Skip to content
జాతీయం వార్తలు

లేవండి.. మేల్కొనండి.. లక్ష్యాన్ని చేరే వరకు విశ్రమించకండి

Prajapaksham 12 Aug 2026 0 నిమిషాల పఠనం జాతీయం
లేవండి.. మేల్కొనండి.. లక్ష్యాన్ని చేరే వరకు విశ్రమించకండి

Youth

ఎవి. సుధాకర్‌.

యువత ఒక దేశానికి కేవలం భవిష్యత్తు మాత్రమే కాదు, వర్తమానాన్ని సైతం మార్చగల అపారమైన శక్తిరూపాలు. ఏ సమాజమైనా, దేశమైనా ప్రగతిపథంలో ముందుకు సాగాలంటే ఆ దేశ యువతలో ఉన్న ఆలోచనలు, ఉత్సాహం మరియు సృజనాత్మకత అత్యంత కీలకం. ప్రపంచంలో అత్యంత వేగంగా మారుతున్న రాజకీయ, ఆర్థిక, పర్యావరణ పరిస్థితుల నేపథ్యంలో యువత పాత్రను గుర్తించి, వారి ముందున్న సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరాన్ని ప్రపంచానికి చాటిచెప్పడానికే ప్రతి సంవత్సరం ఆగస్టు 12న ‘అంతర్జాతీయ యువజన దినోత్సవం‘ జరుపుకుంటారు. ఐక్యరాజ్యసమితి 1999లో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా 2000వ సంవత్సరం నుండి ఈ దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా అధికారికంగా నిర్వహిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా నేడు 10 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత సంఖ్య రికార్డు స్థాయిలో దాదాపు 120 కోట్లకు పైగా ఉంది. సామాజిక పరివర్తనలోనూ, ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేయడంలోనూ వీరి పాత్ర అమూల్యం. సాంకేతిక విప్లవం, డిజిటల్‌ యుగంలో నేటి యువత కొత్త ఆవిష్కరణలకు చిరునామాగా మారుతున్నారు. వాతావరణ మార్పులపై పోరాటం నుండి సామాజిక న్యా యం వరకు అనేక ప్రపంచ సమస్యలపై యువత గళం విప్పుతోంది. యువత శక్తిని, ఆలోచనలను సరైన దిశలో ఉపయోగిస్తే ఆర్థిక వ్యవస్థలు రూపాంతరం చెందడమే కాకుండా శాంతియుత సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది. అయితే, ప్రస్తుత సమాజంలో యువత అనేక సవాళ్లను మరియు మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. విద్యా వ్యవస్థల్లో నాణ్యతా లోపం, చదువుకు తగ్గ ఉద్యోగాలు దొరక్కపోవడం (నిరుద్యోగం), మరియు మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా నైపుణ్యాల కొరత ప్రధాన సమస్యలుగా మారాయి. దీనితో పాటు సోషల్‌ మీడియా ప్రభావం, ఆర్థిక అనిశ్చితి వల్ల నానాటికీ పెరుగుతున్న మానసిక ఆరోగ్య సమస్యలు యువతను కుంగదీస్తున్నాయి. ఉపాధి అవకాశాలు సరిగా లేని ప్రాంతాల్లో యువత తప్పుదోవ పట్ట డం, మత్తు పదార్థాల బారిన పడడం వంటి సామాజిక ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. ప్రస్తుత ప్రపంచంలో భారతదేశం, అనేక అభివృద్ధి చెందుతున్న ఆఫ్రికా, ఆసియా దేశాలు ‘జనాభా లబ్ధి‘ దశలో ఉన్నాయి.అనగా, ఈ దేశాల్లో వృద్ధులు మరియు పిల్లల కంటే ఉత్పాదకత కలిగిన యువ జనాభా శాతమే అత్యధికం. ఉదాహరణకు, భారతదేశంలో సగటు వయస్సు 28 ఏళ్లు కాగా, ఐరోపా, జపాన్‌ వంటి దేశాలు వేగంగా వృద్ధాప్య జనాభా వైపు పయనిస్తున్నాయి. ఈ భౌగోళిక అనుకూలత అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించే అరుదైన అవకాశాన్ని అందిస్తోంది.
నేటి యువత జన్మతః డిజిటల్‌ ప్రపంచంతో అనుబంధం ఉన్న ‘డిజిటల్‌ నేటివ్స్‌”, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, కోడింగ్‌, స్టార్టప్‌ సంస్కృతి, కంటెంట్‌ క్రియేషన్‌ వంటి రంగాల్లో యువత కొత్త విప్లవాన్ని సృష్టిస్తోంది. సాంప్రదాయ ఉద్యోగాలపై మాత్రమే ఆధారపడకుండా ’ఉపాధి కల్పించే స్థాయికి’ స్థాయికి ఎదుగుతూ గిగ్‌ ఎకానమీ, డిజిటల్‌ వ్యవస్థాపకతను ఊపిరిగా మలచుకుంటున్నారు. అయితే, సాంకేతికతపై అధిక ఆధారపడటం వల్ల వ్యక్తిగత సంబంధాలు తగ్గడం, సైబర్‌ నేరాలు, స్క్రీన్‌ టైమ్‌ పెరగడం వంటి కొత్త ప్రమాదాలనూ ఎదుర్కొంటున్నారు. రాజకీయ ప్రాతినిధ్యం విషయాని కి వస్తే, ప్రపంచ చట్టసభల్లో లేదా ప్రభుత్వ నిర్ణయాధికారాల్లో యువత భాగస్వామ్యం ఇంకా తక్కువగానే ఉంది. అయినప్పటికీ, ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా సాంకేతికత, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజాభిప్రాయాన్ని సమీకరించడంలో యువత కీలక పాత్ర పోషిస్తోంది. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పులపై గ్లోబల్‌ ఉద్యమాలు నిర్మించడం, సామాజిక న్యాయం కోసం గళమెత్తడంలో యువత నేడు ప్రపంచ నాయకత్వానికి సైతం మార్గదర్శకంగా నిలుస్తోంది. ఈ సమస్యలను అధిగమించడానికి కేవలం ప్రామాణిక విద్యను అందించడమే కాకుండా నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకతను ప్రోత్సహించే విధానాలు తక్షణ అవసరం. ప్రభుత్వ విధానాల రూపకల్పనలోనూ యువత భాగస్వామ్యానికి పెద్దపీట వేయాలి. అంతర్జాతీయ యువజన దినోత్సవం అనేది కేవలం అధికారిక కార్యక్రమాలకు పరిమితం కాకుండా, యువ శక్తికి సరైన మార్గదర్శకత్వం అందించి, వారి సృజనాత్మకతను సమాజ శ్రేయస్సుకు మలచుకోవడానికి ఒక బలమైన వేదిక గా ఉపయోగపడాలి.
(ఆగస్టు 12 జాతీయ యువజన దినోత్సవం)

ట్యాగ్‌లు: Flag missing youths national