ఆడలేక మద్దెల ఓడు..
Education Under Scrutiny as Exam Leaks Raise Concerns
విద్యా, ఉద్యోగ పరీక్షా పేపర్లు లీక్ కావడం ఆనవాయితీగా మారింది. బాధ్యత వహించాల్సిన విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను విద్యార్థిలోకం డిమాండ్ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. సమస్య మూలాలను పట్టించుకోవడం లేదని మరోసారి రుజువైంది. జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష (నీట్) వంటి అత్యంత కీలకమైన పోటీ పరీక్ష పేపర్ లీక్‌కు కారణాలు లోతుగా వెతక్కుండా, కొన్ని అరెస్టులతో సరిపెట్టి వాటిని పంపడానికి ఉపయోగించిన ‘టెలిగ్రామ్’పై పునఃపరీక్ష సందర్భంగా తాత్కాలిక కాలనిషేధం విధించడం విచిత్రం.
నీట్ లాంటి పరీక్షలకు ఏటా లక్షలాది మంది విద్యార్థులు తమ భవిష్యత్తును పణంగా పెట్టి సిద్ధమవుతారు. ఒక మధ్యతరగతి కుటుంబం తమ పిల్లల వైద్య విద్య కలను సాకారం చేయడానికి సంవత్సరాల తరబడి ఆర్థికంగా, మానసికంగా ఎన్నో త్యాగాలు చేస్తుంది. విద్యార్థులు పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడి చదువుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రశ్నాపత్రాల లీకేజీలు జరుగుతున్నాయనే వార్తలు బయటకు రావడం కేవలం ఒక పరీక్షా వ్యవస్థ వైఫల్యం మాత్రమే కాదు, దేశ యువత భవిష్యత్తుపై జరిగిన దాడిగా పరిగణించాలి.
ఇటీవల నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంతో సంబంధం ఉందనే కారణంతో టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధం విధించాలనే ప్రభుత్వ నిర్ణయం తీవ్ర చర్చకు దారి తీస్తున్నది. ఒక యాప్‌ను నిషేధించడం ద్వారా ప్రశ్నాపత్రాల లీకేజీ అనే మహమ్మారిని నిజంగా అరికట్టగలమా? అనేది ప్రశ్న. టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చను మరింత విస్తృతం చేస్తున్నాయి. ఆయన వాదన ప్రకారం, టెలిగ్రామ్‌ను నిషేధించడం ద్వారా సమస్యకు మూలకారణాన్ని పరిష్కరించడం లేదు.
ప్రశ్నాపత్రాలను లీక్ చేసిన వారిని పట్టుకోవడం బదులు, కోట్లాది మంది సాధారణ వినియోగదారులను ప్రభుత్వం శిక్షిస్తున్నది. ఈ వాదనలో ఒక ముఖ్యమైన సత్యం ఉంది. సాంకేతిక వేదికలు కేవలం సాధనా లు మాత్రమే. ఒక నేరం టెలిగ్రామ్‌లో జరిగితే అదే నేరం వాట్సాప్‌లో, సిగ్నల్ లో, డిస్కార్డ్లో, ఇమెయిల్ ద్వారా లేదా సాధారణ ఫోన్ కాల్స్ ద్వారా కూడా జరగవచ్చు. ఒక వేదికను నిషేధించడం వల్ల నేరగాళ్లు అదృశ్యమవరు. వారు మరొక మార్గాన్ని ఎంచుకుంటారు. కానీ నిజాయితీగా చదువుకుంటున్న లక్షలాదిమంది విద్యార్థులు మాత్రం తమ చదువు సామగ్రిని, చర్చా వేదికలను, నోట్స్‌ను, వీడియోలను కోల్పోతారు. ఇక్కడ, సమస్యను దాని లక్షణాల ద్వారా చూస్తున్నాం గానీ మూలకారణాలను గుర్తించడంలో విఫలమవుతున్నాం.
ప్రశ్నాపత్రం పరీక్షకు ముందే బయటకు రావడం అంటే అది ఏదో ఒక స్థాయి లో ఉన్న అధికారిక వ్యవస్థ నుంచే బయటకు వెళ్లిందని అర్థం. ప్రశ్నాపత్రం తయారీ, ముద్రణ, రవాణా, నిల్వ, పంపిణీ వంటి ప్రతి దశలో అనేక మంది వ్యక్తులు, సంస్థలు పాల్గొంటాయి. ఈ గొలుసులో ఎక్కడో ఒకచోట భద్రతా వైఫల్యం జరుగుతోంది. అటువంటి వైఫల్యాన్ని గుర్తించి సరిదిద్దకుండా కేవలం సమాచార మార్పిడి సాధనాలను నిందించడం సమస్యను మరింత సంక్లిష్టం చేస్తుంది. ప్రస్తుతం దేశంలో పోటీ పరీక్షల చుట్టూ ఏర్పడిన పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది. నీట్ మాత్రమే కాదు, వివిధ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు, పోలీస్ నియామక పరీక్షలు, ఉపాధ్యాయ నియామక పరీక్షలు, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు, బ్యాంకింగ్ పరీక్షలు వంటి అనేక పరీక్షలు గత కొన్నేళ్లుగా లీకేజీల ఆరోపణలతో వార్తల్లో నిలుస్తున్నాయి.
