశ ఆహ్వానంపై నావిక కసరత్తు ‘మిలాన్‌’లో పాల్గొని విశాఖపట్నం నుంచి తిరిగి వెళ్తున్న ఇరాన్‌ నౌకపై అమెరికా టార్పెడో దాడితో 87 మంది నావికులను బలికొనడాన్ని ఎలా మరచిపోగలం? తాజాగా హోర్మూజ్‌ వద్ద వాణిజ్య నౌకలపై అమెరికా డ్రోన్‌ దాడులలో ముగ్గురు భారతీయుల దుర్మరణం వార్త ఇంకా కసిరేపుతూనే ఉంది. వీటన్నిటికి కారణం ట్రంప్‌ పాలన గైకొన్న నిర్ణయాలే కదా! ఆయన హయాంలో అవలంభిస్తున్న జాత్యాహంకార, సామ్రాజ్యవాద, అప్రజాస్వామిక చర్యలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను బెంబేలెత్తిస్తున్న చపలచిత్త నిర్ణయాలు నిస్సందేహంగా చరిత్రలో చీకటి కోణాలుగా నిలిచిపోతాయి.

అమెరికా కాన్సులేట్‌ వద్ద రహదారికి ట్రంప్‌ పేరు పెట్టాలనే ప్రతిపాదన గత ఏడాది డిసెంబర్‌లోనే తెరపైకి వచ్చింది. దానిపై అప్పట్లోనే వ్యతిరేకత వ్యక్తమైంది. సిపిఐ శాసనసభా పక్ష నాయకుడు కూనంనేని సాంబశివరావు శాసనసభ సమావేశాలలోనే ట్రంప్‌ పేరు పెట్టవద్దని ప్రభుత్వానికి సూచించారు. అయినప్పటికీ, ప్రభుత్వం ముందుకు సాగుతూ ఈ నెల 23న నామకరణానికి సిద్ధమైనట్లు వార్తలు వచ్చాయి. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వమే రహదారికి ట్రంప్‌ పేరు పెడుతుంటే అమెరికాకు మోదీ సరెండర్‌ అయ్యాడని నిత్యం విమర్శించే ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారంటూ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు రాంచందర్‌రావు ఇప్పటికే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.

నిజంగా హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ వద్ద రహదారికి అమెరికా ముఖ్యుడి పేరు పెట్టాలనుకుంటే ఇతర ప్రత్యామ్నాయాలు అనేకం ఉన్నాయి. అందులో ఆ దేశ మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌ ఒకరు. అమెరికాను ముక్కలవ్వకుండా కాపాడి, బానిసత్వాన్ని రద్దుచేసిన మహోన్నత వ్యక్తి. ‘ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కోసం నడిచే ప్రభుత్వం భూమిపై నశించదు’ అని ప్రజాస్వామ్యం గురించి గొప్పగా నిర్వచించిన రాజనీతిజ్ఞుడు లింకన్‌. రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటున్న రహదారికి లింకన్‌ పేరు పెడితే బహుశా ఎవరికీ అభ్యంతరం ఉండకపోవచ్చు. పైగా మంచి పేరు సైతం దక్కుతుంది. కాబట్టి పునరాలోచన అవశ్యం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *