ఐదు పెళ్లిళ్ల ‘కిలాడీ’ పెళ్లికూతురు అరెస్ట్.. ఎదురుకట్నాల పేరుతో లక్షలాది రూపాయలు దోచుకున్న నిందితురాలు..
Woman Arrested for Allegedly Cheating Men Through Marriages (1)
ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఐదు పెళ్లిళ్లు చేసుకుని అమాయక వరులను బురిడీ కొట్టించిన ఒక నిత్య పెళ్లికూతురి నిర్వాకం అనంతపురం జిల్లాలో కలకలం రేపింది. ఈ కిలాడీ పెళ్లికూతురు వజ్రపు మణి ఎలియాస్ శ్వేతారెడ్డి ఎలియాస్ కీర్తి(27)ని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. పెద్దవడుగూరు పోలీసులు అందించిన సమాచారం ప్రకారం..తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం దొండపూడి గ్రామానికి చెందిన వజ్రపు పాండు కుమార్తె మణి.
ఈమె సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో విజయవాడకు చెందిన సుమప్రియ, అశోక్, శశికళ, రామకృష్ణ అనే మధ్యవర్తులతో ఒక గ్యాంగ్‌గా ఏర్పడింది. ఈ బ్రోకర్ల ద్వారానే ఆమె పెళ్లి సంబంధాలు కుదుర్చుకుంటూ మోసాలకు తెరలేపింది. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కాశేపల్లి గ్రామానికి చెందిన యాపర్ల సుధీర్‌రెడ్డి అనే వ్యక్తి ఈమె వలలో చిక్కాడు. 2025లో సుధీర్‌రెడ్డి నిందితురాలికి ఏకంగా రూ.3.8 లక్షల ‘ఎదురుకట్నం’ ఇచ్చి ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అయితే, ఈ పెళ్లిళ్ల ద్వారా వచ్చే భారీ మొత్తంలో సింహభాగాన్ని మధ్యవర్తులే పంచుకోగా.. నిందితురాలైన మణికి కేవలం రూ.20 వేల నుండి 30 వేల వరకు మాత్రమే ముట్టజెప్పేవారు.
పెళ్లయిన తర్వాత సుధీర్‌రెడ్డి ఇంట్లో కేవలం మూడు రోజులు మాత్రమే ఉన్న నిందితురాలు, ఆయనతో దాంపత్య జీవితాన్ని ప్రారంభించకుండానే నాటకాలు మొదలుపెట్టింది. తనకు ఒంట్లో బాగోలేదని, అర్ధాంతరంగా పుట్టింటికి వెళ్లాలని భర్తను కోరింది. దాంతో నమ్మిన భర్త సుధీర్‌రెడ్డి, ఆమెను తీసుకుని రైలులో ఊరికి బయలుదేరాడు. కానీ, రైలు నంద్యాల స్టేషన్‌కు చేరుకోగానే.. నిందితురాలు మణి భర్త కళ్లుగప్పి చడీచప్పుడు కాకుండా రైలు దిగి మాయమైంది. స్టేషన్ మొత్తం గాలించినా భార్య ఆచూకీ దొరకకపోవడంతో సుధీర్‌రెడ్డి తాను మోసపోయినట్లు గ్రహించాడు. వెంటనే తనకు పెళ్లి కుదిర్చిన మధ్యవర్తులకు ఫోన్ చేయగా, వారందరి ఫోన్లు స్విచాఫ్ వచ్చాయి.
దీనిపై సుధీర్‌రెడ్డి వ్యక్తిగతంగా మణి పూర్వాపరాల గురించి ఆరా తీయగా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఆమెకు అప్పటికే ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారని, తనకంటే ముందే నలుగురిని పెళ్లి చేసుకుని ఇదే తరహాలో మోసం చేసిందని తేలింది. బాధితుడు 2025లోనే పెద్దవడుగూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి నిందితురాలి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో, నిందితురాలు మణి కర్ణాటకలోని మల్లెకుప్ప గ్రామానికి చెందిన మరో వ్యక్తిని కూడా ఐదో పెళ్లి చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తాజాగా తేలింది.
చివరకు ఆమె మల్లెకుప్ప నుంచి మదనపల్లెకు వస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పెద్దవడుగూరు ఎస్సై ఆంజనేయులు తన సిబ్బందితో కలిసి వెళ్లి నిందితురాలిని అరెస్టు చేశారు. మణితో పాటు ఆమెకు సహకరించిన మధ్యవర్తులందరిపైనా వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.