కొన్ని సందర్భాల్లో పరీక్షలు రద్దయ్యాయి. మరికొన్ని సందర్భాల్లో మళ్లీ నిర్వహించారు. కానీ ప్రతి రద్దు వెనుక వేలాది కుటుంబాల ఆవేదన దాగి ఉంటుంది. పరీక్ష కోసం సంవత్సరాల పాటు సిద్ధమై, కోచింగ్ కేంద్రాల్లో లక్షల రూపాయ లు ఖర్చు చేసి, తమ జీవితంలోని అత్యంత విలువైన సమయాన్ని వెచ్చించిన విద్యార్థులకు పరీక్ష రద్దు అనేది అశనిపాతం. అది వారి జీవిత ప్రణాళికను ఛిద్రం చేసే దుర్మార్గం. ఈ పరిస్థితి విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
ఇప్పటికే భారతదేశంలో విద్యా పోటీ అత్యంత తీవ్రమైన స్థాయికి చేరుకుంది. వైద్య విద్యలో ఒక సీటు కోసం లక్షల మంది పోటీ పడుతున్నారు. విద్యార్థులు తీవ్ర ఒత్తిడిలో జీవిస్తున్నారు. ఇలాంటి సమయం లో పరీక్షా వ్యవస్థపై నమ్మకం కోల్పోతే వారి మానసిక స్థితి మరింత దెబ్బతింటుంది. కొన్ని సందర్భాల్లో విద్యార్థులు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఒక ప్రశ్నాపత్రం లీక్ కావడం వల్ల కేవలం పరీక్ష మాత్రమే దెబ్బతినదు… ఒక విద్యార్థి తన కష్టానికి విలువ లేదనే భావనకు లోనవుతాడు. నిజాయితీగా చదివినా, ప్రతిభ ఉన్నా, చివరికి అవినీతి, అక్రమాలే విజయం సాధిస్తున్నాయనే నిరాశ అతనిని మానసికంగా కుంగదీస్తుంది. ప్రజాస్వామ్యంలో పరీక్షా వ్యవస్థ అనేది సామాజిక న్యాయానికి అత్యంత ముఖ్యమైన సాధనం.
పేదవాడు, ధనవంతుడు, గ్రామీణుడు, పట్టణవాసి అనే తేడా లేకుండా అందరికీ సమాన అవకాశాన్ని కల్పించే వేదికగా పరీక్షలు ఉండాలి. కానీ ప్రశ్నాపత్రాల లీకేజీలు జరుగుతున్నప్పుడు ఆ సమానత్వ సూత్రం పూర్తిగా కూలిపోతుంది. డబ్బు, రాజకీయ ప్రభావం లేదా అక్రమ నెట్‌వర్క్‌లకు ప్రాప్యత ఉన్నవారు ముందుకు వెళ్తారు. నిజాయితీగా కష్టపడిన విద్యార్థులు వెనుకబడిపోతారు. దీని ఫలితం గా సమాజంలో ప్రతిభ కంటే అవినీతి ఎక్కువ ఫలితాలను ఇస్తుందనే ప్రమాదకరమైన సందేశం వ్యాపిస్తుంది. టెలిగ్రామ్‌పై నిషేధం విషయంలో కూడా ఇదే ప్రశ్న తలెత్తుతుంది. ఒకవేళ లీక్ అయిన ప్రశ్నాపత్రాలు నిజంగానే టెలిగ్రామ్ ద్వారా వ్యాపించాయని అనుకుందాం.
అయినప్పటికీ, ఆ ప్రశ్నాపత్రం మొదట బయటకు ఎలా వచ్చింది? ఎవరు దానిని లీక్ చేశారు? ఏ అధికారుల నిర్లక్ష్యం లేదా కుమ్మక్కు వల్ల అది సాధ్యమైంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు కనుగొనకుండా కేవలం పంపిణీ మాధ్యమాన్ని నిషేధించడం అనేది వ్యాధి మూలాన్ని వదిలి లక్షణాలకు మాత్రమే చికిత్స చేయడంలాంటిది. గాయం లోతుగా ఉన్నప్పుడు పైపైగా కట్టుకట్టడం వల్ల అది నయం కాదు. డిజిటల్ యుగంలో సమాచార ప్రవాహాన్ని పూర్తిగా అడ్డుకోవడం దాదాపు అసాధ్యం. కాబట్టి సాంకేతిక నిషేధాల కంటే వ్యవస్థాగత సంస్కరణలే ఎక్కువ ఫలితాలను ఇస్తాయి. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి మొదటగా పరీక్షా వ్యవస్థలో సంపూర్ణ పారదర్శకత అవసరం.
ప్రశ్నాపత్రాల తయారీ నుంచి పరీక్షా కేంద్రాలకు చేరే వరకు ప్రతి దశను డిజిటల్ ట్రాకింగ్ పరిధిలోకి తీసుకురావాలి. కృత్రిమ మేధస్సు, బ్లాక్‌చైన్ వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి ప్రశ్నాపత్రాల భద్రతను మరింత బలోపేతం చేయవచ్చు. అదేవిధంగా, ప్రశ్నాపత్రాల లీకేజీని సాధారణ నేరంగా కాకుండా దేశ భవిష్యత్తుపై దాడిగా పరిగణించేలా కఠినమైన చట్టపరమైన చర్యలు అవసరం. లీకేజీలకు పాల్పడిన వ్యక్తు లు మాత్రమే కాకుండా, వారిని రక్షించే అధికారులు, మధ్యవర్తులు, కోచింగ్ మాఫియాలు, రాజకీయ ఆశ్రయం కల్పించే వ్యక్తులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. విచారణలు వేగంగా పూర్తయ్యే ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలి. సంవత్సరాల తరబడి కేసులు సాగితే నిరోధక ప్రభావం ఉండదు.