ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. ఆర్థిక ఇబ్బందులతో ఒకే ఫ్యాన్‌కు ఉరివేసుకున్నారు.. అనాథగా మారిన కొడుకు..
Love Couple Found Dead in Vikarabad; Police Launch Investigation
ఆర్థిక ఇబ్బందులు ఒక నిండు సంసారంలో ఎంతటి తీవ్ర విషాదాన్ని నింపాయో చెప్పడానికి రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. మోకిల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక ఘటన వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల పరిధిలోని జన్వాడ గ్రామానికి చెందిన బాలసాయి (32), సంగారెడ్డి జిల్లా కంది మండలం జుల్కల్ గ్రామానికి చెందిన పద్మ (25) ఏడాదిన్నర క్రితం పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. బాలసాయి నగరంలోని పటేల్‌గూడలో ఒక గదిని అద్దెకు తీసుకుని, ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. వీరికి ప్రస్తుతం ఐదు నెలల బాబు ఉన్నాడు. అయితే, కొంతకాలంగా ఆశించిన స్థాయిలో సంపాదన లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో భార్యాభర్తల మధ్య తరచూ మనస్పర్ధలు, గొడవలు జరుగుతున్నాయి.
ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలోనే దంపతులిద్దరూ తమ ఐదు నెలల బాబును తీసుకుని మూడు రోజుల క్రితం సొంత ఊరైన జన్వాడకు వచ్చారు. అక్కడ కూడా మానసిక వేదన అనుభవించిన బాలసాయి, పద్మ ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో ఇంట్లో తలుపులు వేసుకుని, ఒకే ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. కాసేపటి తర్వాత గదిలో నుంచి బాబు ఏడుపు గట్టిగా వినిపించడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు గది తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ దంపతులిద్దరూ విగతజీవులుగా వేలాడుతూ కనిపించడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న మోకిల పోలీసులు మృతదేహాలను కిందకు దించారు. అనంతరం పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కళ్లముందే తల్లిదండ్రులు లేక అనాథగా మారిన ఐదు నెలల పసికందును చూసి బంధువులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై మృతుల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మోకిల ఎస్‌ఐ సురేశ్ తెలిపారు.