Skip to content
ప్రపంచం వార్తలు

మిత్రదేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచిన ఇరాన్ ఒప్పందం.. ఇజ్రాయెల్ నేతలకు జేడీ వాన్స్ ఘాటు హెచ్చరిక..

Prajapaksham 19 Jun 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
మిత్రదేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచిన ఇరాన్ ఒప్పందం.. ఇజ్రాయెల్ నేతలకు జేడీ వాన్స్ ఘాటు హెచ్చరిక..

JD Vance Slams Israeli Officials Over U.S.–Iran Deal, Exposing Rift Between Allies

అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు మరింత ముదిరాయి. ఇరాన్‌తో యుద్ధాన్ని ముగించేందుకు అమెరికా కుదుర్చుకున్న మధ్యంతర ఒప్పందం నేపథ్యంలో.. ఇజ్రాయెల్ ప్రభుత్వ సభ్యుల తీరుపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ సమాజంలో ఇజ్రాయెల్ ప్రస్తుతం పూర్తిగా ఏకాకిగా మిగిలిపోయిందని, తమ దేశం అందిస్తున్న సైనిక, దౌత్యపరమైన మద్దతును గుర్తించడంలో అక్కడి నాయకులు విఫలమయ్యారని ఆయన ఘాటుగా విమర్శించారు.

వైట్ హౌస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన వాన్స్.. ప్రస్తుత తరుణంలో ఇజ్రాయెల్ పట్ల సానుభూతితో ఉన్న ఏకైక ప్రపంచ దేశాధినేత డొనాల్డ్ ట్రంప్ మాత్రమేనని స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడే తమకు పెద్ద సమస్య అని ఇజ్రాయెల్‌లో ఎవరైనా భావిస్తే.. వారు భ్రమల నుంచి మేల్కొని వాస్తవ పరిస్థితులను గ్రహించాలని ఆయన హెచ్చరించారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్‌లు సంయుక్తంగా ఇరాన్‌పై యుద్ధాన్ని ప్రారంభించి, నెల రోజుల పాటు సైనిక చర్యలను సమన్వయం చేసుకున్నాయి. అయితే, ఏప్రిల్ 8న కుదిరిన ప్రాథమిక కాల్పుల విరమణ తర్వాత ఇరు దేశాల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పోరాటాన్ని కొనసాగించాలని పట్టుబట్టగా.. అమెరికాలో వస్తున్న తీవ్ర వ్యతిరేకత, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని యుద్ధాన్ని ముగించాలని ట్రంప్ ప్రయత్నించారు. తాజా కాల్పుల విరమణ ఒప్పందంపై నెతన్యాహు నేరుగా విమర్శలు చేయనప్పటికీ.. ఆయన మంత్రివర్గంలోని అతి జాతీయవాద పార్టీ నాయకుడు, జాతీయ భద్రతా మంత్రి ఇటామర్ బెన్-గ్విర్ మాత్రం తాము ట్రంప్ ఒప్పందానికి కట్టుబడి లేమని, అంతర్జాతీయ ఒత్తిళ్లకు లొంగబోమని తెగేసి చెప్పారు.

ఈ నేపథ్యంలో నెతన్యాహు క్యాబినెట్ సభ్యులను కృతఘ్నులుగా అభివర్ణించిన జేడీ వాన్స్.. అమెరికా పంపిన భారీ ఆయుధ సంపత్తితోనే ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకుంటోందనే నిజాన్ని మరిచిపోవద్దని గుర్తుచేశారు. ఈ తీవ్ర వ్యాఖ్యలపై స్పందించడానికి నెతన్యాహు కార్యాలయం నిరాకరించింది. అయితే, ఇటీవల కాలంలో ప్రధాని నెతన్యాహు ప్రవర్తనపై అధ్యక్షుడు ట్రంప్ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ఉనికికి తానే కారణమని చెప్పుకున్న ట్రంప్, చర్చల ప్రక్రియ మొత్తంలో ఇజ్రాయెల్‌ను పక్కన పెట్టడమే కాకుండా.. బీరూట్‌పై ఆ దేశం జరిపిన వైమానిక దాడులను కూడా తప్పుపట్టారు.

తాజా ఒప్పందంపై స్పందించిన నెతన్యాహు.. తమ దేశ భద్రతా అవసరాల దృష్ట్యా దక్షిణ లెబనాన్‌లోని ఆక్రమిత ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సైన్యం కొనసాగుతుందని ప్రకటించారు. అన్ని రకాల పోరాటాలను నిలిపివేసి, లెబనాన్ ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలనే అమెరికా-ఇరాన్ ఒప్పంద నిబంధనలకు ఈ వ్యాఖ్యలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. అయినప్పటికీ, తమతో కలిసి పోరాడిన అమెరికన్ మిత్రదేశంతో ఉన్న కీలక బంధాన్ని తాము ఎల్లప్పుడూ గౌరవిస్తామని, అభినందిస్తామని నెతన్యాహు పేర్కొనడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *