Skip to content
జాతీయం వార్తలు

సికిల్‌ సెల్‌ రుగ్మతతో తీవ్ర రక్తహీనత

Prajapaksham 19 Jun 2026 1 నిమిషాల పఠనం జాతీయం
సికిల్‌ సెల్‌ రుగ్మతతో తీవ్ర రక్తహీనత

Sickle Cell Disease and the Burden of Severe Anemia

(19 జూన్‌ ప్రపంచ సికిల్‌ సెల్‌ అవగాహన దినం సందర్భంగా)

తల్లిదండ్రుల నుంచి సంక్రమించే జన్యులోప రుగ్మతగా సికిల్‌ సెల్‌ రక్తహీనత ప్రమాదకరంగా మారుతోంది. శరీర కణజాలానికి ప్రాణవాయువు, ఆక్సిజెన్‌ను అందించే రక్తంలోని ఎర్ర రక్త కణాలతో కూడిన హీమోగ్లోబిన్‌ ఉపకరిస్తుంది. ఆక్సిజన్‌ను సరఫరా చేస్తున్న ఎర్ర రక్త కణాలు గుండ్రంగా, మృదువుగా, ఫ్లెగ్జిబుల్‌గా ఉంటూ రక్త నాళాల గుండా సులభంగా ప్రవహిస్తూ, మన ఆరోగ్యానికి పునాదులు వేస్తున్నాయి. సికిల్‌ సెల్‌ రుగ్మత బారిన పడిన వ్యక్తుల ఎర్ర రక్త కణాలు దృఢంగా, గట్టిగా, అంటుకునే గుణంతో, సి-ఆకారంలో కొడవలి లేదా సికిల్‌ ఆకారంలో ఉంటాయి. ఆ సికిల్‌ కణాలు రక్తనాళాల్లో సులభంగా ప్రవహించకుండా, త్వరగా చనిపోతూ ఉంటాయి. ఇలాంటి సికిల్‌ సెల్‌ రుగ్మత ఉన్న వారిలో దీర్ఘకాలిక రక్తహీనత, నొప్పులు, అవయవాలకు హాని, ఇతర తీవ్రమైన అనారోగ్యాలను కలిగిస్తుంది. దీనినే సికిల్‌ సెల్‌ రుగ్మతగా పిలవడం జరుగుతోంది.

ప్రపంచ సికిల్‌ సెల్‌ అవగాహన దినం-2026 ఇతివృత్తం:
సికిల్‌ సెల్‌ రక్త రుగ్మత పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం, ముందస్తు పరీక్షలతో గుర్తించడం, వ్యాధిగ్రస్తుల పట్ల జాగ్రత్తలు తీసుకోవడం, రోగుల కుటుంబాల్లో ఆత్మ విశ్వాసం పెంచడం లాంటి కార్యక్రమాలను నిర్వహించడానికి ఐరాస ఆమోదంతో ప్రతి ఏట 19 జూన్‌ రోజున ప్రపంచ సికిల్‌ సెల్‌ అవగాహన దినం (వరల్డ్‌ సికిల్‌ సెల్‌ అవేర్‌నెస్‌ డే) పాటించడం ఆనవాయితీగా మారింది. 2026 ప్రపంచ సికిల్‌ సెల్‌ అవగాహన దినం ఇతివృత్తంగా జీవన అవకాశాల అంతరాలను తగ్గించడం: సికిల్‌ సెల్‌ వ్యాధిలో సమానత్వం (క్లోజింగ్‌ ది సర్వైవల్‌ గ్యాప్‌ : ఈక్విటీ ఇన్‌ సికిల్‌ సెల్‌ డిసీజ్‌) అనబడే అంశాన్ని తీసుకొని ప్రచారం నిర్వహిస్తున్నారు.

భారత్‌లో సికిల్‌ సెల్‌ భారం: భారత గిరిజన తెగల్లో అత్యధికంగా కనిపిస్తున్న సికిల్‌ సెల్‌ వ్యాధి ప్రమాదకరంగా మారుతోంది. 2011 వివరాల ప్రకారం 8.6 శాతం గిరిజన జనాభా లేదా 67.8 మిలియన్ల అభాగ్యులు సికిల్‌ సెల్‌ రుగ్మత బారిన పడ్డట్లు స్పష్టం అవుతున్నది. భారతదేశంలో ఎంపీ, ఛత్తీస్‌ఘడ్‌, జార్ఖండ్‌, ఒడిసా, గుజరాత్‌, మహారాష్ట్ర లాంటి 17 రాష్ట్రాలు/యుటిల్లో అధికంగా సికిల్‌ సెల్‌ వ్యాధిగ్రస్థులు కనిపిస్తున్నారు. వ్యాధి తీవ్రతను గుర్తించిన భారత ప్రభుత్వం జాతీయ సికిల్‌ సెల్‌ రక్తహీనత నిర్మూలన మిషన్‌ను తీసుకోని 2047 నాటికి ఈ వ్యాధిని నిర్మూలించడానికి పథక రచన చేసి అమలు పరుస్తున్నారు. ఈ మిషన్‌లో భాగంగా 2026 నాటికి 7 కోట్ల గిరిజనులకు నిర్థారణ పరీక్షలు నిర్వహించడానికి కృషి జరుగుతోంది.

సికిల్‌ సెల్‌ వ్యాధికి కారణాలు: జన్యువుల్లో మ్యుటేషన్‌ లేదా ఒకదానితో మరొకటి మార్పు చెందడం వల్ల హిమోగ్లోబిన్‌ ఉత్పత్తిలో లోపం జరుగుతుంది. తల్లిదండ్రులు ఇద్దరిలో ఇలాంటి జన్యు లోపాలు ఉన్నట్లు అయితే వారి సంతానానికి కూడా సికిల్‌ సెల్‌ రుగ్మత సంక్రమిస్తుంది. తల్లిదండ్రుల్లో ఒక్కరికి మాత్రమే జన్యు లోపం ఉన్నట్లైతో పిల్లల్లో జన్యు లోపాలు కనిపించినప్పటికీ రోగ లక్షణాలు మాత్రం కనిపించకపోవచ్చని తెలుసుకోవాలి. సికిల్‌ సెల్‌ వ్యాధులు (హీమోగ్లోబిన్‌-ఎస్‌ఎస్‌, ఎస్‌ఐ, ఎస్‌ బీటా -తలసేమియా లాంటివి) పలు రకాలుగా ఉంటాయని, వీటిని త్వరగా గుర్తించడం వల్ల వ్యక్తుల జీవితాల్లో ఆరోగ్యాన్ని మెరుగు పరచవచ్చని, ఆరోగ్య సురక్ష గొడుగు పట్టవచ్చని తెలుసుకోవాలి.