ట్రంప్‌ను లేపేసేందుకు ఇరాన్ డెడ్లీ ప్లాన్: క్యాటరింగ్ లారీలో సీక్రెట్‌గా తప్పించుకున్న మాజీ అధ్యక్షుడు..
ఇరాన్ యుద్ధం నుంచి బయటపడదాం.. ట్రంప్‌కు సెంట్కామ్ అధిపతి డాన్ కెయిన్ సలహా
టర్కీ నుండి లండన్ తరలించేందుకు సీక్రెట్ ఆపరేషన్
వాషింగ్టన్ పోస్ట్ సంచలన కథనం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అనేక సార్లు హత్యా ప్రయత్నాలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇరాన్‌లో యుద్ధం ప్రారంభించిన తర్వాత ఆయనకు తీవ్రమైన బెదిరింపులు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది జులై 7-8 తేదీలలో టర్కీ నగరం అంకారాలో జరిగిన నాటో కూటమి సమావేశాల్లో పాల్గొన్న ట్రంప్ తిరుగు ప్రయాణంలో అత్యంత రహస్య ఆపరేషన్ ద్వారా అమెరికాకు వెళ్లిపోయారు. ఇరాన్ వర్గాలు హత్య చేస్తాయనే విశ్వసనీయమైన సమాచారం అందిన పూర్వ రంగంలో ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించి రహస్యమార్గంలో ట్రంప్‌ను అమెరికాకు తరలించారు. వాషింగ్టన్ పోస్ట్ సోమవారం ఈ కథనం ప్రచురించింది. హత్య ప్రమాదం నుండి తప్పించుకునేందుకు ట్రంప్ క్యాటరింగ్ లారీలో రహస్యంగా కొంతదూరం ప్రయాణించి ఆ తర్వాత చిన్న సైనిక విమానం ఎక్కి వెళ్లిపోయారు. టర్కీ నుండి తిరిగివెళ్లే మార్గమధ్యలో ట్రంప్‌ను క్షిపణి ప్రయోగం ద్వారా హత్య చేయాలని ఇరాన్ చేసిన ప్రణాళికను అమెరికా రక్షణ వర్గాలు భగ్నం చేశాయి.
అంకారాలో జరిగిన నాటో సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ, ఇరాన్ తనను హత్య చేసేందుకే ప్రధానంగా గురిపెట్టిందని, ఇరాన్ మొదటి లక్ష్యం తానేనని చెప్పిన విషయం ఈ సందర్భంగా గమనార్హం. పశ్చిమాసియాలో యుద్ధం ముగించేందుకు అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు విఫలమైన తర్వాత అమెరికా తిరిగి దాడులను పునరుద్ధరించింది. ఆ మరునాడే ట్రంప్ ఏ విమానంలో వెళుతున్నారో ఎవరికీ తెలియకుండా అంకారా నుండి రహస్యంగా తప్పించుకుని వాషింగ్టన్ చేరుకున్నారు.
ట్రంప్ అంకారా నగరానికి ఖతార్ దేశం బహుమతిగా ఇచ్చిన బ్రహ్మాండమైన కొత్త బోయింగ్ విమానం 747–8లో వెళ్లారు. కానీ తిరిగి వెళ్లేటప్పుడు పాత డొక్కు ఎయిర్‌ఫోర్స్-1 విమానం ఎక్కారు. జులై 8న ఈ దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజీలలో రికార్డయ్యాయి. పాత్రికేయులు కూడా ఆయనతోపాటే ప్రయాణం చేశారు. ట్రంప్ తమతోపాటే అదే విమానంలో లోపల క్యాబిన్‌లో ఉన్నారని పాత్రికేయులు, వారితోపాటు వైట్ హౌస్ అధికారులు కూడా భ్రమ పడ్డారు. కిటికీ తెరలు వేసుకోవాలని వారికి ఆదేశాలు వెళ్లడంతో వారంతా అలాగే చేశారు.
