Skip to content
లైఫ్ స్టైల్ వార్తలు

ఎడా పెడా ప్రోటీన్ పౌడర్లు తాగేస్తున్నారా…అయితే ప్రమాదమే..రోజుకి ఎంత ప్రోటీన్ ఆహారంలో తీసుకుంటే మంచిది..?

Prajapaksham 04 Aug 2026 1 నిమిషాల పఠనం లైఫ్ స్టైల్
ఎడా పెడా ప్రోటీన్ పౌడర్లు తాగేస్తున్నారా…అయితే ప్రమాదమే..రోజుకి ఎంత ప్రోటీన్ ఆహారంలో తీసుకుంటే మంచిది..?

ఎడా పెడా ప్రోటీన్ పౌడర్లు తాగేస్తున్నారా...అయితే ప్రమాదమే..రోజుకి ఎంత ప్రోటీన్ ఆహారంలో తీసుకుంటే మంచిది..?

జిమ్‌కు వెళ్లేవారైనా, బరువు తగ్గాలనుకునేవారైనా ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో ఎక్కువ ప్రోటీన్‌ను చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి అనుగుణంగా రకరకాల ప్రోటీన్ సప్లిమెంట్లు కూడా మార్కెట్‌ను ముంచెత్తాయి. శరీరానికి అధిక ప్రోటీన్ అవసరమే అన్న నమ్మకం బలపడుతున్న నేపథ్యంలో, తాజాగా వెలువడిన ఓ అధ్యయనం ఈ ధోరణిపై కీలక ప్రశ్నలు లేవనెత్తింది.

సెల్ ప్రెస్ జర్నల్‌లోని సెల్ రిపోర్ట్స్లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం, ప్రతి ఒక్కరూ అధిక మొత్తంలో ప్రోటీన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. చాలా సందర్భాల్లో పరిమిత స్థాయిలో ప్రోటీన్ తీసుకోవడం జీవక్రియ ఆరోగ్యం, దీర్ఘాయువు, ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి మరింత ప్రయోజనకరంగా ఉంటుందని పరిశోధకులు వెల్లడించారు.

అధ్యయన రచయితలు బెయిలీ ఎ. నౌఫ్, డడ్లీ డబ్ల్యూ. లామింగ్ మాట్లాడుతూ, ఇటీవలి కాలంలో అధిక ప్రోటీన్ ఆహారాలపై ఆసక్తి విపరీతంగా పెరిగిందన్నారు. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు, జిమ్‌కు వెళ్లేవారు, కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రోటీన్ తీసుకోవడంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారని తెలిపారు. అయితే, అధిక ప్రోటీన్ తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిది కాదని తాజా శాస్త్రీయ ఆధారాలు సూచిస్తున్నాయి. శరీర అవసరాలకు అనుగుణంగా మాత్రమే ప్రోటీన్ తీసుకోవాలని వారు పేర్కొన్నారు.

అధిక ప్రోటీన్ తీసుకుంటే ఏమవుతుంది?

అధిక ప్రోటీన్ ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలోని mTORC1 అనే వ్యవస్థ అతిగా ఉత్తేజితమవుతుంది. సాధారణంగా ఇది కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కానీ నిరంతరం చురుకుగా ఉండటం వల్ల కణాలు తమను తాము శుభ్రపరుచుకోవడం, దెబ్బతిన్న భాగాలను మరమ్మతు చేసుకోవడం వంటి సహజ ప్రక్రియలు సమర్థంగా జరగవు. దీంతో శరీరం అవసరమైన మరమ్మతుల కంటే నిరంతర వృద్ధి ప్రక్రియపైనే దృష్టి పెట్టి, దీర్ఘకాలంలో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

ప్రోటీన్‌ను పూర్తిగా మానేయాలా?

అసలు కాదు. ప్రోటీన్‌ను పూర్తిగా తొలగించాలని ఈ అధ్యయనం ఎక్కడా సూచించడం లేదు. కొన్ని నిర్దిష్ట అమైనో ఆమ్లాలు, ముఖ్యంగా మెథియోనిన్ తీసుకునే పరిమాణాన్ని తగ్గించడం వల్ల ప్రయోజనాలు ఉండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అంటే, ప్రోటీన్‌ను పూర్తిగా వదిలేయడం కాదు.. సరైన రకం, సరైన మోతాదులో తీసుకోవడమే ముఖ్యమని స్పష్టం చేస్తున్నారు.

రోజుకు ఎంత ప్రోటీన్ అవసరం?

ఈ అధ్యయనం ప్రకారం, శరీర బరువులో ప్రతి కిలోగ్రాముకు 1.2 నుంచి 1.6 గ్రాముల ప్రోటీన్ తీసుకోవడం సరిపోతుంది. ప్రతి ఒక్కరికీ ఒకే విధమైన అధిక ప్రోటీన్ ఆహారం అవసరం లేదనే విషయాన్ని ఈ అధ్యయనం మరోసారి గుర్తు చేస్తోంది. ముఖ్యంగా వైద్యుల లేదా పోషకాహార నిపుణుల సలహా లేకుండా అధిక ప్రోటీన్ సప్లిమెంట్లు లేదా ప్రోటీన్ ఆహారం తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

ట్యాగ్‌లు: Health news