ఉద్ధవ్ శిబిరానికి భారీ షాక్.. శివసేన (UBT)లో మరో చీలిక.. కొత్త గ్రూపుతో షిండే వర్గంలోకి ఆరుగురు ఎంపీలు!
Maharashtra Politics: Six MPs Reportedly Prepare to Distance Themselves from Uddhav Camp
మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి తీవ్ర సంచలనానికి వేదికయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (UBT) వర్గంలో మరో నిలువు చీలిక దాదాపు ఖాయమన్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. గురువారం పార్లమెంట్ భవనంలో జరిగిన ఆ పార్టీ పార్లమెంటరీ గ్రూప్ కీలక సమావేశం ఇందుకు వేదికైంది. ఈ భేటీలో వెలుగులోకి వచ్చిన పరిణామాలు ఉద్ధవ్ శిబిరంలోని అంతర్గత అసంతృప్తిని, తిరుగుబాటును స్పష్టంగా బయటపెట్టాయి.
శివసేన (UBT) పార్టీకి లోక్‌సభలో మొత్తం 9 మంది ఎంపీల బలం ఉంది. అయితే గురువారం నాటి అత్యంత కీలకమైన సమావేశానికి అనిల్ దేశాయ్, అర్వింద్ సావంత్, రాజాభావ్ వాజే అనే ముగ్గురు ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. మిగిలిన ఆరుగురు ఎంపీలు ఈ భేటీకి గైర్హాజరు కావడం పార్టీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఆరుగురు ఎంపీలు ఎప్పటి నుంచో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని అసలు శివసేనలో చేరతారనే ప్రచారం జరుగుతుండగా, తాజా గైర్హాజరు ఆ ప్రచారాన్ని నిజం చేసే దిశగా అడుగులు వేయిస్తోంది.
పార్టీ విప్ ఉన్నప్పటికీ ఎంపీలు రాకపోవడాన్ని ఉద్ధవ్ ఠాక్రే అత్యంత తీవ్రంగా పరిగణించారు. సమావేశానికి రాని ఆ ఆరుగురు ఎంపీలపై తక్షణమే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని, గైర్హాజరుపై గట్టి వివరణ కోరాలని ఆయన నిర్ణయించారు. ఈ వ్యవహారంలో అంతర్గతంగా మరో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. ఉద్ధవ్ ఠాక్రేకు షాక్ ఇస్తూ గైర్హాజరైన ఆరుగురు ఎంపీలు త్వరలోనే పార్లమెంట్‌లో ఒక కొత్త గ్రూప్‌గా ఏర్పడబోతున్నట్లు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో వినపడుతోంది. వీరంతా ఇప్పటికే లోక్‌సభ స్పీకర్‌ను కలిసి, తాము ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గంలో విలీనమవుతున్నామని, తమ విలీనాన్ని గుర్తించాలని కోరుతూ అధికారికంగా లేఖ కూడా సమర్పించినట్లు సమాచారం. ఇదే గనుక జరిగితే ఉద్ధవ్ ఠాక్రేకు ఇది కోలుకోలేని రాజకీయ దెబ్బ కానుంది.
ఉద్ధవ్ శిబిరం నుండి విడిపోతున్న ఈ కొత్త తిరుగుబాటు వర్గానికి నాయకుడిగా పర్భణీ లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ సంజయ్ హరిభావు జాధవ్ (బండు జాధవ్) పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. అందరూ ఆప్యాయంగా ‘బండు భాయ్’ అని పిలుచుకునే ఆయన, బాలాసాహెబ్ ఠాక్రే సిద్ధాంతాలకు కట్టుబడిన పాతతరం శివసైనికుడిగా పేరుపొందారు. సాధారణ కార్యకర్త స్థాయి నుండి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన పర్భణీ నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఆ తర్వాత వరుసగా మూడుసార్లు (హ్యాట్రిక్) ఎంపీగా గెలుపొంది నియోజకవర్గంలో తిరుగులేని పట్టు సాధించారు.
గతంలో 2020లో నాటి మహా వికాస్ అఘాడీ (MVA) ప్రభుత్వంలో మిత్రపక్షమైన ఎన్సీపీ వైఖరి వల్ల తన కేడర్‌కు న్యాయం చేయలేకపోతున్నానంటూ ఆయన తన ఎంపీ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. అప్పట్లో ఉద్ధవ్ ఠాక్రే నచ్చజెప్పడంతో వెనక్కి తగ్గారు. కానీ, ఇప్పుడు ఉద్ధవ్ వైఖరితో విసిగిపోయిన తిరుగుబాటు ఎంపీల వర్గానికి ఆయనే సారథ్యం వహించబోతుండటం గమనార్హం.
ఈ పరిణామాలపై ఉద్ధవ్ సేన ముఖ్య నేత, ఎంపీ సంజయ్ రౌత్ తీవ్రంగా స్పందించారు. పార్టీ బలాన్ని తాము ఎలాగైనా కాపాడుకుంటామని ధీమా వ్యక్తం చేస్తూనే, “పార్టీ పిలుపునకు గౌరవం ఇచ్చి సమావేశానికి రాని వారు ఎవరైనా సరే, వారు మనవారు కానే కారు” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం.. శివసేన (UBT) పార్లమెంటరీ పార్టీలో చీలిక అనేది ఇక కేవలం అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉన్న వ్యవహారంగా కనిపిస్తోంది. సంజయ్ బండు జాధవ్ లాంటి బలమైన, సీనియర్ నేత ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహిస్తుండటంతో ఉద్ధవ్ ఠాక్రే పట్టు చేజారిపోయిందనే వాదనలకు బలం చేకూరుతోంది.