Skip to content
సంపాదకీయం వార్తలు

మహారాష్ట్రకు ఆపరేషన్‌ టైగర్‌

Prajapaksham 17 Jun 2026 1 నిమిషాల పఠనం సంపాదకీయం
మహారాష్ట్రకు ఆపరేషన్‌ టైగర్‌

Operation Tiger: Political Moves Intensify in Maharashtra

పశ్చిమ బెంగాల్‌లో అధికారం చేజిక్కించుకున్న అనంతరం, మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ను నిట్టనిలువునా చీల్చేందుకు ‘ఆపరేషన్‌ టైగర్‌’ ప్రాజెక్టును విజయవంతంగా నెరవేర్చిన బిజెపి నాయకత్వం, ఇప్పుడు దాన్ని మహారాష్ట్రకు విస్తరిస్తున్నట్లు తెలుస్తున్నది. ఉద్ధావ్‌ థాక్రే నాయకత్వంలోని శివసేన (యుబిటి) ఆదివారం ఏర్పాటు చేసిన తమ లోక్‌సభ సభ్యుల అత్యవసర సమావేశానికి 9మందిలో 5గురు హాజరు కాకపోవటంతో ఈ మేరకు ఊహాగానాలు బయలుదేరాయి.

ఈ వార్తను పార్టీ నాయకుడు సంజయ్‌ రౌత్‌ గట్టిగా ఖండించినప్పటికీ, పార్టీలను చీల్చటంలో, ఫిరాయింపులు ప్రోత్సహించటంలో బిజెపి శక్తిసామర్థ్యాలు ఇప్పటికే రుజువైనాయి. శివసేన(యుబిటి)కి చెందిన 7గురు లోక్‌సభ సభ్యులు, 17 మంది ఎమ్మెల్యేలు అధికారిక శివసేన నేత, ఉపముఖ్యమంత్రి ఏక్‌నాధ్‌ షిండెతో టచ్‌లో (బేరసారాల్లో) ఉన్నట్లు ఆ పార్టీకి చెందిన కృపాన్‌ తుమార్‌ మీడియాకు చెప్పారు. ఇందులో వాస్తవం ఉండవచ్చు, లేకపోవచ్చు, లేదా ప్రత్యర్థి పక్షంలో అలజడి రేకెత్తించే వ్యూహం కావచ్చు.

అయితే లోక్‌సభలో మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించలేక గత లోక్‌సభ సమావేశంలో 2011 జనాభా ప్రాతిపదికపై లోక్‌సభ సీట్లు 50 శాతం పెంపుదల, 33 శాతం మహిళా రిజర్వేషన్‌ అమలు, నియోజకవర్గాల పునర్విభజన నిమిత్తం 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఓడిపోయిన నేపథ్యంలో ఆ టార్గెట్‌ను సాధించి జులై మధ్యలో ప్రారంభమయ్యే పార్లమెంటు వర్షాకాల సమావేశంలో ఆ బిల్లులను మళ్లీ ప్రవేశపెట్టి విజయం సాధించాలని మోదీ ప్రభుత్వం పట్టుదలతో ఉన్నట్లు రోజూ ఊహాగాన వార్తలు వస్తున్నాయి.

ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన 7గురు రాజ్యసభ సభ్యులను రాఘవ్‌ చద్దా నాయకత్వంలో బిజెపి ఆకర్షించింది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌కు చెందిన తృణమూల్‌ కాంగ్రెస్‌ లోక్‌సభ సభ్యులు 20 మంది మాతృసంస్థ నుంచి బయటకువచ్చి, ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి తప్పించుకునేందుకు ఒక అనామక రిజిస్టర్డ్‌ పార్టీ నేషనలిస్ట్‌ సిటిజన్స్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా అనే దాంట్లో విలీనమయ్యారు.

తృణమూల్‌ కాంగ్రెస్‌లో ప్రత్యేక గ్రూపుగా వ్యవహరించాలని ఆలోచన చేసి, ఒక పార్లమెంటరీ పార్టీలోపల ప్రత్యేక గ్రూపుగా గుర్తింపుతో ‘అనర్హత’ వేటు తప్పించుకోలేమని తెలుసుకున్నాక బిజెపి వారి సహాయంతో ఆ రిజిస్టర్డ్‌ పార్టీని అన్వేషించారు. రాత్రికి రాత్రి విలీనం అయినట్లు, తిరుగుబాటు ఎంపిలకు నాయకత్వం వహిస్తున్న శ్రీమతి కాకోలి ఘోష్‌ దస్తీదార్‌ని అధ్యక్షురాలిగా ఎన్నుకున్నట్లు ఎన్నికల కమిషన్‌కు సోమవారం లేఖ ఇచ్చారు. అంతకుముందు, తాము దస్తీదార్‌ను తమ గ్రూపు నాయకురాలిగా ఎన్నుకున్నట్లు, తమ గ్రూపుకు సభలో విడిగా సీట్లు కేటాయించాలని కోరుతూ తిరుగుబాటుదారుల బృందం స్పీకర్‌ ఓం బిర్లాకు ఆదివారం లేఖ ఇచ్చారు. న్యాయసలహా తర్వాత ఆయన తమ అభిప్రాయం ప్రకటిస్తారని భావించబడుతున్నది.