కానీ అసలైన ట్విస్ట్ ఏమిటంటే, ట్రంప్ అంకారాలో అసలు ఎయిర్‌ఫోర్స్-1 విమానం ఎక్కలేదు. విమానం ఎక్కినట్టు నటించారు. వెంటనే విమానం వెనుక నుండి విమాన తలుపు స్థాయికి ఎత్తిన క్యాటరింగ్ మినీ లారీలోకి ట్రంప్ ఎక్కారు. ఈ క్యాటరింగ్ లారీ అక్కడి నుండి వెళ్లిపోవడం కూడా కెమెరాల్లో రికార్డయింది. కానీ ట్రంప్ అందులో వెళతారని ఊహించలేదు. ఆయన రహస్యంగా అంకారాలోని ఫుడ్ డెలివరీ క్యాటరింగ్ ట్రక్కులో ఎక్కి వెళ్లి దూరంగా ఉన్న చిన్న సైనిక విమానం సి-32ఏలోకి ప్రవేశించారు.
ఇదేవిధమైన ఒక రహస్య ఆపరేషన్ 2000 సంవత్సరంలో బిల్ క్లింటన్ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు కూడా నిర్వహించారు. ఆయన కూడా ఇదేవిధంగా రహస్యంగా పాకిస్థాన్‌కు చేరుకుని అక్కడి నుండి అమెరికాకు వెళ్లిపోయారు. ట్రంప్ కూడా సి–32ఏ సైనిక విమానం ఎక్కి రాత్రి 10:56 గంటలకు లండన్ చేరుకుని అక్కడ ఎయిర్‌ఫోర్స్-1 విమానంలోంచి కిందికి దిగుతూ పాత్రికేయులకు కనిపించారు. అక్కడ సైనికులను కూడా పరామర్శించి కొద్దిసేపు వారితో గడిపి ఆ తర్వాత ఖతార్ బహూకరించిన కొత్త విమానంలోనే తిరిగి అమెరికా బయలుదేరారు.
అయితే సి–32ఏ విమానం నుండి తిరిగి ఎయిర్‌ఫోర్స్-1 విమానంలోకి ట్రంప్ ఎప్పుడు ఎక్కారనే విషయం అన్నింటికంటే అతిపెద్ద రహస్యంగా మారింది. ఎయిర్‌ఫోర్స్-1 విమానం పాతబడిపోవడంతో అత్యాధునికమైన భారీ విమానాన్ని ఖతార్ ప్రభుత్వం ట్రంప్‌కు బహుమతిగా ఇచ్చింది. ఆ తర్వాత ఈ విమానానికి బాగా ఖర్చుపెట్టి ఆధునిక సౌకర్యాలు, అత్యాధునిక జామర్లు, సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి నవీనీకరించారు.
కానీ ట్రంప్ అంకారాలో పాత విమానం ఎక్కడంతో అంతర్జాతీయ మీడియాలో పెద్ద చర్చనీయాంశమైంది. ఆయన కొత్త విమానం వదిలేసి ఎందుకు పాత విమానం ఎక్కారు? అని గతనెలలో చర్చ జరిగింది. కానీ ఆయన ఈ రెండు విమానాలు ఎక్కకుండా మూడో విమానంలో ప్రయాణం చేశారు. దీనిపై ట్రంప్‌ను పాత్రికేయులు నిలదీశారు. ఎందుకు కిటికీ తెరలు వేసుకోమన్నారని ప్రశ్నించగా, ప్రమాదకరమైన విమానంలో ప్రయాణం చేస్తున్నందువల్ల అలా చేయమని చెప్పి ఉండవచ్చునని వివరణ ఇచ్చారు.
దీనిపై వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవ్ చెంగ్ మాట్లాడుతూ, అమెరికాపై చాలామంది శత్రువులు కన్నువేశారని, అందువల్ల బెదిరింపులను ఎదుర్కోవడానికి తమకు అనుకూలంగా ఉన్న అన్ని సాధనాలను ఉపయోగిస్తామని చెప్పారు.