ఇందుకు సమయం పడుతుంది. స్పీకర్‌ ఈ గ్రూపును ఎన్‌సిపిఐగా గుర్తిస్తూ నిర్ణయం ప్రకటించేలోపు వారు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు చేయవచ్చు. ఈ గ్రూపు ఎన్‌డిఎను బలపరుస్తున్నట్లు మొదటినుంచీ ప్రకటిస్తున్నది. ఎన్‌సిపిఐ అనేది గిరిజన సంక్షేమం, జాతీయవాదం, పరిపాలనా సంస్కరణలకు కృషిచేసే వేదికగా 2020లో రిజిస్టర్‌ అయింది. దీని కేంద్ర కార్యాలయం హౌరా జిల్లాలో ఒక చిన్న పల్లెటూరు. అది ముందుగా త్రిపురలో తన ఉనికిని చాటుకుంది. ఎన్నికల కమిషన్‌కు దాఖలు చేసిన పత్రాల ప్రకారం అడ్వొకేట్‌ షూలీ కుందు కోశాధికారి. ఆమె భర్త ఉట్టియకుందు పార్టీ అధ్యక్షుడు. అది గుర్తింపు పొందని రాజకీయ పార్టీగా 2023 జనవరిలో రిజిస్టర్‌ అయింది.

దాని ఎన్నికల గుర్తు ఫౌంటైన్‌ పెన్‌. ఆ పార్టీ ఫేస్‌బుక్‌ పోస్టులో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి సువేందు అధికారితో ఉట్టియ కుందు ఫోటో ఉంది. ఆ పార్టీ ఎంతటి అనామక పార్టీ అంటే అది త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులను పోటీ చేయిస్తే ముగ్గురికీ కలిపి 822 ఓట్లు వచ్చాయి.
మమతా బెనర్జీ విధేయుడు, టిఎంసి ఎమ్మెల్యే కునాల్‌ ఘోష్‌ వ్యాఖ్య ఈ పరిణామాన్ని తేటతెల్లం చేస్తున్నది. “ఈ ఫిరాయింపును ప్రోత్సహించిన పార్టీ తిరుగుబాటుదారులను తమ పార్టీలోకి ఆహ్వానించలేక అతి చిన్న మూడవ పార్టీలోకి పంపింది” అన్నారు. బిజెపి రూలు ప్రకారం తమ పార్టీలోకి ఎవరైనా ప్రజాప్రతినిధి ఫిరాయించదలుచుకుంటే ముందుగా ఆ పదవికి రాజీనామా చేయాలి.
28మంది తృణమూల్‌ కాంగ్రెస్‌ లోక్‌సభ సభ్యుల్లో 20మందితో కూడిన తిరుగుబాటుగ్రూపు (ఇప్పుడు ఎన్‌సిపిఐ) లోక్‌సభలో బిజెపి, కాంగ్రెస్‌ తర్వాత మూడవ పెద్ద పక్షంగా అవతరించింది. గత లోక్‌సభ ఎన్నికల్లో 240 సీట్లకే పరిమితమైన బిజెపి ప్రధానంగా టిడిపి, జనతాదళ్‌(యు), మరికొన్ని ఎన్‌డిఎ భాగస్వాముల తోడ్పాటుపై ఆధారపడి మెజారిటీ సంఖ్యను దాటింది. ఈ తృణమూల్‌ తిరుగుబాటుదారుల తోడ్పాటు కారణంగా బిల్లులు ఆమోదింపజేసుకోవటం ఒక అంశమైతే, టిడిపి, జనతాదళ్‌లు ఎప్పుడైనా తోకజాడించే (ఆ అవకాశమైతే ప్రస్తుతానికి లేదనుకోండి!) అవకాశాన్ని నిరోధిస్తుంది కూడా. బిజెపి వచ్చే మూడేళ్లు నిశ్చింతగా తన ఏకచ్ఛత్రాధిపత్యం కొనసాగించవచ్చు.
టిఎంసి తిరుగుబాటు ఎంపిలు తమదే అసలు టిఎంసి అని, రెండాకుల ఎన్నికల చిహ్నం తమకే చెందాలని ఎన్నికల కమిషన్‌ ముందు సుదీర్ఘ పోరాటం చేయటం కన్నా, ప్రత్యేక బ్లాక్‌(పార్టీ)గా తక్షణం పార్లమెంటరీ గుర్తింపు పొందేందుకు సౌలభ్యంగా ఎన్‌సిపిఐతో విలీనమార్గం ఎంచుకున్నారు. అయి తే బెంగాల్‌లోని తృణమూల్‌ తిరుగుబాటు ఎమ్మెల్యేలతో సంప్రదించకుండా ఎంపిలు ఏకపక్ష నిర్ణయం తీసుకోవటం “ప్రతిపక్ష నాయకుడు రిటబ్రత బెనర్జీ” గ్రూపును గందరగోళంలో పడేసింది. పార్టీ చీలిందని, తమదే అసలు సిసలు పార్టీ అని ఎన్నికల కమిషన్‌కు పిటిషన్‌ దాఖలు చేయాలంటే అసెంబ్లీ, పార్లమెంటు సభ్యుల్లో మూడింట రెండువంతుల తోడ్పాటు కావాలి. పార్టీ నిర్మాణంలో కూడా సగానికిపైగా వీరితో రావాలన్న సుప్రీంకోర్టు తీర్పు ఉంది.
టిఎంసి వ్యవస్థాపకురాలు మమతా బెనర్జీ ఈ పరిణామాలన్నింటిని గమనిస్తూ మౌనంగా ఉన్నారు. తిరుగుబాటుదారులపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత పిటిషన్‌ దాఖలు చేయకపోవటం ఆసక్తిదాయకం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *